నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేస్తే మొత్తం గిన్నె ఊడ్చేస్తారు..!
చేపల పులుసు అంటే చాలామందికి నోరూరుతుంది .చేపల పులుసును ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రా ఇలా ప్రాంతాలను బట్టి టేస్టు మారుతుంది. తీర ప్రాంత ప్రజలైతే నిత్యం చేపలు, పీతల పులుసు చేస్తుంటారు. ఇక నెల్లూరు చేపల పులుసు అంటే ఇష్టపడని వారుండరు. మరి సూపర్ టేస్టీ నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇప్పుడు చూద్దాం..
నెల్లూరు చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే చేప ముక్కలు 500 గ్రాములు, చింత పండు పెద్ద నిమ్మకాయ సైజంత, ఉల్లిపాయలు రెండు తరిగినవి, టమాటోలు రెండు తరిగినవి, పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, కారం మూడు టేబుల్ స్పూన్ లు, పసుపు అర టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్, మెంతుల పొడి పావు టేబుల్ స్పూన్లు, కరివేపాకు, కొత్తిమీర, నూనె నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ లు, ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి.

ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం చూస్తే ముందుగా చింతపండు నానబెట్టి పులుసు తీసుకోవాలి. ఆ తర్వాత చేపలను శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది మగ్గిన తర్వాత అందులో టమాటోలు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి వేయాలి. ఆ మిశ్రమం మగ్గుతున్న క్రమంలో అందులో చింతపండు పులుసు, నీళ్లు, ఉప్పు వేసి మరిగించుకోవాలి. చివరగా అందులో చేప ముక్కలు వేసి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే సూపర్ టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications