గంగవల్లి కూర మామిడికాయ పప్పు.. సమ్మర్ సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!
సంప్రదాయ గంగవల్లి కూర మామిడికాయ పప్పు ఈ సమ్మర్ సీజన్ లో మంచి పౌష్టికాహారం . గంగవల్లి కూర మామిడికాయ పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని గంగబాయల కూర, గంగవాలి కూర అని కూడా అంటారు. దీన్ని అనేక మంది అద్భుతమైన వేసవి సూపర్ ఫుడ్‌గా చెబుతారు. తెలుగువారి ఇళ్ళలో సీజన్ కి తగ్గ ఆహారాన్ని తినే క్రమంలో ఈ సీజన్ లో తప్పనిసరిగా గంగవాలి కూర మామిడికాయ పప్పు తినాల్సిందే.
తయారీకి కావలసిన పదార్థాలు
గంగవల్లి కూర - 2 కట్టలు
మామిడికాయ - ఒకటి చిన్నది
కందిపప్పు - 1 కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి – 4
వెల్లుల్లి – 4 రెబ్బలు
కారం – 1 1/2 స్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 2 స్పూన్లు
పోపు గింజలు - ఒక స్పూన్
ఎండు మిర్చి - 2
కరివేపాకు- రెండు రెమ్మలు

తయారీ విధానం
ముందుగా కుక్కర్ తీసుకుని కప్పు కందిపప్పును శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకుని, అందులో శుభ్రంగా కడిగి కట్ చేసిన గంగవల్లి కూర, చిన్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసి సరిపడా నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి.
ఇలా పోపు వేస్తే కమ్మని పప్పు రెడీ
మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కుక్కర్ విజిల్ వదిలిన తర్వాత మూత తీసి అందులో పావు స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూను కారం, ఉప్పు వేసి బాగా కలిపి , తర్వాత వేరొక పాన్ లో రెండు స్పూన్ల నూనె వేసి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి.
అన్నంలో సూపర్ టేస్టీ పప్పు
ఈ పోపును మనం రెడీ చేసుకున్న పప్పులో కలుపుకోవాలి. ఆ తర్వాత పప్పును స్టవ్ మీద సిమ్ లో పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన గంగవల్లి కూర మామిడికాయ పప్పు రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది












Click it and Unblock the Notifications