ఆ సమయంలో హనుమాన్ చాలీసా పఠించా: స్మిత్ కు ప్రధాని మోదీ వీడియో కాల్
దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని విధంగా చోటుచేసుకున్న కుట్ర పూరక దాడిలో గాయపడ్డ భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాల్ లో మాట్లాడారు. సుమారు తొమ్మిది నిమిషాలు పాటు సాగిందీ కాల్. ఆకాశంలో ఈ భయానక ముప్పు ఎదురైనప్పుడు ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలను అభినందించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్ 1073 (FZ1073) విమానానికి కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ప్రధాన పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. విమానం ఆకాశంలో 32,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కోపైలట్ ఊహించని రీతిలో హింసాత్మకంగా ప్రవర్తించాడు. విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విమానం క్రూజింగ్ ఎత్తు నుండి ఒక్కసారిగా వేల అడుగుల కిందకు పడిపోయింది. దానిని నియంత్రించడానికి స్మిత్ తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా కోపైలట్ జరిపిన ప్రాణాంతక దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడి వల్ల కెప్టెన్ స్మిత్ తల, ముఖానికి గాయమైంది. అయినా సరే.. ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడారు. ఈ పెనుగులాట సమయంలో స్మిత్.. ప్రయాణికులు ఉండే కేబిన్ తలుపులను అన్‌లాక్ చేయగలిగారు. ఆ వెంటనే ప్రాణభయంతో ఉన్న విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు కాక్‌పిట్ లోపలికి చొచ్చుకొచ్చారు. కోపైలట్‌ను బంధించారు. అదే ఫ్లైదుబాయ్ లో పాసింజర్లుగా ప్రయాణిస్తోన్న మరో ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి విమాన నియంత్రణ బాధ్యతలను తీసుకున్నారు.
అనంతరం దీన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి అక్కడ అత్యవసర ల్యాండింగ్ చేయగలిగారు. ప్రస్తుతం స్మిత్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయనతో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. ప్రశంసలు కురిపించారు. 9/11 తరహా ఉగ్రవాద విపత్తును ఓ భారతీయుడు అడ్డుకోగలిగాడని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పిన మాటలను గుర్తుచేశారు.
స్మిత్ భార్య సోనాల్, ఆయన తల్లిదండ్రులు భూపేంద్ర మచ్చర్, గీత తోనూ మాట్లాడారు ప్రధాని మోదీ. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మరోవైపు, కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌ను దేశం గర్వించదగ్గ నిజమైన కథానాయకుడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా వందలాది మంది గగనవిహారులను కాపాడటంలో స్మిత్ చూపిన అంకితభావం అమోఘమైనవని అన్నారు.
ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న అనుభవాలను స్మిత్.. ప్రధాని మోదీకి వివరించారు. భూమికి 34,000 అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడు ఎదురైన ప్రాణాపాయ పరిస్థితులు, తనకు అంతటి అసాధారణ మానసిక ధైర్యం ఎలా లభించిందనే విషయాలపై ప్రధానితో పంచుకున్నారు. ఆ సమయంలో తాను హనుమాన్ చాలీసాను పఠించానని వివరించారు. చావుకు అతి సమీపంలోకి వెళ్లినప్పటికీ వృత్తి ధర్మానికే ప్రాధాన్యతనిచ్చిన తీరును మోదీ అభినందించారు.












Click it and Unblock the Notifications
