భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్!
ఇండియాలో తీవ్రంగా వేధిస్తున్న డెంగ్యూ సమస్యకు పరిష్కారంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్‌కు చెందిన ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ సంస్థ 'టకేడా' అభివృద్ధి చేసిన 'క్యూడెంగా' వ్యాక్సిన్‌కు భారత్‌లో అధికారిక ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో అనుమతి పొందిన మొట్టమొదటి డెంగ్యూ టీకాగా ఇది నిలిచింది. గత రెండు దశాబ్దాలుగా ఇండియాలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగిన నేపథ్యంలో ఈ టీకా అందుబాటులోకి రావడం అత్యంత కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు.
వ్యాక్సిన్ మోతాదు, వినియోగ విధానం
ఈ వ్యాక్సిన్‌ను 4 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉపయోగించేందుకు అనుమతించారు. డెంగ్యూ వైరస్‌కు చెందిన నాలుగు రకాల ప్రధాన స్ట్రెయిన్‌ల (DENV-1, DENV-2, DENV-3, DENV-4) నుంచి రక్షణ కల్పించేలా రూపొందించబడింది. వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందు ఎలాంటి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో డెంగ్యూ సోకినా, సోకకపోయినా దీనిని వేయవచ్చు. ఈ టీకాను చర్మం కింద ఇస్తారు. ఇది ఒక్కోటి 0.5 ఎంఎల్ చొప్పున రెండు డోసుల రూపంలో వస్తుంది. ఒక్కో డోసుకు మూడు నెలల వ్యవధి ఉంటుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు, కానీ ఏటా 50 మిలియన్ డోసుల వరకు ఉత్పత్తి చేయడానికి టకేడా సంస్థ హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ సంస్థతో తయారీ భాగస్వామ్యం కుదుర్చుకున్నందున, భారత మార్కెట్‌కు ధరలు పోటీగా ఉంటాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ప్రభుత్వ రోగనిరోధక కార్యక్రమాలలో చేర్చుతారా లేదా అనే దానిపై కూడా ధర ఆధారపడి ఉంటుంది.

గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో డెంగ్యూ కేసులు 11 రెట్లు పెరిగిన తరుణంలో ప్రజారోగ్యానికి ఇది ఓ కీలకమైన సమయంలో ఈ ఆమోదం లభించింది.ప్రపంచవ్యాప్త డెంగ్యూ భారంలో దాదాపు మూడింట ఒక వంతు ఇండియాలోనే కొనసాగుతోంది. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే ఓ వైరల్ వ్యాధి, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. 125కు పైగా దేశాలలో ప్రబలంగా ఉంది. ప్రపంచవ్యాప్త డెంగ్యూ భారంలో దాదాపు మూడింట ఓ వంతు ఇండియాలోనే ఉంది.
క్లినికల్ ట్రయల్స్‌లో మైండ్ బ్లోయింగ్ ఫలితాలు
ఇండియాలో ఈ ఆమోదం టకేడా ప్రపంచవ్యాప్త క్లినికల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఫలితాలపై ఆధారపడి ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో వ్యాధి ప్రబలంగా ఉన్న, లేని ప్రాంతాలలో 28,000 మందికి పైగా పాల్గొన్న 19 ఫేజ్ 1, 2, 3 క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి . ఇందులో కీలకమైన ఫేజ్ III టైడ్స్ (DEN-301) ట్రయల్ కూడా ఉంది. ఈ ట్రయల్‌లో క్యూడెంగా భద్రత, సమర్థత రెండింటినీ పరీక్షించేందుకు 8 దేశాల్లో 20,000 మందికి పైగా పాల్గొన్నవారిపై సుదీర్ఘ కాలం పాటు వ్యాక్సిన్‌ను పరీక్షించారు. రెండో డోస్ తీసుకున్న 12 నెలల తర్వాత, ఈ అధ్యయనం తన ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకుంది. వైరాలజీ పరంగా నిర్ధారించబడిన డెంగ్యూ (VCD)కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ మొత్తం సమర్థత 80.2%గా ఉందని ఇది నిరూపించింది.
18 నెలల తర్వాత ఈ అధ్యయనం డెంగ్యూ సంబంధిత ఆసుపత్రి చేరికలను నివారించడంలో 90.4% సమర్థతను ప్రదర్శించింది. తద్వారా అధ్యయనం కీలకమైన ద్వితీయ లక్ష్యాన్ని చేరుకుంది. 4.5 సంవత్సరాల తర్వాత క్యూడెంగా రెండు డోసులు డెంగ్యూ సంబంధిత ఆసుపత్రి చేరికలను నివారించడంలో 84.1శాతం వ్యాక్సిన్ సమర్థతను అందించాయి. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్‌లన్నింటిలోనూ ఏడు సంవత్సరాల వరకు నిరంతర భద్రత, సమర్థతను కూడా ప్రదర్శించింది.
ఈ ఆమోదానికి భారతీయ పాల్గొనేవారిపై నిర్వహించిన ఫేజ్ III క్లినికల్ ట్రయల్ (DEN-302) నుంచి వచ్చిన డేటా ఈ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని నిరూపించబడింది. ఈ ట్రయల్, 4-60 సంవత్సరాల వయస్సు వారిలో వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధక శక్తిని పరీక్షించింది. ఈ అధ్యయనం ప్రకారం, ఆరోగ్యవంతమైన పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు, పిల్లలలో క్యూడెంగా వ్యాక్సిన్ తట్టుకోగలిగేదిగా, సురక్షితమైనదిగా, రోగనిరోధక శక్తిని కలిగించేదిగా ఉన్నట్లు నిరూపించబడింది.
ప్రపంచ స్థాయిలో గుర్తింపు
క్యూడెంగా వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43కి పైగా దేశాల్లో ఆమోదం పొందింది. ఇప్పటివరకు 3.2 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నుంచి ప్రీ-క్వాలిఫికేషన్ పొందింది. దీని వల్ల యూనిసెఫ్, PAHO వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి మార్గం సుగమమైంది.












Click it and Unblock the Notifications