వణికిస్తున్న మంకీ పాక్స్ ... హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ.. లక్షణాలివే!
ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీ పాక్స్ వణికిస్తుంది. ఈ వ్యాధి కేసులు గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తుంది. ఇటు భారతదేశంలో కూడా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. వైరల్ వ్యాధి 'మంకీ పాక్స్' (mpox)ను 'ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్య'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది.
విపరీతంగా పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులు
గత రెండేళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ కేసుల పెరుగుదలతో ఈవిధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. తొలుత ఈ వ్యాధి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడింది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలలో శరవేగంగా వ్యాపించింది. దీని వల్ల గర్భిణులు, పిల్లలకు రిస్క్ ఎక్కువ కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 దేశాలలో మంకీ పాక్స్ కేసులను పెద్దసంఖ్యలో గుర్తించారు.

మంకీ పాక్స్ లక్షణాలు
భారతదేశంలో కూడా మంకీ పాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక మంకీ పాక్స్ లక్షణాల విషయానికి వస్తే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
ఒకరినుండి ఒకరికి త్వరగా వ్యాపించే వైరస్
మంకీపాక్స్ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఇది ఫ్లూ వంటి లక్షణాలు, చీముతో కూడిన గాయాలకు కారణమవుతుందని వైద్యులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయని చెప్తున్నారు. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు.
మంకీ పాక్స్ జంతువుల నుండి మనుషులకు సోకే వైరస్
ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.సాధారణంగా మంకీపాక్స్ కోతులు, ఎలుకలు, ఉడుతల వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని చెప్తున్నారు. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు తక్కువే అయినా దీని వ్యాప్తి త్వరగా జరుగుతుందని అంటున్నారు.
కరోనా లానే డేంజర్
చర్మం పగుళ్లు, కళ్లు, శ్వాసకోశ వ్యవస్థ, నోటి ద్వారా ఇది ఇతరులకు సంక్రమిస్తుందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి మాదిరిగానే ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications