ఆంధ్రా స్టైల్ చక్కెర పొంగలి.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు!
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది తీపి పదార్థాలు తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. అయితే ఎప్పుడైనా ఒకసారి మనకు ఇష్టమైన తీపి పదార్థాలు తయారు చేసుకుని తింటే శరీరానికి కలిగే అనర్థం ఏమి ఉండదు. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలుగువారి ఇళ్ళలో ఇంట్లో తయారు చేసుకునే ఇష్టంగా తినే వాటిలో చక్కెర పొంగలి ఒకటి. మరి దీనిని ఎలా తయారు చేస్తాం అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
పండుగల ప్రత్యేకం చక్కెర పొంగలి
ఆంధ్రుల ఇళ్లలో చక్కెర పొంగలి ఒక ప్రత్యేకమైన, సంప్రదాయబద్ధమైన తీపి వంటకం. మృదువుగా, నోట్లో కరిగిపోయే ఈ రుచి పండుగలప్పుడు, దేవాలయ సందర్శనల సమయంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాంప్రదాయమైన ఈ తీపి వంటకాన్ని తయారు చేసే విధానం ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
బియ్యం 1 కప్పు,
పెసరపప్పు ¼ నుండి ⅓ కప్పు,
పాలు 2-3 కప్పులు,
నీరు 2-3 కప్పులు,
చక్కెర - 1/2 కప్పు
తురిమిన బెల్లం- 1 కప్పు,
నెయ్యి- 4-6 టేబుల్‌స్పూన్లు,
జీడిపప్పు- 20,
ఎండుద్రాక్ష 2-3 టేబుల్‌స్పూన్లు,
యాలకుల పొడి- ½ టీస్పూన్.
తయారీ విధానం
సాంప్రదాయ ఆంధ్ర శైలిలో, సోనా మసూరి బియ్యంతో చక్కెర పొంగలి చేసుకోవచ్చు. దీని తయారీకి బియ్యం, పెసరపప్పును ముందుగా నెయ్యిలో తేలికగా వేయించాలి. ఇది ప్రతి గింజ మెత్తగా, అతుక్కోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఆ తర్వాత, బియ్యం, పప్పును నీరు, పాలలో ఉడికించాలి. కొందరు మరింత క్రీమీగా ఉండటానికి ఎక్కువ పాలు వాడితే, మరికొందరు తేలికగా ఉండేందుకు తక్కువ వినియోగిస్తారు.
ఇలా వండితేనే టేస్ట్
తక్కువ మంటపై నెమ్మదిగా ఉడికించడం ఇది తయారు చేయడానికి కీలకం. మిశ్రమం చిక్కగా, మెత్తగా జావలా మారేదాకా ఉడికించాలి. ఆపై తురిమిన బెల్లాన్ని, చక్కెరను ఉడికిన మిశ్రమంలో కలపాలి. ఆపై అందులో యాలకుల పొడిని కూడా వేసి కలిపి, తక్కువ మంటపై నిదానంగా దీనిని ఉడికించాలి.
నెయ్యితో మంచి రుచి, వాసన
అందులో నేతిలో వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కలపాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా చేసిన చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుంది. మొత్తం చక్కెర తోను, మొత్తం బెల్లం తోనూ అంత రుచిగా అనిపించదు.












Click it and Unblock the Notifications