వైద్య చరిత్రలో మైలురాయి: అపెండిక్స్ తో మూత్రనాళం, సొంత కిడ్నీ మార్పిడి

హైదరాబాద్: చావు అంచుల దాకా వెళ్లి వ‌చ్చిన ఓ వృద్ధుడిని అత్యాధునిక‌, అరుదైన శ‌స్త్రచికిత్స‌ల‌తో కాపాడారు హైద‌రాబాద్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) ఆస్ప‌త్రి వైద్యులు. అత‌డి సొంత అపెండిక్స్ ను ఉపయోగించి మూత్రనాళాన్ని పున‌రుద్ధ‌రించ‌డంతోపాటు, పాడైపోతున్న కిడ్నీని శరీరంలోనే మరోచోటుకు మార్చి వైద్యరంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు 2023లో వేరేచోట కిడ్నీలో రాళ్ల తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్న త‌ర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దురదృష్టవశాత్తు, ఆపరేషన్ అనంత‌రం అతడి మూత్రనాళాలు పూర్తిగా పూడుకుపోయాయి. దీంతో క్రియాటినైన్ స్థాయిలు ప్ర‌మాద‌క‌రంగా పెరిగిపోయి, భరించలేని నొప్పి, త‌రచు జ్వ‌రంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. రెండు కిడ్నీలు దెబ్బతిన‌డంతో తాత్కాలికంగా నెఫ్రోస్ట‌మీ ట్యూబులు అమ‌ర్చి, మూత్రాన్ని బ‌య‌టికి పంపించాల్సి వ‌చ్చింది. ప‌లు రాష్ట్రాల్లోని అనేక ఆస్ప‌త్రులు అత‌డిని చేర్చుకోవ‌డానికి నిరాక‌రించ‌డంతో, చివ‌ర‌కు హైద‌రాబాద్‌లోని ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రిని ఆశ్ర‌యించారు.

Hyderabad Doctors Perform Medical Marvel Use Appendix Auto-Transplant Kidney to Save Life

అరుదైన అపెండిక్స్ ఇంట‌ర్‌పొజిష‌న్‌..

వృద్ధుడిని ప‌రీక్షించిన ఏఐఎన్‌యూ వైద్యులు, అత‌డి మూత్ర‌నాళాలు ఊహించ‌ని విధంగా పూర్తిగా మూసుకుపోయిన‌ట్లు గుర్తించారు. ఇది చాలా అరుదైన‌, క్లిష్ట‌మైన ప‌రిస్థితి. మొదట, కుడి వైపు కిడ్నీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి వైద్యులు వినూత్న ప‌ద్ధ‌తిని ఎంచుకున్నారు. రోగి సొంత అపెండిక్స్‌ను తీసుకుని, మూసుకుపోయిన మూత్ర‌నాళం స్థానంలో దాన్ని రోబోటిక్ శ‌స్త్రచికిత్స ద్వారా అమ‌ర్చారు. అపెండిక్స్ దాదాపు మూత్ర‌నాళం ప‌రిమాణంలోనే ఉంటుంది. అపెండిక్స్ ఇంట‌ర్‌పొజిష‌న్ అని పిలిచే ఈ ప‌ద్ధ‌తి అత్యంత అరుదుగా చేస్తారు.

ఈ చికిత్స‌పై ఏఐఎన్‌యూలోని సీనియ‌ర్ క‌న్సల్టెంట్ రోబోటిక్ స‌ర్జ‌న్, యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ స‌య్య‌ద్ మ‌హ్మ‌ద్ గౌస్ మాట్లాడుతూ, "మూత్ర‌నాళం తీవ్రంగా పూడిపోయిన‌ప్పుడు దీన్ని బాగుచేయ‌డానికి ఇది అత్యంత సృజ‌నాత్మ‌క‌మైన‌, మినిమ‌ల్లీ ఇన్వేజివ్ ప‌ద్ధ‌తి. సాధార‌ణంగా ఇలాంటి కేసులు ఎదురవ్వవు, కానీ ఈ రోగికి ఇదే స‌రైన ప‌రిష్కారం" అని వివ‌రించారు. ఈ చికిత్స‌తో అత‌డి కుడి కిడ్నీ ప‌నితీరు మెరుగుప‌డ‌టంతో బ‌య‌ట అమ‌ర్చిన ట్యూబుల్లో ఒక‌దాన్ని తీసేశారు.

సొంత కిడ్నీనే మార్చి...
కుడివైపు స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యాక, రెండు నెల‌ల త‌ర్వాత ఎడ‌మ వైపు కిడ్నీ విష‌యం ప‌రిశీలించారు. ఎడ‌మ వైపు కూడా మూత్ర‌నాళం పాడైపోయింది. కుడి వైపు అపెండిక్స్ వాడేశారు కాబ‌ట్టి, ఎడ‌మ వైపు మ‌రో పేగు భాగాన్ని వాడ‌వ‌చ్చ‌ని అనుకున్నా, రోగికి ఉన్న పేగుల స‌మ‌స్య‌ల కార‌ణంగా అది సాధ్యం కాలేదు. దీంతో వైద్యులు మ‌రో అరుదైన‌, సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు: రోగి సొంత ఎడ‌మ కిడ్నీని శ‌రీరంలోనే వేరే చోటుకు మార్చ‌డం (ఆటో-ట్రాన్స్‌ప్లాంటేష‌న్).

ఈ సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌లో, రోగి ఎడ‌మ కిడ్నీని దాని ర‌క్త‌నాళాల‌తో స‌హా జాగ్ర‌త్త‌గా వేరు చేసి, కింది భాగంలో, పాడైన మూత్ర‌నాళం భాగాన్ని బైపాస్ చేసేలా అమ‌ర్చారు. దీని ద్వారా మూత్రం స‌క్ర‌మంగా వెళ్లే మార్గం ఏర్ప‌డింది.క‌న్సల్టెంట్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ విజ‌య్ మ‌ద్దూరి మాట్లాడుతూ, "సొంత కిడ్నీ మార్పిడి అనేది అత్యంత సంక్లిష్ట‌మైన‌ది, చాలా పెద్ద ఆస్ప‌త్రుల్లోనే చేసే చిట్ట‌చివ‌రి ప‌రిష్కారం. ఇది చాలా క‌చ్చిత‌త్వంతో, నిపుణ‌త్వంతో చేయాల్సిన శ‌స్త్రచికిత్స‌. అత‌డి శ‌రీరంలోనే అత‌డి కిడ్నీకి వేరే సుర‌క్షిత‌మైన స్థానాన్ని కల్పించాం" అని తెలిపారు.

పూర్తిగా కోలుకున్న వృద్ధుడు
ఈ రెండు అరుదైన‌, విజ‌య‌వంత‌మైన శ‌స్త్రచికిత్స‌ల ఫ‌లితంగా, బెంగాలీ వృద్ధుడు ఇప్పుడు పూర్తి సాధార‌ణ ఆరోగ్య స్థితికి చేరుకున్నారు. అత‌డి రెండు కిడ్నీలు స‌క్ర‌మంగా ప‌నిచేస్తున్నాయి, క్రియాటినైన్ స్థాయి సాధార‌ణంగా ఉంది. నొప్పితోపాటు ఇత‌ర స‌మ‌స్య‌ల నుంచి పూర్తిగా విముక్తి పొందారు.

ఈ అరుదైన కేసుపై ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రి ఎండీ డాక్ట‌ర్ సి.మ‌ల్లికార్జున మాట్లాడుతూ, "ఈ కేసు వైద్య‌ప‌రంగా ఓ చారిత్ర‌క విజ‌యం.ఒకే రోగికి రెండు కిడ్నీల‌ను కాపాడేందుకు రెండు విభిన్న ర‌కాల‌, అత్యాధునిక శ‌స్త్రచికిత్స‌లు చేశాం. ఒక‌దాంట్లో అపెండిక్స్‌ను వాడితే, మ‌రోదాంట్లో సొంత కిడ్నీనే మార్చాం. ప్ర‌పంచంలో ఇలా రెండూ విజ‌య‌వంతంగా చేసిన కేసులు చాలా చాలా త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి" అని పేర్కొన్నారు.

ఈ సంక్లిష్ట శ‌స్త్రచికిత్స‌ల్లో డాక్ట‌ర్ తైఫ్ బెండెగెరి కూడా పాలుపంచుకున్నారు. రెసిడెంట్ వైద్యులు డాక్ట‌ర్ కార్తీక్‌, డాక్ట‌ర్ ఆసిత్ వైద్య బృందానికి స‌హాయ‌స‌హ‌కారాలు అందించారు. ఏఐఎన్‌యూ వైద్యుల ఈ అసాధార‌ణ ప్ర‌తిభ‌, కృషి వ‌ల్లే ఆ వృద్ధుడు మృత్యువు కోర‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి కొత్త జీవితం పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+