• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముక్తికి మార్గం: నా, నేను కాదు అంతా భగవంతుడే! స్వధర్మమే ఈశ్వారార్పణ

|

హైదరాబాద్: పాప విమనం ఈ లోకంలో ఉన్నంతవరకూ, మనలో ప్రతి ఒక్కనికీ ఏదోకొంత పేరూ, ప్రతిష్ఠా కాలక్షేపానికి ధనమూ అవసరంగా వుంటుంది. కొందరికి ఇవన్నీ ఆయాచితంగానే లభిస్తవి. మరికొందరికి ఎంత శ్రమించినా, ఇవి అందకుండానే పోతవి. ఐతే ఇవి మనతో స్థిరంగా ఉంటవా అంటే వుండవు. జీవితకాలంలో వానిని మనమైనా వదలిపెట్టుతాము లేదా అవైనా మనలను వదలి పెట్టుతవి. అందుచేత పేరుప్రతిష్ఠలకీ, ధనార్జనకూ మనం జీవితమంతా ధారపోయవలసిన అవసరం లేదని తేలుతుంది.

మరి యత్నపూర్వకంగా మనం దేనికై పాటుపడాలి అన్న ప్రశ్నవస్తే, పాపదూరమైన పుణ్యజీవనానికే శ్రమించాలి అని బదులు చెప్పవలసి వస్తుంది.

astrologer told the story about mukthi margam

ఐతే పుణ్యజీవనం సిద్ధించేదెట్లా? ఒకటి మనం ఇదివరకు చేసిన పాపాలను నాశంచేసుకోవాలి. రెండవది అటుమీదట పాపాచరణకు పూనుకోక పాపబుద్ధిని తొలగించుకొని చిత్తనైర్మల్యంకోసం పాటుపడాలి.

పాపనాశనానికి మార్గమేమిటంటే భగవంతునిపై భారంవేసి, మన రక్షకుడు అతడేఅనీ, జరిగేది ప్రతియొక్కటీ అతని ఎరుకలోనిదే అనీ, మనకుజరిగే మంచీ చెడ్డా రెండూ ఆయన ఇచ్ఛాపూర్వకంగానే జరుగుతున్నవనీ, జరిగేవన్నీ మన మంచికేనని దృఢనిశ్చయంతో ఉండటమూ, తన్ను పరిపూర్తిగా స్వామికి అర్పణచేసుకొని ఈశ్వర ప్రవాహంలో తేలిపోవడమూ ఇవే శరణాగతికి కీలకం. మరి పాపబుద్ధి తొలగించుకోడానికి మార్గమేమిటంటే, మనము దొరికిన ప్రతిక్షణమూ భగవచ్చింతనకు వినియోగిస్తూ, అతని నామజపం చేస్తూ ఆయన పుణ్యకథాశ్రవణం చేయడమే.

క్రైస్తవ మతంలో పాపక్షాళనానికై దేవుడు అవతరించాడు. అలాంటిదేదీ హైందవమతంలో కనబడదని కొందరు వాదిస్తూంటారు. ఇదిసరికాదని ఈక్రింది గీతాశ్లోకం చదివితే తెలుస్తుంది.

''సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ,

ఆహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః||''

'సర్వపాపేభ్యో, మోక్షయిష్యామి' నిన్ను అన్నిపాపాల నుండి నేను రక్షిస్తాను. 'సర్వధర్మా& పరిత్యజ్య' నీవు అన్ని ధర్మాలనూ వదలివెయ్యి. 'మామేకం శరణం వ్రజ' నన్నెశరణుపొందు - అని అర్జునుడితో భగవానులు అంటున్నారు. ఈసందర్భంలో 'సర్వధర్మా& పరిత్యజ్య' అంటే సరియయిన అర్థం ఏమిటో తెలుసుకోవాలి.

గీతలో ఎక్కడ పడితే అక్కడ ప్రతివ్యక్తీతన స్వధర్మాన్ని ఈశ్వరార్పణబుద్ధితో చేస్తూరావాలనే సూచనలున్నవి. మరి ఇక్కడ 'సర్వధర్మా& పరిత్యజ్య' అనటంలో అర్థమేమి? భగవానుడు అర్జునుడికి అన్ని కర్మలనూ వదలిపెట్టి ఏపనీ చేయకుండా వూరికే కూర్చోమని బోధిస్తున్నాడా? ''లక్ష్యసిద్ధిఒక్కకర్మవల్లనేసిద్ధిస్తుందని అనుకోవద్దు ఈ కర్మలే లక్ష్యములనీ అనుకోవద్దు.

అన్ని భారాలనూ నాపైవేసి అనన్యశరణంగా ఉండిపో'' అని ఆయన అర్జునుడికి బోధిస్తున్నాడు. దీనికి ముందుశ్లోకం---

''మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,

మా మే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే||''

ప్రియోసిమే' అని కృష్ణపరమాత్మ అర్జునుడితో చెప్పుతున్నారంటే ఒక అర్జునుడే కాదు, మనమందరమూ వారికి ప్రియులమే. అందుచే 'సత్యం తే ప్రతిజానే' యని వారు మాట ఇస్తున్నారంటే అది మనకందరికిన్నీ ఇచ్చినమాటే. వారిచ్చిన మాట చొప్పున 'మా మేవైష్యసి' వారినే మనమందరమూ పొందుదాము దానికి మార్గం 'మన్మనా భవ'. భావాలన్నీ ఆయనవంకనే మనం ఉంచాలి. 'మద్భక్తోభవ' వారి భక్తులమై పోవాలి, 'మద్యాజీ భవ' వారి పూజకులమైపోవాలి. 'మాంనమస్కురు' వారికి నమస్కరిస్తూ, వారి చరణదాసులమై పోవాలి.

మన ప్రేమలను కొంచెం పరిశీలించిచూస్తే భ్యార్యలపై ఉంచే ప్రేమైనాసరే, పుత్రులపై ఉంచే ప్రేమైనాసరే నిజానికి స్వాత్మప్రేమగానే పరిణమిస్తుంది. పుత్రుడున్నాడు, వానిపై చాలా మమత. ఆపుత్రుడు పెళ్ళిచేసుకొని భార్యమోజులో పడి తండ్రిని కొంచెం నిరాకరిస్తే, ఈతండ్రిగారి ప్రేమ ఒక్కమారుగా తుడిచిపెట్టుకుపోతుంది. దానిస్థానంలో వైరిబీజం మొలకెత్తుతుంది. అందుచేత మనం చెప్పే ఈప్రేమలన్నీ ఏదో ఒక వ్యాజంతో కూడుకొన్నవని తెలుస్తున్నవి. ఈప్రేమలకంతా ఏదో ఒకకారణం ఉంది.

ఐతే మనలను మనమే ప్రేమించుకొంటున్నామే, ఆప్రేమను పరీక్షిస్తే, అది నిష్కారణమైన ప్రేమ. అవ్యాజమైన ప్రేమ అని తేలుతుంది. 'నేను' 'నేను' అని ఎప్పుడూ తగనిఅభిమానంతో నిరంతరప్రేమతో వల్లెమేసుకొంటున్నామే, ఈ 'నేను' 'వాడే' అని గుర్తించేసరికీ మన మనస్సు వానిచింతలతో నిండిపోతుంది. 'మన్మనా భవ' అన్న వాక్యానికి అదే అర్థం. ఆయనను ప్రార్థించడం ఆయన ఏదో మనకు వరాలిస్తాడని కాదు. ఆయనే మనమైతిమి. మన ఆత్మా ఆయనా ఒక్కటే ఆయెను. ఆయనను అనుకోనిక్షణం లేకపోయెను. ఈ భావం బాగా రూఢిఅయిపోయిందంటే మన మనస్సు ఆవ్యాజభక్తితో మునిగిపోయిందన్నమాట.

ఈలాంటి అవ్యాజభక్తికి మన పురాణాలలో ఎన్నో దృష్టాంతాలున్నవి.

అక్రూరుడు, విదురుడు ఇట్టివారు అ వ్యాజభక్తులే. చిన్నతనంలోనుంచే భగవచ్చరణాగతిని పొందినవారు ధ్రువుడు, ప్రహ్లాదుడు, నిరక్షరాశ్యులూ, నిమ్నజాతికి చేరినవారూ కన్నప్పా, శబరీ, తమవ్యక్తిత్వాన్నే మరచునట్లు చేసింది వారి భక్తిస్రవంతి. ఒక జీవితమంతా సాధించినా, ఇతరులకు అసాధ్యమైన భక్తిని ఏడురోజులలో సాధించినట్లు పరీక్షిత్తుకథవలన తెలుస్తున్నది. మూడుమ్ముప్పాతిక గడియలలో మోక్షంపొందినవాడు ఖట్వాంగుడు.

చేసిన పాపాలను తొలగించడానికి శరణాగతియే మందు. భావిజీవితంలో దుష్టచింతనలు లేక సచ్చారిత్ర మలవడానికి భక్తియే మార్గం. మనస్సు భక్తితో నిండిపోతే ఆ నిర్మల హృదయంలో భగవంతుడు భాసించడానికిఅవకాశముంటుంది, శరణాగతీ, భక్తీ రెండున్నూ ఒక నాణానికి ఉన్న రెండు పెడలు. జీవితంగడవడానికి ప్రతిఒక్కరూ ఏదోఒక వృత్తిని అవలంబించవలసిన ఆవశ్యకత ఉన్నది.

వృత్తిలో ఉన్నంత వరకూ చేతిలోని పనిమీద మనస్సు లగ్నమై ఉంటుంది. విరామకాలంలోనే మనస్సు పాపచింతనలపైకిపోయే అవకాశముంది. అందుచేత పాపచింతనలబారినుండితప్పించుకోవాలంటే మనం విరామకాలం అంతా భగవచ్చింతనలోగడపటానికి అలవాటు పడాలి. దానికి ఎన్నో మార్గాలు. నామజపమో, సత్సంగమో, సత్కథాశ్రవణమో, పూజాదికాల్లోమగ్నులమై పోవడమో, ఎప్పుడూ భగవచ్చింతనలోనే గడపటానికి ఏదో ఒకమార్గాన్ని అన్వేషించాలి. పాపాచరణ జ్ఞానేంద్రియాలతో కానీ, కర్మేంద్రియాలతో కానీ జరగకుండా జాగ్రత్తపడాలి.

ఏదైనా ప్రార్థించవలసిన అవసరంఏర్పడినా భగవంతుడు సర్వజ్ఞుడు. అతనికి అన్నీ తెలుసు. అతని ఇష్టానుసారమే జరగనీ అన్న భావనా, అసంగత్వమూ మనకు అలవాటు కావాలి ఈవిధంగా ఈశ్వరశరణాగతి, ఈశ్వరభక్తే మనం పెంపొందించుకొంటే ఈశ్వరప్రసాదం మనకు లభిస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer told the story about mukthi margam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more