రెగ్యులర్ గా కాఫీ తాగుతున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
ఉదయం లేవగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది కాఫీ. కాఫీ తాగనిదే రోజూ గడిచిన భావన కూడా రాదు. రోజును ప్రారంభించడానికి, మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గించడానికి చాలా మంది కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీ తాగిన 10 నుండి 15 నిమిషాల్లోనే శరీరంపై దాని ప్రభావం ప్రారంభమవుతుంది. కాఫీని మితంగా తీసుకోవాలని అందరికీ తెలుసు. కాఫీని మితంగా తీసుకో వడం ఎంత అవసరమో దానిని తీసుకునే సరైన సమయం కూడా అంతే ముఖ్యం. కాఫీ ఏ టైం లో తీసుకోవాలి.. లేచిన వెంటనే కాఫీ తాగితే వచ్చే సమస్యల పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ఉదయం లేచిన వెంటనే కాఫీని తాగకూడదు. ఎందుకంటే ఉదయం సమయంలో శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కాఫీ తాగడం వల్ల గాబరా, అతి ఉద్దీపన, కెఫిన్ ఎక్కువగా, త్వరగా అలవాటు పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక నిద్ర లేచిన ఒక గంట తరువాత మొదటి కాఫీని తీసుకోవడం మంచిది. అలాగే మధ్యాహ్నం 1:00 నుంచి 3:00 గంటల మధ్య సమయంలో కూడా చాలా మంది కాఫీ తాగుతూ ఉంటారు. ఆ సమయంలో కాఫీ తాగితే అలసట తగ్గి ఉత్పాదకత పెరుగుతుంది. అయితే మధ్యాహ్నం తాగే కాఫీ రాత్రి నిద్రకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఇక వ్యాయామానికి ముందు కాఫీ తాగవచ్చు. ఇక సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాఫీ తీసుకోకపోవడమే మంచిది. అలాగే రోజుకు 3 నుండి 4 కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలి.

సమయం... పరిమితి అవసరం
కాఫీ స్వల్పంగా మూత్రవిసర్జనను పెంచుతుంది. కనుక నీటిని ఎక్కువగా తాగాలి. కాఫీని ఎక్కువగా తీసుకునే వారు దానిలో చక్కెర, క్రీమ్ వంటి వాటిని వేసుకోకపోవడమే మంచిది. అదే విధంగా ఖాళీ కడుపుతో కాఫీని తీసుకోకకూడదు. అల్పాహారం తీసుకున్న తరువాత మాత్రమే కాఫీని తీసుకోవడం మంచిది. ఇక కాఫీని ఒకేసారి ఎక్కువగా తాగడానికి బదులుగా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలి. కాఫీ తాగడం వల్ల మెదడు పనితీరు, శారీరక పనితీరు మెరుగు పడు తుంది. కాఫీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక కాఫీ గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే కాఫీని ఉదయం 9:30 నుండి 11:30 గంటల మధ్య తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications