మెదడులో ప్లాస్టిక్ .. పరిశోధనలో విస్తుపోయే నిజాలు..!
మనిషి జీవితం ప్లాస్టిక్‌తో ఎంతగా పెనవేసుకుపోయిందంటే, అది లేని రోజు ఊహించుకోవడమే కష్టంగా మారింది. కానీ, ఈ ప్లాస్టిక్ వ్యామోహం మనల్ని, భావితరాలను ఎంత ప్రమాదంలోకి నెట్టేస్తుందో తెలుసా? ముఖ్యంగా, కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు (మైక్రోప్లాస్టిక్స్) మన శరీరంలోకి, చివరికి అత్యంత సున్నితమైన మెదడులోకి కూడా చొరబడిపోతున్నాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. న్యూ మెక్సికో యూనివర్సిటీ చేసిన అధ్యయనం ఈ ప్రమాద ఘంటికలను మరింత బలంగా మోగిస్తోంది.
మెదడులోకి చొరబడుతున్న ప్లాస్టిక్:
మన మెదడు అత్యంత సున్నితమైన అవయవం. బయటి హానికారక పదార్థాలు మెదడులోకి ప్రవేశించకుండా 'బ్లడ్-బ్రెయిన్ బారియర్' అనే రక్షణ కవచం ఉంటుంది. అయితే, ఈ రక్షణ కవచాన్ని సైతం ఛేదించుకొని సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు మెదడులోకి ప్రవేశిస్తున్నాయని న్యూ మెక్సికో యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఇది అత్యంత ఆందోళన కలిగిస్తుంది.

పరిశోధనలో భాగంగా, 2016లో మరణించిన వారి మెదడు కణజాలాలను, 2024లో మరణించిన వారి మెదడు కణజాలాలను పోల్చి చూశారు. 2024 నాటికి మెదడులో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల సాంద్రత 50 శాతం పెరిగినట్లు గుర్తించారు. అంటే, కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే మెదడులో ప్లాస్టిక్ రేణువులు అంత భారీ మొత్తంలో పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు పరిశోధకులు. కాలేయం, మూత్రపిండాల వంటి అవయవాలతో పోలిస్తే మెదడులోనే ఈ రేణువులు అధికంగా ఉండటం గమనార్హం.
మెదడుపై ప్లాస్టిక్ ప్రభావం:
సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు మెదడులో ఎలాంటి దుష్ప్రభావాలకు కారణమవుతాయనే దానిపై ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే, ప్రాథమిక పరిశోధనల ఆధారంగా కొన్ని ప్రమాదకరమైన అంచనాలు ఉన్నాయి . సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు అతి సూక్ష్మ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. దీనివల్ల మెదడుకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు అందక మెదడు పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది.
అల్జిమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులు:
మెదడులోని నాడీ కణాలు నిరంతరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. ఈ ప్రక్రియకు సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, ఇతర మెదడు పనితీరుపై ప్రభావం పడవచ్చు. మెదడులో ప్రోటీన్లు అసాధారణంగా పేరుకుపోవడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఈ ప్రక్రియను ప్రేరేపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భవిష్యత్తు తరాలకు ప్రమాదం:
ప్లాస్టిక్ కాలుష్యం అనేది నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించకపోతే, భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే, సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు తల్లి నుంచి బిడ్డకు చేరే ప్రమాదం ఉంది. ఇది పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.
తక్షణ చర్యలు అవసరం:
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలి. ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. పునర్వినియోగం చేయలేని ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలి. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలి. జనపనార, వెదురు, గాజు వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలి. రీసైక్లింగ్ ప్రక్రియను మెరుగుపరచాలి. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రోత్సహించాలి.
ప్లాస్టిక్ కాలుష్యం అనేది మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా, సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు మెదడులోకి ప్రవేశించి తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతున్నాయనే విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా మేల్కొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోకపోతే, భవిష్యత్తు తరాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications