కంది పచ్చడి ఇలా చేస్తే స్వర్గానికి బెత్తెడే దూరం!
ఆంధ్రా ఇళ్లలో కూరలు తినబుద్ధి కాకపోయినా, రొటీన్ వంటలతో విసుగొచ్చినా గుర్తొచ్చే సాంప్రదాయ వంటకం కంది పచ్చడి. ఇది చాలా సులభం, రుచికరం. కేవలం 10 నిమిషాల్లో సిద్ధమవుతుంది. వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే నిజంగా అమృతంలా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
కందిపప్పు : పావు కప్పు
మినపప్పు : 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు : 15-20
కరివేపాకు : పావు కప్పు
జీలకర్ర : 1 టీస్పూన్
చింతపండు : చిన్న నిమ్మకాయ సైజు (వేడి నీళ్లలో నానబెట్టినది)
వెల్లుల్లి రెబ్బలు : 3-4
ఉప్పు : రుచికి సరిపడా
కాచి చల్లార్చిన నీళ్లు
తాలింపుకు: 1-2 టేబుల్ స్పూన్ నూనె,
1 టీస్పూన్ ఆవాలు,
పావు టీస్పూన్ ఇంగువ,
పావు టీస్పూన్ పసుపు,
కొద్దిగా కరివేపాకు

తయారీ విధానం:
ముందుగా చింతపండును కొద్దిగా వేడి నీళ్లలో నానబెట్టండి. పాన్‌లో సన్నటి సెగపై కందిపప్పు వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత మినపప్పు వేసి కాస్త వేయించి, ఎండు మిరపకాయలు వేసి వేయించండి. కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి, చివరగా జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. దినుసులు పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన దినుసులను మిక్సీలో వేసి ఉప్పు కలిపి ముందుగా పొడిగా గ్రైండ్ చేయండి.
ఆ తర్వాత నానబెట్టిన చింతపండు నీళ్లతో సహా, వెల్లుల్లి రెబ్బలు వేసి, కాచి చల్లార్చిన నీళ్లు కొద్దిగా పోస్తూ బరకగా రోటి పచ్చడి లాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు తాలింపు కోసం నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించి, ఈ తాలింపును పచ్చడిలో కలపండి.
కాచి చల్లార్చిన నీళ్లు వాడితే ఫ్రిడ్జ్‌లో 8-10 రోజులు నిల్వ ఉంటుంది. పొడి దశలోనే ఆపితే ఇడ్లీ-దోశలకు కూడా వాడుకోవచ్చు. మరీ మెత్తగా రుబ్బకుండా కాస్త బరకగా ఉంచితే రుచి బాగుంటుంది. ఇంట్లో ఏం లేకపోయినా ఈ కంది పచ్చడి చేసుకుంటే భోజనం రుచిగా అవుతుంది.వేడి అన్నంలో ఈ పచ్చడి, చెంచాడు నెయ్యి కలిపి ఉల్లిపాయ లేదా అప్పడంతో తింటే రుచి మరపురానిది.













Click it and Unblock the Notifications
