• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ బతుకమ్మ పండగ ప్రత్యేకతలు.. బొడ్డెమ్మ, బతుకమ్మ పాటలు

|

డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఒక్క తెలంగాణాలో మాత్రమే విశేష ప్రత్యేకతను పొందిన బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మహార్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి ఎనిమిది రోజులూ ముత్యైదువ స్త్రీలు , బాలికలు రోజు ఎంతో సంబరంగా బతుకమ్మను పేర్చి అందరు ఒక చోట గుమిగూడి ఆడుకుంటారు. దీనిని బొడ్డెమ్మ అంటారు. తొమ్మిదవ రోజున మాత్రం సద్దుల బతకమ్మ అంటారు. బకతమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష ఋతువుతో విండిన చెరువులు తొణికస లాడుతూ వుంటాయి.విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది.ఈ పండుగ రోజుల్లో పుట్ట మన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్ఠించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పశుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంకరిస్తారు.ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయక పోయినా, గ్రామానికి ఒక గృహంలో చేసినా సరి పోతుందని వారి అభిప్రాయం.

బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్లలందరూ అక్కడ గుమికూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్ద లందరూ వస్తారు. ఇలా ఎనిమిది రోజులూ కన్నె పడచులు ఆడుకుంటారు. తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి, పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాప వేసి బతకమ్మలను పేర్చి గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే వుంచుతారు.

సాయంత్రం పిన్నలు, పెద్దలు నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు వివిధ అలంకారాలను అలంకరించుకుని బతకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతకమ్మలను మధ్య పెట్టుకుని బాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.

Batukamma Boddemma Festival Songs

ఆ దృశ్యాన్ని చూస్తూ గ్రామస్తులందరూ ఆనందిస్తూ వుంటారు.బతకమ్మ పాటలు ఒకో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతం లోనూ ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ ,సరస్వతుల స్తోత్రాలేగాక అనేక పౌరాణిక గాథలైన శసి రేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసము మొదలైనవే గాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ వుంటారు.

బతుకమ్మ పండగ వస్తూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద ఊరి సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడ పిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో వుండే ప్రతి ఆడపిల్లా ఎప్పుడు కన్న వారింటికి వెళ్ళాలా ? కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తూందా ? తనను తీసుకు వెళ్ళడానికి అన్న ఇంకా రాలేదే అన్న బాధను వ్వక్త పరుస్తారు.

ఉదాహరణకు పండుగ వస్తుందంటే, ప్రియుని రాకకై ఎదురు చూసే ప్రియు రాండ్లు పాడుకునే పాట.

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో

నానోము పండింది ఉయ్యాలో

నీనోము పండిందా ఉయ్యాలో

మావారు వచ్చిరి ఉయ్యాలో

మీవారు వచ్చిరా ఉయ్యాలో

బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట

ఒక్కొక్క వువ్వేసి [[చంద మామ||

ఒక జాము అయే [[చంద మామ||

రెండేసి పువ్వు తీసి ||చంద మామ||

రెండు జాము లాయె ||చంద మామ||

ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతారు. తొమ్మిదవ నాడు బొడ్డెమ్మ చర్చించి కలశంలో, ఆవాడ పిల్లలు ప్రతిదినం చెచ్చి పోసే బియ్యం పరమాన్నం వండి పంచి పెట్టి ఒక బావి దరి చేరి

బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే

బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా

చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా

కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ

నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ

నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు

నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు

అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. బొడ్డెమ్మ పండుగలో పాడబడే పాటలు ఇంకా కొన్ని వందలున్నట్లు బి. రామరాజుగారు తమ జానపద గేయ సాహిత్యంలో తెలియచేసారు.

కోసలాధీశుండు ఉయ్యాలో - దశరథ నాముండు ఉయ్యాలో -

కొండ కోనలు దాటి ఉయ్యాలో - వేటకే బోయెను ఉయ్యాలో -

అడవిలో దిరిగెను ఉయ్యాలో - అటు ఇటు జూచెను ఉయ్యాలో -

చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో - చెరువొకటి కనిపించె ఉయ్యాలో -

శబ్దమేదొ వినెను ఉయ్యాలో - శరమును సంధించె ఉయ్యాలో -

జంతువేదొ జచ్చె ఉయ్యాలో - అనుకొని సాగెను ఉయ్యాలో -

చెంతకు చేరగా ఉయ్యాలో - చిత్తమే కుంగెను ఉయ్యాలో -

కుండలో నీళ్ళను ఉయ్యాలో - కొనిపో వచ్చిన ఉయ్యాలో -

బాలుని గుండెలో ఉయ్యాలో - బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో -

ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో - ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో -

శ్రవణుడు నేననె ఉయ్యాలో - చచ్చేటి బాలుడు ఉయ్యాలో -

తప్పు జరిగెనంచు ఉయ్యాలో - తపియించెను రాజు ఉయ్యాలో -

చావు బతుకుల బాలుడుయ్యాలో - సాయమే కోరెను ఉయ్యాలో -

నా తల్లిదండ్రులు ఉయ్యాలో - దాహంతో ఉండిరి ఉయ్యాలో -

ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో - ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో -

ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో - అడవంతా వెదికె ఉయ్యాలో -

ఒకచోట జూచెను ఉయ్యాలో - ఒణికేటి దంపతుల ఉయ్యాలో -

కళ్ళైన లేవాయె ఉయ్యాలో - కాళ్ళైన కదలవు ఉయ్యాలో -

వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో - వేదన చెందుతూ ఉయ్యాలో -

సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో - సంగతి జెప్పెను ఉయ్యాలో -

పలుకు విన్నంతనే ఉయ్యాలో - పాపమా వృద్ధులు ఉయ్యాలో -

శాపాలు బెట్టిరి ఉయ్యాలో - చాలించిరి తనువులుయ్యాలో -

శాపమే ఫలియించి ఉయ్యాలో - జరిగె రామాయణం ఊయ్యాలో -

లోక కల్యాణమాయె ఉయ్యాలో - లోకమే మెచ్చెను ఉయ్యాలో

English summary
Batukamma is a important festival in Telangana region once upon a time. But its now celebrated world wide. Telugu one india providing Batukamma songs for the Women who celebrates this festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more