ఇంట్లోనే "పనీర్ ఫ్రైడ్ రైస్" ఎలా చేయాలంటే ???
ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్‌తో కమ్మని, సువాసనభరితమైన పనీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ రెసిపీ మీ కోసమే. పనీర్ ముక్కల సాఫ్ట్ టెక్స్చర్, కరకరలాడే కూరగాయలు, సోయా సాస్ ఫ్లేవర్ కలిసి ఈ ఫ్రైడ్ రైస్‌ను మరింత రుచికరంగా మారుస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ డిష్‌ను లంచ్, డిన్నర్ లేదా ఈవెనింగ్ స్పెషల్‌గా సర్వ్ చేయొచ్చు.
తాజా అన్నం కంటే ఫ్రిజ్‌లో ఉంచిన అన్నం వాడితే గింజలు విడిగా ఉంటాయి. ఫ్రైడ్ రైస్‌కు రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే హై ఫ్లేమ్‌లో త్వరగా వండాలి. అలానే ఎక్కువ అన్నం ఒకేసారి వేస్తే సరిగా టాస్ అవదు.. అవసరమైతే బ్యాచ్‌లుగా చేయండి. ఎక్కువ సాస్ వేసితే అన్నం తడిగా అవుతుంది కానీ రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకోవచ్చు. తక్కువ నూనె వాడితే అన్నం అంటుకునే అవకాశం ఉంటుంది.

ముందుగా గుర్తుంచుకోవాల్సిన చిట్కా..
ఫ్రైడ్ రైస్ రుచిగా రావాలంటే అన్నం పొడిపొడిగా ఉండాలి. తాజాగా వండిన వేడి అన్నం ఉపయోగిస్తే రైస్ మెత్తగా అయిపోతుంది. అందుకే అన్నాన్ని ముందుగా వండి పూర్తిగా చల్లార్చి ఉపయోగిస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది.
కావలసిన పదార్థాలు..
బాస్మతి అన్నం - 2 కప్పులు (ముందుగా వండి చల్లార్చినది)
పనీర్ - 150 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
నూనె లేదా నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
క్యారెట్ - ¼ కప్పు
బీన్స్ - ¼ కప్పు
క్యాప్సికమ్ - ¼ కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
సోయా సాస్ - 1 టీస్పూన్
వెనిగర్ - 1 టీస్పూన్
చిల్లీ సాస్ - 1 టీస్పూన్ (ఐచ్చికం)
మిరియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
ఉల్లికాడలు లేదా కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం..
ముందుగా ఒక పాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. అందులో పనీర్ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
ఎక్కువగా వేయిస్తే పనీర్ గట్టిగా మారుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌పైనే ఫ్రై చేయాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడి చేయాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసి హై ఫ్లేమ్‌పై 2-3 నిమిషాలు వేయించాలి.
కూరగాయలు పూర్తిగా మెత్తబడకుండా కొద్దిగా కరకరలాడేలా ఉంటేనే ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. సాస్‌లను ఎక్కువగా వేయకూడదు. అలా చేస్తే అసలు రైస్ రుచి తగ్గిపోతుంది.
తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, వేయించిన పనీర్ ముక్కలను పాన్‌లో వేసి జాగ్రత్తగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి చల్లి హై ఫ్లేమ్‌పై రెండు నిమిషాలు టాస్ చేయాలి.
రైస్ ముద్ద కాకుండా స్పూన్‌తో నెమ్మదిగా కలపడం చాలా ముఖ్యం.
చివరగా ఉల్లికాడలు లేదా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. కావాలంటే కొద్దిగా నెయ్యి వేసినా మంచి ఫ్లేవర్ వస్తుంది.
వేడివేడిగా పనీర్ ఫ్రైడ్ రైస్‌ను వెజ్ మాంచూరియా, గోబీ మాంచూరియా, రాయ్తా లేదా టమాటో సాస్‌తో సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది.












Click it and Unblock the Notifications