కార్తీకమాసం మొదటి సోమవారం ఎప్పుడు
ఎల్లుండి నుంచి పవిత్ర కార్తీకమాసం ఆరంభం కాబోతోంది. దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీకమాసం మొదలవుతుంది. ఈ నెలలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తెల్లవారు జామునే సముద్రం/నదీ స్నానం చేయడం, గంగమ్మ తల్లికి పూజలు చేయడం, దీపాలను వెలిగించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి శైవక్షేత్రాలన్నీ కార్తీక శోభను సంతరించుకుంటాయి. ఈ నెల పొడవునా భక్తులు ఆలయాలను సందర్శిస్తుంటారు.
ఈ నెల 10వ తేదీ మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో ప్రతిరోజూ సంధ్యా సమయంలో దీపారాధన చేయడం, వేకువజామునే నదీ స్నానాలు ఆచరించడం, ఉపవాస దీక్షలు చేపట్టడం హిందూ సంప్రదాయంలో ప్రధాన భాగం. ఇళ్ల ముందు దీపకాంతులు, శైవక్షేత్రాల సందర్శనతో నెల రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.

తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసం 10వ తేదీ మంగళవారం ప్రారంభమౌతుంది. డిసెంబర్ 8వ తేదీన అమావాస్యతో ముగుస్తుంది. సోమవారం మధ్యాహ్నం 12:31 గంటలకు శుక్ల పాడ్యమి ప్రారంభమై, మరుసటి రోజు మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉండటం వల్ల ఈ సోమవారాన్ని కార్తీక మాసం మొదటివారంగా పరిగణనలోకి తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. 10వ తేదీన ఉదయం నుంచే కార్తీక మాస నియమాలు అమల్లోకి వస్తాయి.
కార్తీక మాసంలో పవిత్ర సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ రోజుల్లో భక్తులు ప్రత్యేక ఉపవాసాలు, శివాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మొదటి కార్తీక సోమవారం 16వ తేదీన ఉంటుంది. రెండో సోమవారం 23, మూడో సోమవారం 30 నాలుగో సోమవారం డిసెంబర్ 7న వస్తాయి. ఈ ఏడాది నాలుగు కార్తీక సోమవారాలే ఉంటాయి. ఇక ఈ మాసంలో అత్యంత ప్రధానమైన కార్తీక పౌర్ణమి ఉత్సవం ఈ నెల 24వ తేదీ మంగళవారం నాడు వస్తుంది.
ఆ రోజున ఆలయాలలో జ్వాలా తోరణం, దీపోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ మాసంలో శివుడితో పాటు శ్రీమహావిష్ణువును కూడా సమానంగా ఆరాధిస్తారు. "శివాయ విష్ణు రూపాయ.. విష్ణు రూపాయ శివాయ" అనే భక్తి భావనతో హరిహరులకు భేదం లేదని ఈ మాసం చాటిచెబుతుంది. ఇళ్లల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో తుళసి కోట వద్ద, పూజా మందిరాల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, మనశ్శాంతి లభిస్తాయి.
అలాగే ఉసిరి చెట్టు వద్ద పూజ, వన భోజనాలు కూడా ఈ మాసంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ మాసంలో ప్రతిరోజూ సాయంత్రం వేళ కార్తీక పురాణం పఠించడం లేదా వినడం తెలుగు ఇళ్లలో తరతరాలుగా వస్తున్న ఆచారం. భక్తి శ్రద్ధలతో పాటు జీవన క్రమశిక్షణ, సత్ప్రవర్తన, దాన గుణాన్ని ఈ పురాణ కథలు పెంపొందిస్తాయి. తమ శక్తికి తగినట్లుగా పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం, దీపదానం చేయడం ద్వారా ఈ పవిత్ర మాసంలో సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.














Click it and Unblock the Notifications
