శ్రీవారి భక్తుల కోసం అలిపరిలో పిలిగ్రిమ్ టౌన్‌షిప్: వసతి, టికెట్లు అక్కడే- నేడే శ్రీకారం..!!
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కొద్ది రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సదుపాయాల కోసం అలిపిరి వద్దే ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్ షిప్ ఏర్పాటు పైన చర్చలు జరుగుతున్నాయి. ఇందు కోసం స్థలాన్ని ఖరారు చేసారు. భక్తులకు వసతితో పాటుగా టికెట్ల జారీ కేంద్రాలు సహా అన్ని రకాల సేవలు అందించేలా ఈ టౌన్ షిప్ కు రూపకల్పన చేస్తున్నారు. ఈ రోజు ఈ టౌన్ షిప్ కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు.
తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. అమరావతి నుంచి వర్చువల్‌గా పనులను ప్రారంభించనున్నారు. శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్, టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారానికి నివాస లేఅవుట్ అభివృద్ధి, 9 మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేయటంతో పాటుగా రూ.1,332 కోట్లతో భక్తుల కోసం వసతి సముదాయాల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

ఈ టౌన్ షిప్ లో నాలుగు బ్లాకుల్లో 2,700 గదులు.. రోజుకు 15 వేల మంది భక్తులకు వసతి కల్పనకు అవకాశం ఏర్పడుతుంది. రూ.160 కోట్లతో అన్నప్రసాద కేంద్రం... ఒకేసారి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా రూపకల్పన చేసారు. అదే విధంగా రూ.486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడుతున్నారు.
కాగా.. పిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్‌లలో ఒకేసారి 16 వేల మంది భక్తులకు స్నానం, విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. రూ.311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం నిర్మాణం కోసం వ్యయం చేస్తున్నారు. రూ.90 కోట్లతో 30 బస్ బేలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్, వైద్య సేవలన్నీ ఒకేచోట ఏర్పాటు చేస్తున్నారు.
తిరుమల కొండపై రద్దీ తగ్గించేందుకు కొండ కింద తిరుపతిలో వసతి సౌకర్యాల విస్తరణ తో పాటుగా భక్తుల కోసం పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, డిజిటల్ సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇక.. టౌన్‌షిప్‌లో అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థ.. టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం దిశగా నివాస లేఅవుట్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 418 ఎకరాల్లో రెండు దశల్లో 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు.. తో పాటుగా టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్‌లో మౌలిక వసతులకు రూ.230 కోట్ల వ్యయం చేయాలని డిసైడ్ అయ్యారు.














Click it and Unblock the Notifications
