health tips: ఆస్పత్రులకు వెళ్ళలేకపోతున్నారా? టెలీ మెడిసిన్ ఉందిగా మీకోసం!!
చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆసుపత్రులకు తీసుకు వెళ్లే వాళ్ళు కావాలి.. ఆసుపత్రిలో గంటల తరబడి డాక్టర్ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూడాలి... చిన్నచిన్న అనారోగ్యాలకు ఆసుపత్రికి వెళితే టెస్టుల పేరుతో వైద్యులు పెట్టించే ఖర్చులను భరించాలి వంటి కారణాలతో చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటూ ఆసుపత్రులకు వెళ్లకుండా కాలం గడుపుతున్నారు.
ఇక అటువంటి వారికోసం టెలీ మెడిసిన్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కరోనామహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ విధానం, ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం టెలిమెడిసిన్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక వ్యాధులకు మందులు ఇస్తున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా వైద్యుల్ని సంప్రదించి తనకు ఉన్న అనారోగ్యలక్షణాలను వైద్యులకు చెప్పి వారినుండి నేరుగా ఏ మందులు వేసుకోవాలో, ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకొని తదనుగుణంగా అనారోగ్యసమస్యల నుండి ఉపశమనం పొందుతున్నారు.

ఇక ఈ టెలీ మెడిసిన్ ద్వారా సాధారణ జ్వరాలు, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలకు వైద్యం చేయడమే కాకుండా, ఆర్థో, డెర్మటాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ తదితర సేవలను అందిస్తున్నారు. టెలి మెడిసిన్ ద్వారా వైద్యం పొందాలి అనుకునే వారికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. సమయం వృధా కాకుండా ఉంటుంది.
ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇతర సమయాలలో కూడా వైద్యులను మనం టెలిమెడిసిన్ ద్వారా సంప్రదించవచ్చు. భారతదేశంలో చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పటికీ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీనికి సాధారణ కన్సల్టెన్సీ ఫీజ్ కంటే కొంచెం ఫీజు తక్కువగా ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంజీవని ద్వారా టెలీ మెడిసిన్ సేవలు అందిస్తోంది.
అంతేకాదు ఆన్లైన్లో యాప్ లేదా పోర్టల్ ద్వారా నిపుణులైన వైద్యుల నుండి ఈ విధానంలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఆస్పత్రికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న వారు ఈ టెలీ మెడిసిన్ సేవలను ఉపయోగించుకుంటే మంచిది.












Click it and Unblock the Notifications