నెల రోజులు టీ మానేస్తే, ఊహించని విధంగా..!!
టీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. చాలా మంది ప్రతిరోజూ ఉదయం మంచం మీద నుండి లేచిన వెంటనే టీ తాగి నిద్రలేవడం ఇష్టపడతారు. అదే సమయంలో, చాలా మంది అల్పాహారం సమయంలో కూడా టీ తాగుతారు. కొంత మంది టీకి ఎంతగా బానిసలయ్యారంటే, రోజుకు 3 నుండి 4 సార్లు టీ తాగుతారు. అయితే, ఇంతగా అలవాటు పడిన వారు 30 రోజులు టీ మానేస్తే శరీరం అద్భుతమైన రీబూట్ ప్రక్రియకు లోనవుతుంది. ఊహించని మార్పు కనిపిస్తుంది. ఈ 30 రోజుల ఛాలెంజ్ పైన నిపుణులు ఆసక్తి కర అంశాలను వెల్లడిస్తున్నారు.
టీ ప్రియులకు, ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం పెద్ద సవాలుగా ఉంటుంది. కానీ, టీ తాగాలనే కోరికను అరికట్టడం వల్ల వారి ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మార్పు బాహ్య సౌందర్యానికే కాకుండా శరీరంలోని ప్రతి కణాన్నీ పునరుజ్జీవింపజేస్తుంది. కళ్ల కింద నలుపు మాయమై, ముఖం యవ్వనంగా మారుతుంది. లోలోపల అవయవాలు కూడా మరింత చురుగ్గా పనిచేస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, మంచి నిద్రపట్టడంతోపాటు తెలియకుండానే మనలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. టీలో ఉండే కెఫీన్ మన శరీరం నుంచి నీటిని త్వరగా బయటికి పంపించేస్తుంది. దీంతో చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. కాబట్టి టీ మానేయడం వల్ల శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉండి, చర్మకణాలకు తగిన తేమ అందుతుంది. తద్వారా ముఖం, బుగ్గలు తాజాగా మెరుస్తూ ఉంటాయి. ఇక టీ మానేసి నీళ్లు, హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల లివర్, కిడ్నీలు చురుగ్గా పనిచేసి, రక్తాన్ని సమర్థంగా శుద్ధి చేస్తాయి.

నిపుణుల సూచనలు... కీలక మార్పులు
టీలో సాధారణంగా కలిపే పాలు, చకెర మొటిమలకు మంచి మిత్రులు. చకెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఒకసారిగా పెరుగుతుంది. ఇది చర్మంలోని నూనె గ్రంథులను ప్రేరేపించి ముఖంపై ఎకువ నూనె ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. ఇక పాలలోని హార్మోన్లు మొటిమలను ప్రేరేపిస్తాయి. టీ మానేయడం వల్ల నూనె ఉత్పత్తి తగ్గి కొత్త మొటిమలు రావడం నెమ్మదిస్తుంది. కళ్ల కింద నలుపు రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. టీలో ఉండే కెఫీన్ నిద్రను కలిగించే మెదడులోని అడెనోసిన్‌ను అడ్డుకుంటుంది. టీ మానేయడం వల్ల శరీరం సహజమైన నిద్ర సైకిల్‌కు చేరుకుంటుంది. గాఢ నిద్ర పట్టడం వల్ల కళ్ల చుట్టూ ఉండే రక్తనాళాలు విశ్రాంతి పొందుతాయి. ఫలితంగా కళ్ల కింద డార్క్‌నెస్, కళ్ల కింద వాపు కూడా తగ్గుతుంది. అయితే ఒక్కసారిగా టీ మానేస్తే మొదటి వారం రోజులు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. తేలికపాటి తలనొప్పి, నీరసం, చిరాకు ఉండొచ్చు. అలాంటప్పుడు నెల రోజుల పాటు టీకి బదులుగా గోరువెచ్చని నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికిపోయి సత్ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications