టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు
ఉదయం నిద్ర లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. వేడి వేడి టీ కడుపులో పడ్డాకే మిగిలిన పనుల్లో నిమగ్నమవుతారు. అలాంటి వారు కొంచెం తమ అలవాట్లను మార్చుకోక తప్పదు. ఎందుకంటే- ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆరోగ్యంపై కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి కాబట్టి. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణశక్తి బలహీనపడుతుంది. ఎసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. శరీరంలో పోషకాల శోషణపై ప్రభావం చూపడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
పైగా టీలో చక్కెర కలుపుకోవడం సర్వసాధారణం. ఇందులో చక్కెర వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు నిపుణులు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం అధిక చక్కెర ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె, కొవ్వు కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది దీర్ఘకాలిక మంట, దంత క్షయం వంటి ఇతర అనారోగ్యాలకు కూడా దారితీసే అవకాశం ఉంది.

అధిక చక్కెర బరువు పెరగడానికి కారణమని చాలామందికి తెలుసు. ఆరోగ్య కారణాలతో టీ సేవించడాన్ని మానేయాల్సిన పనిలేదు. చక్కెర లేకుండానే రుచికరమైన, తీయని పానీయాలను సిద్ధం చేసుకోవచ్చు. సహజ పదార్థాలతో తీయగా చేయడం ఇప్పుడు ట్రెండ్. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం స్టెవియా..
చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం స్టెవియా. ఇది మొక్కల ఆధారిత సహజ స్వీటెనర్. తీయగా ఉన్నా రక్తంలో చక్కెరను పెంచదు. ఆకు/పొడి/ద్రవ రూపాల్లో లభిస్తుంది. health.clevelandclinic.org ప్రకారం ఈ జీరో-కేలరీల స్వీటెనర్ గ్లూకోజ్ నియంత్రణ, రక్తపోటును మెరుగుపరిచి, మధుమేహం నిర్వహణకు సురక్షితం.
కొబ్బరి చక్కెర..
కొబ్బరి నుండి తీసిన చక్కెర మరొక సహజ ప్రత్యామ్నాయం. దీని రుచి కొంత బెల్లాన్ని పోలి ఉంటుంది. టీకి ప్రత్యేకమైన సువాసనను తీసుకొస్తుంది ఇది. ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులలో ఇది బాగా ప్రాచుర్యం పొందుతోంది.
మాంక్ ఫ్రూట్..
మాంక్ ఫ్రూట్ ఇటీవల సామాజిక మాధ్యమాలలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. చక్కెర కంటే తీయగా ఉన్నా శరీరంపై ప్రభావం తక్కువ. ఇది చక్కెర మాదిరిగానే రుచిని ఇస్తుంది. విదేశాల్లో దీని వినియోగం అధికం. మాంక్ ఫ్రూట్‌లో మొగ్రోసైడ్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరం. దీనిని టీ, కాఫీ, బేకరీ వస్తువుల్లో చక్కెరకు బదులుగా వాడవచ్చు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
తేనె, చక్కెర లేకుండా టీని తీయగా చేయడానికి ప్రసిద్ధ, ఆరోగ్యకరమైన సహజ ప్రత్యామ్నాయం. ఇది ఏ పానీయానికైనా అద్భుతమైన స్వీటెనర్. ప్రయోజనాలు చెక్కుచెదరకుండా ఉండాలంటే, టీ కొద్దిగా చల్లబడిన తర్వాతే తేనె కలపాలి.
ఇతర ప్రత్యామ్నాయాలు లేకపోతే, బెల్లంతో టీ చేసుకోవచ్చు. ఐరన్, మెగ్నీషియం, పొటాషియంతో సహా ఖనిజాలను కలిగి ఉంటుంది. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పరిశోధనల ప్రకారం, ఇది రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పడిపోకుండా శక్తి స్థాయిలను స్థిరీకరిస్తుంది కానీ మితంగా వాడాలి. ఆయుర్వేదంలో పాత బెల్లం అధిక ఔషధ గుణాలు, మెరుగైన పోషక విలువలతో శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.












Click it and Unblock the Notifications