ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే డయాబెటిస్ మొదలవుతున్నట్లే..!!
డయాబెటిస్. మారుతున్న జీవనశైలి కారణంగా మధ్య కాలంలో చిన్న వయసులోనూ చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, ఊబకాయం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే, డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతోంది. ఫలితంగా అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. డయాబెటిస్ ను లక్షణాల ద్వారా ముందుగా గుర్తించడంద్వారా దానిని నివారించడంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రీ డయాబెటిస్లో రక్తంలో గ్లూకోస్థాయిలో సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే మధుమేహం బాధితులకు ఉన్నంతగా ప్రీ డయాబెటిస్ బాధితులకు ఆ సమస్య ఉండదు. ప్రీ డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 100 మిల్లీగ్రాముల నుండి 125 మిల్లీగ్రాముల వరకు ఉంటాయి. హెచ్పీఏ1సీ స్థాయిలు 5.7 నుండి 6.4 వరకు ఉంటాయి. ప్రీ డయాబెటిక్ పేషంట్లలో దాదాపు 70 శాతం మంది డయాబెటిక్ అవుతారు. ప్రారంభ సంకేతాలతో పాటు శరీరంలో కనిపించే మార్పులను గుర్తించడం వల్ల రోగనిర్దారణ త్వరగా చేయడంతో పాటు మెరుగైన చికిత్సను తీసుకునే వీలు ఉంటుంది. డయాబెటిస్ వ్యాధి బారిన పడినప్పుడు తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి సమయంలో మూత్ర విసర్జన మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో దాహం ఎక్కువ అవుతుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ డయాబెటిస్ ఉన్న వారిలో నిరంతరం అలసటగా ఉంటుంది. అలసట ఎక్కువగా ఉంటుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే
వీటితో పాటుగా శరీర బరువు తగ్గుతుంది. కడుపు నిండా తిన్న తరువాత ఆకలి ఎక్కువగా అవుతుంది. డయాబెటిస్ ను సూచించే లక్షణాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతున్నారు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉండడం వల్ల కళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఫలితంగా కంటి చూపు మసకబారినట్టుగా కనిపిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి. మధుమేహం కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో చేతులు, కాళ్లల్లో తిమ్మిర్లు రావడం జరుగుతుంది.
ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. డయాబెటిస్ కారణంగా అంతర్గత అవయవాలతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. విపరీతంగా చెమట పోస్తుంది. శరీరం పొడిబారడం, అలర్జీలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో, ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications