IPL 2027లో మరో బిగ్ ట్రేడ్.. ఆ జట్టులోకి వెళ్లిన టీమిండియా స్టార్ పేసర్!
IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల బదిలీ ప్రక్రియలో మరో సంచలన ఒప్పందం కుదిరింది. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల మధ్య ముగ్గురు ప్లేయర్లతో కూడిన భారీ ట్రేడ్ డీల్ పూర్తయింది. ఈ ఒప్పందం ప్రకారం టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ ఎం.సిద్ధార్థ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి చేరగా.. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ లక్నో సూపర్ జెయింట్స్ గూటికి చేరాడు.
మహ్మద్ షమీ వేతనంలో రూ.2 కోట్ల కోత
గత సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌లోకి ట్రేడ్ అయిన మహ్మద్ షమీ.. ఇప్పుడు తన మకాంను రాజస్థాన్ రాయల్స్‌లోకి మార్చాడు. అయితే ఈ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా మహ్మద్ షమీ తన వేతనంలో రూ.2 కోట్లు కోల్పోయాడు. గతంలో రూ.10 కోట్ల ధర పలికిన మహ్మద్ షమీ.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరఫున రూ.8 కోట్ల ఫీజుతో ఆడనున్నాడు. ఇప్పటివరకు 132 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ షమీ ఖాతాలో 145 వికెట్లు ఉన్నాయి. మరోవైపు తమిళనాడుకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎం.సిద్ధార్థ్ తన ప్రస్తుత ధర రూ.75 లక్షలకే రాజస్థాన్ జట్టులో చేరాడు.

ఒక్క మ్యాచ్ ఆడకుండానే రాజస్థాన్‌ను వీడిన సామ్ కరన్
ఈ ట్రేడ్ డీల్‌లో భాగంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ తన ప్రస్తుత వేతనం రూ.2.4 కోట్లకే లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి అడుగుపెట్టాడు. గత సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ అయిన సామ్ కరన్.. గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 997 పరుగులు చేయడంతో పాటు 59 వికెట్లు పడగొట్టిన సామ్ కరన్.. రాబోయే సీజన్లో లక్నో జట్టుకు కీలకం కానున్నాడు.












Click it and Unblock the Notifications
