పాదపూజ, వంగి వంగి దండాలు వద్దు : శశికళకు స్టాలిన్ చురకలు
పాదపూజ, సాష్టాంగ నమస్కారం, వంగి వంగి దండాలు పెట్టే సంస్కతిని వీడాలని, గంభీర నమస్కారంతో నేతలను ఆహ్వానిస్తే చాలని ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
చెన్నై: పాదపూజ, సాష్టాంగ నమస్కారం, వంగి వంగి దండాలు పెట్టే సంస్కతిని వీడాలని, గంభీర నమస్కారంతో నేతలను ఆహ్వానిస్తే చాలని పార్టీ క్యాడర్‌కు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
పార్టీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ పాదాభివందనాలకు దూరంగా ఉండాలని, కేవలం మర్యాదపూర్వకంగా నమస్కరిస్తే చాలన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ పార్టీ నాయకులకు నడుంవంచి నమస్కరించడం బానిసత్వానికి నిదర్శనమంటూ పరోక్షంగా అన్నాడీఎంకే నాయకులకు చురక అంటించారు.
పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ఆశీస్సులతో కార్యాచరణ అధ్యక్షుడి పదవిని భారమైన మనసుతోనే స్వీకరించారనని, ప్రస్తుతం పార్టీ పనుల్లో తలమునకలైన తనను పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు అభినందించేందుకు తరలివస్తున్నారన్నారు.

తనను కలుసుకునేందుకు వచ్చే సామాన్య కార్యకర్తలు సైతం నమస్కరిస్తే చాలునని, అంతకు మించి ఎలాంటి పొర్లుదండాలు పెట్టనవసరం లేదన్నారు. సమాజంలో కులమతాలకు అతీతంగా సమానత్వం కోసం తొలి నుంచీ పాటుపడుతున్న పార్టీ డీఎంకే మాత్రమేనని, మానవులంతా ఆత్మగౌరవంతో, అందరికీ సమాన హక్కులు ఉండే సమాజాన్ని రూపొందించడమే తన ధ్యేయమన్నారు.
అన్నాడీఎంకే చురకేనా?
స్టాలిన్ వ్యాఖ్యలు అన్నాడీఎంకేకు చురకలే అంటున్నారు. జయలలిత తర్వాత శశికళకు అన్నాడీఎంకే పార్టీ నాయకులు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. అదే సమయంలో స్టాలిన్ అధినేతగా ఎన్నికయ్యాక కొందరు కార్యకర్తలు అలాగే చేశారు. దీంతో ఆయన తాజాగా సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications