నేడే ఆషాఢ అమావాస్య: నదీ స్నానం.. సర్వపాపహరణం: అరుదుగా
హిందూ ధర్మంలో అమావాస్య తిథికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి ఒక ఎత్తు అయితే, ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య మరో ఎత్తు. దీన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పైగా.. ఓ అరుదైన మహాసంయోగానికి వేదిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకే అమావాస్య తిథి కాలంలో అటు సోమవతి, ఇటు భౌమవతి అమావాస్యలు కలిసి వచ్చాయి. వీటి పుణ్యఫలాలు రెండూ ఒకేసారి లభించనుండటం విశేషం.
ఈ ఏడాది ఆషాఢ అమావాస్య తిథి సోమవారం సాయంత్రం 6: 49 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ మధ్యాహ్నం 3:12 నిమిషాల వరకు కొనసాగుతుంది. దీని వల్ల భక్తులకు ఒకే పర్వదినాన రెండు అమావాస్యల పుణ్యఫలాన్ని పొందే అరుదైన అవకాశం లభిస్తోంది. ఆధ్యాత్మిక సాధన, ఉపవాస వ్రతాలు ఆచరించే వారికి రెట్టింపు అనుకూల ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

హిందూ సాంప్రదాయాల ప్రకారం.. సోమవారంతో కూడిన అమావాస్యను సోమవతి అమావాస్యగా, మంగళవారంతో కూడిన తిథిని భౌమవతి అమావాస్యగా పిలుస్తారు. ఈ రెండు తిథులు ఒకేసారి కలవడం అత్యంత అరుదు. ఈ మహాసంయోగం రోజున గోదావరి, కృష్ణా వంటి పవిత్ర నదులలో స్నానాలు ఆచరించడం, ఆ జలాల్లో దీపాలను వదలడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. పరమేశ్వరుడితో పాటు శ్రీమహావిష్ణువును, ఈశ్వరాంశ సంభూతుడైన శ్రీ హనుమంతుడిని ఆరాధించడం వల్ల సకల మనోభీష్టాలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ అత్యంత శుభప్రదమైన రోజున పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేయడం, దర్భలతో కూడిన తర్పణాలు వదలడం వల్ల పితృ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం శుభఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా నల్ల నువ్వులు, గొడుగులు, పాత్రలు వంటి వస్తువులను దానం చేయడం ఎంతో ప్రశస్తమైనది. గోసేవ చేయడం ద్వారా జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయి.
ఆధ్యాత్మిక శుభ తరుణాల్లో కఠినమైన ఆహార నియమాలు పాటించడం మనస్సును నియంత్రణలో ఉంచుతుంది. అమావాస్య పర్వదినాన పరిపూర్ణ సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. సంపూర్ణ ఉపవాసం ఉండలేని వారు మితాహారాన్ని తీసుకోవచ్చు. తాజా పండ్లు, పాలు, పెరుగు, సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు, ఉప్పు కలపని అన్నం తీసుకోవచ్చు.
అదే సమయంలో ఆషాఢ అమావాస్య రోజున తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మద్యం, మాంసం, గుడ్లు వంటి పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకాన్ని కూడా నిషేధించాలి. అలాగే భూమి లోపల పండే కూరగాయలైన దుంపలు, క్యారెట్లు, క్యాబేజీలను ఆహారంలో చేర్చుకోకూడదు. ఇటువంటి సాత్విక జీవనశైలిని పాటించడం వల్ల ఆషాఢ అమావాస్య ఫలితాలు అందుతాయని విశ్వసిస్తారు.













Click it and Unblock the Notifications