మరో బీజేపీ పాలిత రాష్ట్రంపై కన్నేసిన నేహా బోరా
అఖిల భారత విద్యార్థుల సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా.. ఉత్తరాఖండ్ లో పర్యటిస్తోన్నారు. డెహ్రాడున్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సారథ్యంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం.. ఉత్తరాఖండ్. త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. వచ్చే మార్చి, ఏప్రిల్ లల్లో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేహా బోరా అక్కడ పర్యటిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా నేహా బోరా పర్యావరణ వినాశనం, మహిళా భద్రత, పౌర హక్కుల హననం వంటి పలు అంశాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం అన్ని వైపుల నుంచి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం ప్రజలు సుదీర్ఘ పోరాటాలు చేసి కన్న కలలు, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల నీరుగారుతోన్నాయని ఆరోపించారు.

ఇక్కడికొండ ప్రాంతాల్లో పర్యావరణ వ్యవస్థ నాశనమైపోతోందని నేహా బోరా పేర్కొన్నారు. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదల కారణంగా తరచుగా గ్రామాలు కొట్టుకుపోతున్నాయని, అనేక ప్రాంతాల్లో భూమి కుంగిపోతూ నివాస ప్రాంతాలు మునిగిపోతున్నాయని గుర్తుచేశారు. ఈ తరహా పర్యావరణ విపత్తుల నుంచి స్థానిక ప్రజలను, గ్రామీణులను కాపాడటానికి గానీ, పర్యావరణ పరిరక్షణకు గానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పలేకపోతోందని ఆమె దుయ్యబట్టారు.
ఉత్తరాఖండ్‌లో మహిళల భద్రత దిగజారిందని నేహా బోరా విమర్శించారు. అంకితా భండారీ హత్య కేసును నేహా బోరా ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కేసులో న్యాయస్థానానికి స్పష్టమైన ఆధారాలు లభించినప్పటికీ, ప్రభుత్వం మాత్రం నిందితులకు శిక్ష పడకుండా అడ్డుకుంటోందని, వారికి ఉన్నత పదవులు కట్టబెడుతూ రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తోందని ధ్వజమెత్తారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏళ్లకు ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తోన్నప్పటికీ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.
అంకిత భండారి కేసులో నిందితుల కుటుంబీకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. అదే సమయంలో ఉత్తరాఖండ్ వ్యాప్తంగా దళితులు, ముస్లిం వర్గాలను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేస్తోన్నారని, దీనివల్ల ప్రాంతాలలో హింస, హత్యలను సాధారణ విషయాలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా లాభపడటానికి అధికార యంత్రాంగం ప్రజాస్వామ్య ప్రక్రియలను దుర్వినియోగం చేస్తోందని నేహా బోరా అన్నారు. అధికార పార్టీకి ప్రతికూలంగా ఉండే ప్రాంతాల్లో లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తోన్నారని ఆమె విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సంక్రమించిన ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని మండిపడ్డారు.















Click it and Unblock the Notifications
