జమిలి ఎన్నికలకు కేంద్రం ? సుప్రీం జడ్డీలతో భేటీకి జేపీసీ ప్లాన్..! చివరికి..!
నీట్ అక్రమాల తర్వాత జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనలతో దేశవ్యాప్తంగా పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోయాయి. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేద్దామనుకున్న ప్రధాని మోడీ దాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు ఎస్ఐఆర్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినా, కోట్లాది ఓట్లు తీసేస్తున్నా మౌనంగా ఉన్న కేంద్రం.. ఈసీలో దీనిపై తలెత్తిన విభేదాలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం తర్వాత ఆత్మరక్షణలో పడింది. ఇప్పుడు సీఈసీ రాజీనామా కోసం కాక్రోచ్ లు ఈసారి ముంబైలో నిరసనకు దిగుతున్నారు. దీంతో పరిస్ధితి చేజారకముందే కేంద్రం ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది.
ఇందులో భాగంగా 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' (One Nation, One Election) బిల్లుల పరిశీలనలో భాగంగా నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులతో ఈ నెల 6న సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత జమిలి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ జమిలి ఎన్నికల బిల్లులు పార్లమెంట్ లోకి రాకముందే ఇలా జేపీసీ సభ్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కలవనుండటం వివాదాస్పదమైంది. ఈ ప్రతిపాదిత భేటీ అత్యంత అసాధారణమని, రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్రంగా విమర్శించారు.

బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ అసలు ఏ అధికారంతో సుప్రీంకోర్టును ఇలాంటి సంప్రదింపుల కోసం ఆహ్వానించిందని కపిల్ సిబల్ నిలదీశారు. చట్టంగా మారక ముందే బిల్లులపై న్యాయమూర్తులతో చర్చించడం సరికాదన్నారు. ఈ తరహా ముందస్తు చర్చలు రాజ్యాంగం నిర్దేశించిన శాసన, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన సిద్ధాంతాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. దేశంలో చట్టాలు చేయడం పార్లమెంటు బాధ్యత కాగా, వాటి రాజ్యాంగబద్ధతను సమీక్షించడం న్యాయవ్యవస్థ బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. పార్లమెంటు పరిధిలో ఉన్న బిల్లును ముందే న్యాయమూర్తులకు వివరించడం వల్ల, భవిష్యత్తులో ఒకవేళ ఈ చట్టాన్ని అదే కోర్టులో సవాలు చేసినప్పుడు నిష్పాక్షికత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ వివాదం రాజకీయంగా తీవ్రరూపం దాల్చడంతో అటువంటి సమావేశమేదీ జరగడం లేదని సుప్రీంకోర్టు వర్గాలు స్పష్టం చేశాయి. జేపీసీ సభ్యులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ, ఇతర న్యాయమూర్తులు గానీ ఎలాంటి ప్రత్యేక చర్చలు జరపడం లేదని, అటువంటి సమావేశం ఏదీ ఖరారు కాలేదని స్పష్టం చేశాయి. దీంతో వివాదం సద్దుమణిగింది.














Click it and Unblock the Notifications
