ముందుంది వరస్ట్ వర్షాకాల సీజన్?
గత రెండేళ్లుగా రుతుపవనాలు నిరాశపరచలేదు. 2024, 2025లలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జలాశయాలు నిండాయి. నిండుకుండల్లా తొణికిసలాడాయి. ఈ ఏడాది ఈ జలకళకు తెరపడే ప్రమాదం పొంచివుంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
జూన్ నుండి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు వర్షాలను కురిపించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. సాధారణం కంటే 90 శాతానికే పరిమితం కావచ్చు. ఐఎండీ అంచనాల ప్రకారం ఈ ఏడాది గత దశాబ్దంలోనే అత్యంత పొడి రుతుపవన కాలం (Dry Monsoon Season) కానుంది. చివరిసారిగా దేశంలో వర్షపాతం లోటు 2015లో నమోదైంది. ఆ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర కరువు, పంట నష్టాలు, తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి.

ఇప్పుడు అంతకంటే దుర్భర పరిస్థితులు తలెత్తవచ్చే అవకాశాలను వాతావరణ కేంద్రం కొట్టిపారేయట్లేదు. సాధారణం కంటే చాలా తక్కువగా ఉండే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది 60 శాతానికి పరిమితం కావొచ్చు కూడా. దీనికి కారణం.. ఎల్ నినో.
సాధారణ స్థితి నుండి ఎల్ నినో వైపు
పసిఫిక్ మహాసముద్ర వాతావరణం ప్రస్తుతం సాధారణ స్థితి నుండి ఎల్ నినో వైపు మారుతోంది. ఈ రుతుపవన కాలంలోనే ఎల్ నినో పరిస్థితులు అభివృద్ధి చెందుతాయి. రోజులు గడిచే కొద్దీ మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయం చాలా కీలకమైనది. రుతుపవనాలు.. అనేవి నాలుగు నెలల కాలాన్ని శాసించేవి. దాని చివరి నెల.. సెప్టెంబర్. చేతికి అందుతున్న పంటలకు అత్యంత సున్నితమైన సమయం.
వ్యవసాయంపై..
పంటలు గింజ దశకు చేరుకునే సమయంలో వరి, ఇతర ఖరీఫ్ పంటలకు నిరంతర వర్షపాతం తప్పనిసరి. రుతుపవన కాలం పురోగమిస్తున్న కొద్దీ అవి బలహీనపడతాయి ఎల్గా నినో కారణంగా. సరిగ్గా సెప్టెంబర్ మాసం ఆరంభం అయ్యే సమయానికి ఎల్ నినో మరింత బలపడుతుంది. వ్యవసాయానికి అత్యంత దారుణమైన పరిణామాలను కలిగిస్తుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
ప్రపంచ దేశాలు కూడా..
ఈ ప్రమాదం గురించి భారత్ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. ఆస్ట్రేలియా వాతావరణ బ్యూరో ఎల్ నినో పరిస్థితులు జూన్ నెల ప్రారంభంలోనే కనిపించవచ్చని అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో వేడిమి ఇప్పటికే ఎల్ నినో దశలోకి ప్రవేశించిందని, రాబోయే నెలల్లో దీని తీవ్రత మరింత పెరుగుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం నివేదించింది.
నాసా సైతం..
ప్రతి 10 రోజులకు మొత్తం సముద్ర ఉపరితలం ఎత్తును మ్యాప్ చేసే సెంటినెల్-6 ఉపగ్రహం నుండి వచ్చిన డేటాను నాసా విశ్లేషించింది. పసిఫిక్ మహాసముద్రం కింద వెచ్చని నీటి ఆవిర్లు ఏర్పడుతున్నట్లు గుర్తించింది. ఎల్ నినో ఏర్పడటానికి ఇది తాజా నిదర్శనం. ఇది కూడా ఉపరితల ఉష్ణ జలాశయం లాంటిదేనని చెబుతున్నారు.
నాటి రక్షణ కవచం ఇప్పుడు ఉండదు..
ఎల్ నినో సంభవించినప్పుడు హిందూ మహాసముద్రం డిపోల్ (IOD) అనేది ఏర్పడేది. ఎల్ నినో భారత ఉపఖండం వైపు ప్రవహించకుండా అడ్డుగోడగా రక్షించేది. పశ్చిమ భాగం తూర్పు భాగం కంటే వెచ్చగా ఉన్నప్పుడు పాజిటివ్ డిపోల్ అభివృద్ధి చెందుతుంది. ఇది ఉపఖండం వైపు అదనపు తేమను పంపి, ఎల్ నినో పొడి ప్రభావాన్ని పాక్షికంగా తటస్థీకరిస్తుంది.
పంట దిగుబడులు తగ్గే ప్రమాదం..
1997-98లో భారతదేశ రుతుపవనాలను ఇది సరిగ్గా రక్షించింది. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు లేవని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎల్ నినో తీవ్రతను హిందూ మహాసముద్రం అడ్డుకోలేకపోవచ్చు. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కోర్ జోన్‌లో రుతుపవన లోటు ఖరీఫ్ పంటల అంటే వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల దిగుబడులు తగ్గడానికి దారితీస్తుంది.












Click it and Unblock the Notifications