హైబీపీ బాధితుల కోసం DASH డైట్ - ముప్పు తప్పించుకోవచ్చు..!!
హైబీపీ - అధిక రక్తపోటు. ఇప్పుడు ప్రతీ ఇంటా సాధారణంగా రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్న వారు కనిపిస్తున్నారు. బీపీ పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. శారీరక శ్రమ లేకపోవటం తో పాటుగా ఆహారంలో సమతుల్యత లేకపోవటం..కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం.. ఒత్తిడి.. నిద్ర సరిగ్గా లేకపోవటం వంటి కారణాలు బీపీ పెరగటానికి దోహదం చేస్తాయి. అయితే హైబీపీ ఉన్నవారు డాక్టర్ ఇచ్చే మందులను వాడడంతోపాటు DASH అనే ఒక రకం డైట్‌ను పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు తో బాధ పడుతున్న వారు DASH (Dietary Approaches to Stop Hypertension) అని పిలవబడే ఈ డ్యాష్ డైట్‌ను పాటిస్తే బీపీ నియంత్రణలో ఉండడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డ్యాష్ డైట్‌లో భాగంగా పండ్లు, కూరగాయలను అధికంగా తినాల్సి ఉంటుంది. వీటిల్లో పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీ అదుపులో ఉండేలా చూస్తాయి. పాలకూర, కొత్తిమీర, పుదీనా, బ్రోకలీ, క్యారెట్లు, టొమాటోలు, చిలగడ దుంపలు, ఆలుగడ్డలు (పొట్టుతో), బీట్‌రూట్ వంటి కూరగాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. అదే విధంగా బెర్రీలు, అవకాడోలు, డ్రై యాప్రికాట్స్, దానిమ్మ పండ్లు వంటి పండ్లను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బీపీ నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.

ఇక, బీపీతో బాధపడుతున్న వారికి తృణ ధాన్యాలను రోజూ తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచటంతో పాటుగా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్, ఓట్స్, కినోవా, హోల్ వీట్ పాస్తా, బార్లీ వంటి ఆహారాలను తీసుకోవటం ద్వారా బీపీ అదుపులో ఉంటుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి అదే విధంగా శాచురేటెడ్ కొవ్వులు తక్కువగా ఉండే మాంసాహారం తీసుకోవాలి. సాల్మన్, మాకరెల్, ట్యూనా వంటి చేపల్లో ఈ పోషకాలు మనకు అధికంగా లభిస్తాయి. బీపీ అదుపులో ఉండడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చికెన్ తినాలనుకుంటే తప్పనిసరిగా స్కిన్‌ను తీసేసి తినాలి. అలాగే పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకోవాలి. బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలను కూడా తినవచ్చు. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇవి రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీ అదుపులో ఉండేలా చేస్తాయి. ఇలా డ్యాష్ డైట్‌ను పాటిస్తుంటే హైబీపీ ఉన్నవారు తమ బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications