ఖాళీ కడుపుతో టీ తాగొద్దు భాయ్.. దెబ్బయ్ పోతావ్
ఉదయం నిద్ర లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. వేడి వేడి టీ కడుపులో పడ్డాకే మిగిలిన పనుల్లో నిమగ్నమవుతారు. అలాంటి వారు కొంచెం తమ అలవాట్లను మార్చుకోక తప్పదు. ఎందుకంటే- ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆరోగ్యంపై కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి కాబట్టి. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణశక్తి బలహీనపడుతుంది. ఎసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. శరీరంలో పోషకాల శోషణపై ప్రభావం చూపడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో- మొదటగా తలెత్తేది ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలే. అవి ఒక్కసారి వచ్చాయంటే.. ఇప్పుడిప్పుడే వీడి వెళ్లవు కూడా. టీలో ఉండే కెఫిన్ కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు కారణమౌతుంది. ఫలితంగా ఆకలిని తగ్గిపోతుంది. దీంతో శరీరానికి అవసరమైన పోషణ లభించక పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు.

టీలో ఉండే కెఫిన్ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పటి నుంచో ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు వారిలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. రక్తహీనత వంటి సమస్యలు తలెత్తడానికి ఇది ఒక కారణం. అధికంగా టీ తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. పరగడుపున టీ తాగినప్పుడు ఈ ప్రభావం మరింత తీవ్రమౌతుంది. మానసిక కల్లోలం, చిరాకు, నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది.
టీలోని కెఫిన్ మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరం నుండి నీటిని తొలగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. చర్మ సమస్యలు, అలసట, బలహీనత వంటివి చుట్టుముట్టతాయి. టీలోని ఆమ్లాలు- ముఖ్యంగా చక్కెరతో కలిసినప్పుడు, నోటిలో ఆమ్ల స్థాయిలను పెంచుతాయి. ఇది దంతాల ఎనామెల్‌ను నాశనం చేస్తుంది. అధిక పరిమాణంలో, ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారి, దీర్ఘకాలంలో ఎముకలు బలహీనపడవచ్చు.
పరగడుపున టీ తాగే అలవాటు క్రమంగా దీర్ఘకాల ఆరోగ్యానికి పునాది వేస్తుంది. శరీరానికి హానికారకమౌతుంది. అల్పాహారం తర్వాత టీ తాగడం చాలామంచిది. లేదా కనీసం బన్, బ్రెడ్ లేదా బిస్కట్ల వంటితో కలుపుకొని టీ తాగినా ఫర్వాలేదు. కెఫిన్ తీవ్రత కొంతవరకు తగ్గినట్టవుతుంది. పరగడుపున టీ తాగే ముందు కొన్ని బిస్కెట్లయినా తినవచ్చు. లేదా బ్రెడ్, బన్ వంటివి తీసుకుంటే కొంత వరకు శరీరానికి మేలు కలుగుతుంది. ఒకవేళ ఖాళీ కడుపుతోనే టీ తాగాలని అనిపిస్తే.. హెర్బల్ టీ తీసుకోవడం ఉత్తమం.












Click it and Unblock the Notifications