వెల్లుల్లి నిల్వ పచ్చడి .. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!
మన ఆహారంలో వెల్లుల్లికి ఎంతో విలువ ఉంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం, నరాల బలహీనత, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం వంటి ఎన్నో ప్రయోజనాలు వెల్లుల్లితో కలుగుతున్నాయి. కానీ ప్రతిరోజూ పచ్చి వెల్లుల్లి తినడం చాలామందికి కష్టంగా ఉంటుంది. అలాంటి వారికోసం ఘుమఘుమలాడే, రుచికరమైన, ఏడాది పాటు చెడిపోకుండా ఉండే వెల్లుల్లి నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు:
పొట్టు తీసి పూర్తిగా ఆరబెట్టిన వెల్లుల్లి రెబ్బలు -500 గ్రాములు
పచ్చడి కారం - 200 గ్రాములు
కల్లుప్పు పొడి - 150 నుంచి 200 గ్రాములు
ఆవపిండి - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
మెంతిపిండి - 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగ నూనె - సుమారు 1 కప్పు
తాజా నిమ్మరసం - 250 ml
పసుపు - 1 టీస్పూన్
తాలింపు కోసం:
ఆవాలు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 3 నుంచి 4
కరివేపాకు - కొద్దిగా
ఇంగువ - 1 టీస్పూన్

తయారీ విధానం:
ముందుగా వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి, తడి ఏమాత్రం లేకుండా ఫ్యాన్ గాలి కింద లేదా పొడి గుడ్డపై పూర్తిగా ఆరబెట్టాలి. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. ఇది చాలా ముఖ్యం.
స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక మీడియం ఫ్లేమ్‌లో వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. మరీ ఎర్రగా కాల్చకూడదు. లేత బంగారు రంగు వచ్చి పచ్చి వాసన పోయే వరకు వేయించి వేరే గిన్నెలోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
తయారీ ఇలా చేస్తే బెస్ట్
మిగిలిన నూనెను అదే పాన్‌లో వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి దోరగా తాలింపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి నూనెలో కారం కలిపితే పచ్చడి నల్లబడి పాడవుతుంది కాబట్టి ఇది మర్చిపోకండి. వెడల్పాటి గిన్నెలో పచ్చడి కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతిపిండి వేసి ముందు పొడిగా కలపాలి. ఆ తర్వాత చల్లారిన తాలింపు నూనె పోసి బాగా కలపాలి.
మూడు రోజులు ఊరిన తర్వాత వెల్లుల్లి అదుర్స్
చివరగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు, తాజా నిమ్మరసం పోసి అన్నీ సమంగా కలిసేలా కలపాలి. మొదట్లో పచ్చడి కొంచెం పల్చగా అనిపించవచ్చు. కానీ మూడు రోజులు ఊరిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పులుపు, కారాన్ని పీల్చుకుని నూనె పైన తేలుతుంది. శుభ్రమైన, పూర్తిగా ఎండిన గాజు సీసా లేదా జాడీలో నింపి భద్రపరచాలి.
సంవత్సరం పాటు నిల్వ ఉండే వెల్లుల్లి పచ్చడి
మూడు రోజుల తర్వాత ఒకసారి పొడి గరిటెతో కలిపి ఉప్పు సరిచూసుకుంటే సరిపోతుంది.వేడి వేడి అన్నంతో నెయ్యి కలిపి తింటే రుచి అదిరిపోతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పచ్చడి ఇంట్లో ఉంటే ఎప్పుడైనా తీసుకుని తినవచ్చు.













Click it and Unblock the Notifications
