భారత్ పై పాకిస్తాన్ బిగ్ స్టెప్: కాశ్మీర్ సరిహద్దు పర్యవేక్షణ చైనాకు అప్పగింత: గ్రూప్ ఏర్పాటు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయంగా సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అన్ని దేశాలు కూడా తమ సరిహద్దు భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సైతం భారత్ తో తన సరిహద్దులను మరింత బలోపేతం చేసుకోబోతోంది. దీనికోసం చైనా సహకారాన్ని తీసుకుంటోంది. సరిహద్దు భద్రత, ఇమ్మిగ్రేషన్ పై చైనా- పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక ఒప్పందాలు సైతం కుదిరాయి.
ప్రధానంగా తమ సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకునే చట్టవిరుద్ధ కార్యకలాపాలు, చొరబాట్లు, ఉగ్రవాద ముప్పును సంయుక్తంగా అడ్డుకోవడమే ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశం. చైనా నేషనల్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది. దీనికి చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ క్వీ జింగ్యాంగ్ నాయకత్వం వహిస్తోన్నారు. ఇస్లామాబాద్‌లో పాక్ మంత్రి మొహిసిన్ నఖ్వీ, ఆ శాఖ సహాయమంత్రి తలాల్ చౌదరితో చర్చలు జరిపారు.

అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉమ్మడి భద్రతను పటిష్టం చేయడం ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని సాధించాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు. ఈ నూతన ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం అక్రమ వలసలు, ఆయుధాల స్మగ్లింగ్, సరిహద్దు దాటి జరిగే వివిధ రకాల సాంప్రదాయేతర నేరాలను అరికట్టేందుకు జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను నియమిస్తారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కార్యకలాపాలు బలోపేతం చేయడానికి ఈ గ్రూప్ ప్రాధాన్యత ఇస్తుంది.
ఇరు దేశాల పౌరుల ప్రయాణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలుగా ఒక సమగ్ర ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేయాలని కూడా నిర్ణయించారు. సరిహద్దు భద్రత విషయంలో చైనాతో కలిసి పని చేయడం వల్ల రెండు దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మొహసిన్ నఖ్వీ పేర్కొన్నారు. చొరబాట్లపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోన్నామని ఆయన స్పష్టం చేశారు.
ఆధునిక రక్షణ సాంకేతికతను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తీవ్రవాదం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను తమకు అత్యంత నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించారు జింగ్యాంగ్. భద్రతా పరంగా పాకిస్తాన్‌లోని వివిధ దర్యాప్తు, రక్షణ సంస్థల సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం, సరిహద్దుల వద్ద నిఘాను పటిష్టం చేయడానికి అవసరమైన అత్యాధునిక మౌలిక వసతుల కల్పనలో తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. పాకిస్తాన్ మెజారిటీ సరిహద్దు ప్రాంతం అంతా కూడా భారత్ తోనే పంచుకుంటోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications