• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏకాదశి ఉపవాస వ్రత నియమాలు ఏమిటి ..?ముందు రోజు మరుసటి రోజు ఏం చేయాలి..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం

ఇందులో సృష్టిక్రమం.. సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం.. ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు. శాంతాకారం సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది. శాంతం, శమనం అంటే అన్నీ లయించిన స్థితి. అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా సర్వ జగతి పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి శాంతి.

Ekadasi:What are Vrata rules to be follwed while fasting on this auspicious day

ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా ఈ శబ్దం తెలియజేస్తోంది. శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ భుజగ శయనం భుజగశయనుడు.. అనంత కాలతత్త్వమే అనంతుడు ఆదిశేషువు భుజగము. ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు. కాలానికి లొంగి ఉన్నవి లోకాలు. కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు. పద్మనాభం సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.

సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం. దానికి నాభి (కేంద్రం) విష్ణువే. అందుకే ఆయన 'పద్మనాభుడు'. సురేశం విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది. నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ. జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు ( సు- అంటే మేలు, 'రాతి' అంటే కలిగించు వాడు. సుం-రాతి - మేలును కలిగించువారు సురలు). ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు. ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే. అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై 'సురేశు'డయ్యాడు.

విశ్వాధారం కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు 'సురలు'. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు. సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే 'విశ్వాధారుడు'. కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే 'విశ్వాకారుడు' కూడా. నదిలో అలలన్నిటికీ జలమే 'ఆధారం'. అలల 'ఆకారం' అంతా జలమే. జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే.. విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు. గగన సదృశం ఇది ఎలా సంభవం? ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ ఆకాశమే ఉన్నది. సమస్తమూ ఆకాశము నందే ఉన్నది. అదేవిధంగా ఆకాశంతో సహా సమస్త విశ్వమూ ఎవరియందు, ఎవరిచే వ్యాప్తమై ఉందో అతడే పరమాత్మ.

అందుకే ఆయన 'గగనసదృశుడు'(గగనం వంటివాడు). ఇదే భావాన్ని 'ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః' అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది. ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది. మేఘవర్ణం నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే.. తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు. ఆ సాకారం 'మేఘవర్ణం' (మబ్బువన్నె)గా ఉన్నది. శుభాంగం మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం సంసార తాపత్రయాల్ని పోగొట్టి జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.

అందుకే అది నీలమేఘశ్యామం. ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే. కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు. తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు. అందుకే ఆయన రూపం 'శుభాంగం'. లక్ష్మీకాంతం ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి. ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది. అందుకే ఆ శుభ స్వరూపం 'లక్ష్మీకాంతం'. కమలనయనం ఐశ్వర్య దేవతకు ప్రీతికరం. కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు 'కమలనయనుడు'.

యోగిహృద్యానగమ్యం ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు. యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు. ఆ కారణం చేతనే అతడు 'యోగిహృత్ ధ్యానగమ్యుడు'. వందే విష్ణుం భవ భయహరం విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక 'విష్ణువు'. ఈ తత్త్వాన్ని గ్రహించి శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి 'భవభయహరుడు'. సర్వలోకైకనాథమ్ సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే 'సర్వలోకైకనాథమ్'. 14 నామాలతో 'విశ్వానికీ - విష్ణువునకు' ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.

ఏకాదశి ప్రాశస్త్యం :- భారతీయులకు ఉన్నన్ని పండుగలు ఇతర దేశస్థులకు లేవు. ప్రతీ పండుగలోనూ ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ఆరోగ్యాది విశేషాలు లీనమై ఉంటాయి. వాటిని గుర్తించి ఆంతర్యాన్ని గ్రహించి ఆయా పండుగలు, వ్రతాలు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే వేద వాజ్ఞ్మయ హైందవ ధర్మ ఫలాలు సిద్ధిస్తాయి. సర్వమూ కాలాధీనం. "కాలః కలయతా మహమ్" అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది.

కాలము శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు. అనంత శక్తివంతమైన కాలాన్ని సౌరం, చాంద్రం, సావనం, నక్షత్రం అని నలుగు విధాలుగా సూచించి గణించడం జరిగింది. దక్షిణాదిలో సౌరచాంద్రమానాలే గణనీయాలు. మనం చైత్ర వైశాఖ మాసాలని, పాడ్యమి, విదియ తిథులని చాంద్రమానం ప్రకారం గణిస్తున్నాము. చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి గణించేవి చైత్రాది మాసాలు. సూర్యుణ్ణి ఆధారంగా సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశించి ఉండే నెలరోజులకూ ఆయా మాసంగా చెప్పబడుతుంది. చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు.

ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు :-

చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది
చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు
వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్యప్రాప్తి
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి - 'నిర్జల" - ఆహార సమృద్ధి
జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగిని' - పాపములను హరిస్తుంది
ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి)
ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' కోరిన కోర్కెలు ఫలిస్తాయి
శ్రావణ శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి
శ్రావణ బహుళ ఏకాదశి - 'ఆజా' - రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ
భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి) భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును
ఆశ్వయుజము శుక్ల ఏకాదశి - 'పాపంకుశ' - పుణ్యప్రదం
ఆశ్వయుజము బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి
కార్తీక శుద్ధ ఏకాదశి - 'ప్రబోధిని' - (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి
కార్తీక బహుళ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు)
మార్గశిర శుద్ధ ఏకాదశి - 'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
మార్గశిర బహుళ ఏకాదశి - 'విమలా' -(సఫలా) - అజ్ఞాన నివృత్తి
పుష్య శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
పుష్య బహుళ ఏకాదశి - 'కళ్యాణీ' (షట్ తిలా) ఈతిబాధా నివారణం
మాఘ శుద్ధ ఏకాదశి - 'కామదా' (జయా) - శాపవిముక్తి
మాఘ బహుళ ఏకాదశి - 'విజయా' - సకలకార్య విజయం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'ఆమలకీ' - ఆరోగ్యప్రదం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'సౌమ్య' - పాపవిముక్తి

( కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని బేధాలున్నాయి. )

శారీరక శక్తి ఉన్నవారు మాత్రం ఉపవాసం ఉండాలి. ఏకాదశి జాగరణ తప్పక చేయాలనే నియమం ఏమి లేదు... జాగరణ చేయని వారికి ఏ దోషం వర్తించదు. భగవంతునికి భక్తి ప్రధానం, ఇబ్బంది పడుతూ ...ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ.. ఏం చేసినా ఫలితం ఉండదు. ఉపవాస్యం అనేది ఫలాపేక్ష రహితం ఉండాలి. కోరికలను మనస్సులో పెట్టుకుని వ్రతాలు, దీక్షలు, ఉపవాసాలు చేస్తే ఫలితం అంతాగా లభించదు.

సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావన ఉంటుంది. కానీ ఏకాదశి వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు. పైగా ఖర్చును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతిమాసంలో ఏకాదశికి ముందు రోజు అంటే దశమిరోజు రాత్రి పూట భోజనం చేయకూడదు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లుపాలు తీసుకోవాలి.

మరుసటి రోజు అంటే ఏకాదశిరోజు ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకుని తమతమ కార్యాక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. అయితే పైన పేర్కొన్న వారు మాత్రం తేలికపాటి అల్పాహారాన్ని మితంగా తీసుకోవాలి.

ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన, పూజలు, స్తోత్ర పారాయణాలు చేయాలి. వీలైతే తప్పక గోపూజ చేయండి. చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజు విష్ణునామస్మరణ చేసుకోండి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

మర్నాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతఃకాలంలోనే లేచి యధావిధిగా నిత్యకాలకృత్యాలు, దేవతారాధన చేసుకుని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిభుక్కుల కింద కనిపించే, కనిపించని జీవరాశికి ఇంటిబయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని చేయాలి.

దానగుణం, దయాగుణం అలవరచుకోవాలి. సహనం లేనివారు, నిష్టలేని ఉపవాసం ఎంతమాత్రం పనికిరాదు..చేయకూడదు, ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని ఇముడ్చుకుని శాంత స్వభావంతో ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడరాదు, దురుసుగా ప్రవర్తించకుండా ఉండగలగాలి. ఎవరిని కోపగించుకోకూడదు. అన్ని వేళలయందు దైవత్వాన్ని కలిగి .. నిర్మలమైన మనస్సుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి, జై శ్రీమన్నారాయణ.

English summary
One who is fasting on the auspicious Ekadasi day need to follow the vrata rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X