బీజేపీపై చంద్రబాబు ఆగ్రహానికి కారణాలివేనా?
అమరావతి: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకుల నడుమ మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నమొన్నటి వరకు సీఎం చంద్రబాబు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. పైపెచ్చు బీజేపీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మౌనం వహించాలంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అలాంటి చంద్రబాబునాయుడే సహనం నశించి ఇటీవల బీజేపీ నాయకులనుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పడానికి కూడా వెనకాడనంటూ వ్యాఖ్యానించారు. ఇంతకీ టీడీపీ అధినేతకు ఇంత ఆగ్రహం రావడానికి కారణాలేమిటి?

నోరు మెదపొద్దన్న చంద్రబాబు...
ఎన్డీఏ కూటమిలో భగస్వాములుగా ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు వ్యవహారాలపై మొన్నమొన్నటి వరకు సీఎం చంద్రబాబు నేరుగా స్పందించలేదు. అయితే కొంతమంది టీడీపీ నాయకులు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు. సహజంగానే బీజేపీ నాయకులు కూడా టీడీపీని ఉద్దేశించి పరుష వ్యాఖ్యానాలు చేశారు. అయితే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మొన్నీమధ్యనే ఫైర్ అయ్యారు. అవసరమైతే బీజేపీకి గుడ్‌బై చెప్పడానికి కూడా వెనకాడబోనంటూ హెచ్చరికలు చేశారు. అయినా తాను ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వంతోనే చూసుకుంటానని, ఈ విషయమై ఎవరూ మీడియా ఎదుట చర్చించకూడదని గతంలోనే చంద్రబాబు సొంత పార్టీ నేతలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

చంద్రబాబులోనూ అసహనం!
అయితే మహా సహనపరుడైన సీఎం చంద్రబాబునాయుడిలో కూడా బీజేపీ పట్ల ఇప్పుడిప్పుడే అసహనం తొంగిచూస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులే పేర్కొంటున్నారు. తాము బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతగా తగ్గి ఉందామనుకుంటున్నా.. దాన్ని బీజేపీ నాయకత్వం అలుసుగా తీసుకుని తమ పార్టీ, ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నట్లు కూడా చంద్రబాబు భావిస్తున్నారని ఇటీవల చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో పొత్తు...
విభజన తర్వాత కట్టుబట్టలతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా నిలబడాలంటే కేంద్ర సాయం తప్పనిసరన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని చంద్రబాబు మొదటి నుంచి పదేపదే చెబుతున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి అందవలసినవన్నీ అందుతాయన్న వ్యూహంతోనే ఇన్నేళ్లుగా చంద్రబాబునాయుడు ముందుకుసాగుతున్నారు.

చంద్రబాబులో పెరిగిన అసంతృప్తి...
అయితే విభజన చట్టంలోని హామీల విషయంలో కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉండటం.. నాలుగేళ్లు గడుస్తున్నా హామీల అమలుకు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో చంద్రబాబు కూడా అసంతృప్తితో ఉన్నారు. కానీ ఆయన ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. కేంద్రం నుంచి సాధించుకుంటామనే ఉద్దేశంతోనే బాబు ఇప్పటి వరకు రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సాయం... ప్రాజెక్టుల గురించి పదేపదే లేఖలు రాశారు. కానీ కేంద్ర నుంచి స్పందన మాత్రం అంతంత మాత్రమే ఉంటుందన్న అసంతృప్తి ప్రభుత్వ వర్గాల్లో చాలా రోజుల నుంచి ఉంది.

పోలవరం.. విపరీత ఆలస్యం...
పోలవరం విషయంలో కేంద్రం ఇటీవల వరుస అడ్డంకులు సృష్టించింది. ఉద్దేశపూర్వకంగా రాసిన లేఖలు... సృష్టించిన అడ్డంకుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం మూడు నెలలపాటు నత్తనడకన సాగింది. ఒకసారి పనులు ఆగితే మళ్లీ పనుల ప్రారంభించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్రంలో కదలిక రాలేదు. దీంతో ప్రొటొకాల్ పక్కన పెట్టి మరీ నాగపూర్ వెళ్లి.. కేంద్రమంత్రి గడ్కరీతో దీనిపై సంప్రదింపులు కూడా చేశారు. కానీ ఆలస్యం మాత్రం జరిగిపోయింది.

అదే ఆయన ఆగ్రహానికి కారణం...
ఇప్పడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కొత్తగా నవయుగ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంభందించిన ఒప్పందాలు పూర్తి కావాల్సి ఉంది. ఇలా అన్నీ విషయాల్లో కేంద్రం మిత్రపక్ష రాష్ట్రంతో వ్యవహరించినట్లు కాక తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండడమే ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర అసహనానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని బీజేపీ నేతలు చేస్తున్న ఓవరాక్షన్ కూడా చంద్రబాబును ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications