పాలకూర రాగి ఇడ్లీ.. ఇలా చేసి తింటే రుచి మాత్రమేనా ఆరోగ్యం కూడా
పాలకూర రాగి ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైన అల్పాహారంగా చెబుతారు. రాగి, పాలకూర శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా రాగిలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎముకలకు బలం చేకూరుస్తుంది. రాగిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాగి చాలా మంచి ఆహారం. రాగిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
పాలకూర రాగి ఇడ్లీలు
పాలకూరలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించి మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక పాలకూరలో ఉండే పోషకాలు విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి శక్తిని అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అందుకే పాలకూర రాగి ఇడ్లీలను పిల్లలు, పెద్దలు, డయాబెటిస్ ఉన్నవారు కూడా ఇష్టంగా తినొచ్చు. పాలకూర రాగి ఇడ్లీ ని ఏవిధంగా తయారు చేయాలో ప్రస్తుతం తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
రాగి పిండి- ఒక కప్పు
ఇడ్లీ రవ్వ- ఒక కప్పు
పెరుగు- ఒక కప్పు
పాలకూర - ఒక కప్పు సన్నగా తరిగినది
ఉప్పు- రుచికి సరిపడా
పచ్చిమిర్చి- రెండు
జీలకర్ర- అర స్పూను
బేకింగ్ సోడా- చిటికెడు
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి, ఇడ్లీ రవ్వ, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ మిశ్రమంలా మరీ పలచగా లేకుండా, మరీ చిక్కగా లేకుండా చూసుకొని కలుపుకోవాలి. అవసరం అయితే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలకూర, అల్లం, పచ్చిమిర్చిలను సన్నగా తురిమి కానీ, మిక్సీ జార్లో మిక్సీ చేసుకుని ఇడ్లీ మిశ్రమంలో కలపాలి.
ఇలా చేస్తే పాలకూర రాగి ఇడ్లీ సూపర్ గా వస్తుంది
రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని, మిశ్రమాన్ని 20 నుండి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఇందులో బేకింగ్ సోడా వేసి కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించాలి. అంతే రుచికరమైన పాలకూర రాగి ఇడ్లీ రెడీ అయింది. ఈ పాలకూర రాగి ఇడ్లీని కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, సాంబార్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.












Click it and Unblock the Notifications