నందమూరి వంశం నుంచి తాత, బాబాయ్ చేయని సాహసంతో జూనియర్ ఎన్టీఆర్
తెలుగు సినిమా వెండితెరపై పౌరాణికం అంటే అది నందమూరి వంశానికే సొంతమైన ఆస్తి అని చెప్పొచ్చు. ఆ కుటుంబం నుంచి వచ్చినన్ని పౌరాణిక సినిమాలు ఏ హీరో నుంచి రాలేదు. న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఆ పాత్రల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన నందమూరి తారక రామారావు ఒక ఒరవడిని సృష్టించారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు 'యంగ్ టైగర్' సిద్ధమయ్యారు.
తెలుగువారి గుండెల్లో రాముడన్నా, కృష్ణుడన్నా ముందుగా మెదిలే రూపం ఎన్టీఆర్ దే. ఆయన తనయుడిగా నందమూరి బాలకృష్ణ కూడా అదే బాటలో నడిచి 'శ్రీరామరాజ్యం' వంటి అద్భుత కావ్యాలను అందించారు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, నందమూరి అభిమానుల దాహాన్ని తీర్చేందుకు ఒక భారీ పౌరాణిక దృశ్యకావ్యం రూపుదిద్దుకుంటోంది.

తాత, బాబాయ్ టచ్ చేయని 'సుబ్రహ్మణ్య' తత్త్వం!
ఈ ప్రాజెక్టులోని అసలైన విశేషం ఏమిటంటే.. సీనియర్ ఎన్టీఆర్ దాదాపు అన్ని దైవ స్వరూపాలను పోషించారు. బాలయ్య కూడా తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పించారు. కానీ, వీరిద్దరూ కూడా ఎప్పుడూ పోషించని పాత్ర 'సుబ్రహ్మణ్య స్వామి'. ఇప్పుడు ఆ వంశంలో ఎవరూ చేయని సుబ్రహ్మణ్య స్వామి పాత్రతో తారక్ రాబోతుండటం నందమూరి వంశ చరిత్రలోనే ఒక మైలురాయి కానుంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే పురాణాలను, ఇతిహాసాలను నేటి తరం ఆలోచనలకు తగ్గట్టుగా చెప్పడంలో దిట్ట. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి 'గాడ్ ఆఫ్ వార్' అనే పవర్‌ఫుల్ టైటిల్ ప్రచారంలో ఉంది. 'దేవసేనాని'గా సుబ్రహ్మణ్య స్వామి శూరాపద్ముడిని ఎలా అంతం చేశారు? తారకాసురుడి సంహారం ఎలా జరిగింది? అనే అంశాలను కళ్ళు చెదిరే VFX, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు.
మే 20న ఖాయమా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ అనౌన్స్‌మెంట్ వీడియో రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక సినిమా ప్రకటన మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో తెలుగు పౌరాణిక సత్తాను చాటిచెప్పే 'విజువల్ వండర్' గా నిలుస్తుందంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని విడుదల చేయబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇదే తొలి పాన్ ఇండియా సినిమా అవుతుంది. గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసితో ఉన్న త్రివిక్రమ్ తొలిసారిగా ఒక పౌరాణిక చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications