ప్లాన్: తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీ నేత గద్దర్?
పవన్ కల్యాణ్ జనసేన పార్టీని తెలంగాణలో గద్దర్ నడిపించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో పోటీ చేస్తామని పవన్ ప్రకటించడానికి కారణం అదేనంటున్నారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన సమయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక రకమైన ఉత్కంఠ కూడా చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ వ్యూహరచన చేస్తున్నారని అనుకున్నారు.
పవన్ కల్యాణ్ సభలు, పర్యటనలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. అక్కడి ప్రజా సమస్యలపైనే ఆయన స్పందిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో ఆయన తెలంగాణను వదిలేస్తారని భావించారు. అందుకే, తెలంగాణలోనూ పోటీ చేస్తామని ప్రకటించినప్పుడు కాస్తా అశ్చర్యం కూడా కలిగింది. తెలంగాణలో జనసేన పార్టీని నడిపేదెవరనే ప్రశ్న కూడా ఉదయించింది.
అయితే, గద్దర్ తెలంగాణలో జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గద్దర్‌పై పవన్ కల్యాణ్‌కు ఎనలేని అభిమానమనే విషయం తెలిసిందే. తన అభిమానాన్ని పవన్ కల్యాణ్ బహిరంగంగానే ప్రదర్శించారు. తెలంగాణలో గద్దర్‌కు ఉన్న ఇమేజ్ పనికి వస్తుందని భావిస్తున్నారు.

గద్దర్‌పై దాడి జరిగి 17 ఏళ్లు...
ప్రజా గాయకుడు గద్దర్‌పై ఆయన నివాసంలో దాడి జరిగి 17 ఏళ్లు అవుతోంది. ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. దాని నుంచి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఇంకా ఆయన శరీరంలో ఓ బుల్లెట్ ఉన్నట్లు సమాచారం. ఈ కేసు ఇప్పటి వరకు కొలిక్కి వచ్చినట్లు లేదు. ఎవరు దాడి చేశారనే విషయం తేలినట్లు కూడా లేదు.

గద్దరే జనసేనకు ఎందుకు...
ప్రజా గాయకుడు గద్దర్ విప్లవోద్యమానికి దూరమైనట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఆయన కార్యాచరణను రూపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పవన్ కల్యాణ్ జనసేన పార్టీని తెలంగాణలో ముందుకు నడిపించడానికి సిద్ధపడినట్లు సమాచారం. తన భావాలతో పవన్ కల్యాణ్ భావాలు కూడా కలుస్తుండడం వల్ల అందుకు ఆయన సిద్ధపడవచ్చునని అంటున్నారు.

ఆంధ్రలో పవన్ కల్యాణ్ ఏం చేస్తారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి దిగి చావో రేవో తేల్చుకుంటానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయన ఒంటరిగానే పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆయన జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. అయితే, చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి జనసేన పోటీ ఉపకరిస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. చంద్రబాబును గట్టెక్కించడానికే పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

తెలంగాణలోనూ గద్దర్ వస్తే అలాగే...
తెలంగాణలో గద్దర్ నాయకత్వంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే అది ప్రతిపక్షాలకు కాకుండా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీకి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయే వాతావరణం ఉంది. కెసిఆర్‌ను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏకతాటి మీదికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జనసేన దిగితే వారి మధ్య ఓట్లలో మరింతగా చీలిక వచ్చి కెసిఆర్‌కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

వరంగల్‌లో జగన్ చేసింది అదేనా....
కడియం శ్రీహరి రాజీనామా వల్ల వరంగల్ లోకసభకు ఆ మధ్య ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలు కాస్తా ఐక్యతను చాటే ప్రయత్నం చేశాయి. అయితే, జగన్ తన పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపారు. దీనివల్ల అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి లాభం జరిగిందనే అంచనాలు ఉన్నాయి. జగన్ చేసిన పనినే గద్దర్ నాయకత్వంలోని జనసేన తెలంగాణవ్యాప్తంగా చేస్తుందని అంటున్నారు.

పవన్ తెరాసకు అనుకూలమా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాను మంత్రి కెటిఆర్ చూసి అభినందించడం ఆ అనుమానాలకు తావిస్తోంది. ఈ సమయంలో కెటిఆర్‌పై తెలంగాణలోని కొంత మంది నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

కోదండరామ్‌కు కూడా చెక్....
గద్దర్ జనసేన పార్టీని తెలంగాణలో నడిపిస్తే తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు కూడా చెక్ పడుతుందని భావిస్తున్నారు. కోదండరామ్ తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఆయన ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దీంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ వంటి ప్రతిపక్షాలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. గద్దర్ జనసేన వల్ల కోదండరామ్ బలం తెలంగాణలో తగ్గుతుందని అనుకుంటున్నారు. ఇరువురు కూడా విప్లవ భావజాలం నుంచి వచ్చినవారే కావడం వల్ల అది జరుగుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications