మైదాతో చేసిన సమోసా, పఫ్ వగైరాలు తింటున్నారా?
చాలామంది మైదాతో చేసిన ఆహార పదార్థాలను తింటారు. బయట స్నాక్స్ రూపంలో దొరికే వాటిలోనూ పఫ్ లు, నూడిల్స్, మంచూరియా, బ్రెడ్, బిస్కెట్, సమోసా ఇలా ఎందులో చూసినా మైదానే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో మైదాపిండి లేకుండా మార్కెట్లో ఆహారపదార్థాలు దొరకడం కష్టమే. అయితే మైదాతో చేసిన పదార్ధాలు రుచిగా ఉండటం వల్ల, మైదాతో అనారోగ్యం అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా తింటున్నారు చాలామంది.
అయితే మైదా ఎక్కువగా తింటే డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మైదా వాడకం శృతి మించితే అనారోగ్యం కలుగుతుందని చెబుతున్నారు. మైదాని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల మధుమేహం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మైదా పిండితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల అవి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతాయని, దీనివల జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు మైదా పిండితో తయారు చేసిన వస్తువులు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాం అని, దీంతో ఊబకాయం, రక్తహీనత బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
మైదా పిండితో తయారు చేసిన సమోసా, కచోరి వంటివి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక పిల్లలు పఫ్స్ వంటి మైదాతో తయారు చేసిన పదార్థాలను ఇష్టంగా తింటారు. కాబట్టి వారికి మైదాతో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల కలిగే అనర్థాలను అర్థమయ్యేలా చెప్పాలని సూచిస్తున్నారు.

ఇక ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు మైదా వినియోగాన్ని తగ్గించాలని, దానికి బదులుగా గోధుమలు, చిరుధాన్యాలతో వంటలు తయారు చేసుకుని తినవచ్చని చెబుతున్నారు. ఇక మైదాకు వీలైనంత దూరంగా ఉంటూ సమతుల ఆహారం తీసుకుంటే, ప్రతి రోజు ఒక గంట పాటు వ్యాయామం చేస్తే, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications