ఆత్మజ్ఞానం/అధ్వైత స్థితి
తస్మాత్‌సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ||
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ||
అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మనస్సునూ, బుద్ధినీ నాకు అర్పిస్తే నీవు నిస్సంశయం గా నన్నే పొందుతావు.
అంత్యకాలంలో భగవంతుడు గుర్తురావాలంటే ఇక్కడ చెప్పినట్లుగా చేయాలి. ఒక గొప్ప విషయాన్ని గురించి విశ్వాసం ఏర్పడ్డాక మనో వాక్కాయములతో దానిని సాధించడం వివేకుల లక్షణం. మనో బుద్దులు రెండూ భగవంతుని స్మరించుకుంటే శరీరం ఏపనిచేస్తున్నా
వాటి ఆదేశాలకి వ్యతిరేకంగా పోదు. జీవితం దైనందిన సంగ్రామం. భగవంతుని తలచుకుంటూ చేసిన సంగ్రామం ఆయన వద్దకి తీసుకు పోతుంది.

పార్థా ! మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు.
'నేను' అన్నపుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయిన నిరాకార పరబ్రహ్మము నిర్దేశింపబడుతున్నది. స్థూల సూక్ష్మ కారణ శరీరాల తాదాత్మ్యాన్ని వదిలిన జీవుడు వాటికి అతీతంగా ఉండే పరమాత్మ అంశలో లీనమై అద్వైత స్థితిని అందుకుంటాడు.
'పరమపురుషుడు' అన్నపుడు సృష్టి స్థితి లయ కారకుడయిన ఈశ్వరుడు నిర్దేశింప బడుతున్నాడు.
తనస్థూల సూక్ష్మ శరీరాలతో తాదాత్మ్యం వదలని సాధకుడు ప్రపంచానికి కారకుడైన భగవంతుని ధ్యానించి నపుడు తనకన్న భిన్నంగా ద్వైతభావంలోనే ఊహించుకుంటాడు.
ఆ జీవుడు భగవంతుని చేరుకున్నాక కూడా భిన్నంగానే ఉండి ఆయన సన్నిధానాన్ని అనుభవస్తాడు. అతడు తిరిగి భూలోకంలో జన్మించడు. అందువల్ల అదికూడా మోక్షమే.
ద్వైతభావనలో ఈశ్వరుడు సాకారుడా? నిరాకారుడా? బుద్దిద్వారా ఉపాసనచేసేవారికి నిరాకారుడు. మనసు ద్వారా ఉపాసనలో సాకారుడు. రెంటినీ అధిగమించినపుడే అద్వైతం ( మనస్సు బుద్దీ లయమై పోవాలి) . అద్వైత సాగరంలో సాకార నిరాకారాలు రెండూ అలలు.
ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు, తానే బ్రహ్మముననెడి అనుభూతి చెందుతాడు.
మహా వాక్యముల అనుభవ జ్ఞానాన్ని పొందుతాడు.
తానే భగవంతునిగా రమిస్తూ మిగిలి పోతాడు
జ్ఞాన భూమిక లనన్నింటిని అధిగమిస్తాడు.
ప్రపంచములో ప్రతి అణువు భగవంతునిగా
(తన స్వరూపముగా) అనుభూతి చెందుతాడు.
సృష్టికి ఆవలనున్న నిరాకార పరబ్రహ్మము తానై రమిస్తాడు.
సకల జీవరాసు లందున్న చైతన్యము తానై రమిస్తాడు.
సకల చరా చర సృష్టియందలి చైతన్యము తానై రమిస్తాడు.
శరీరమును ప్రారబ్ధ వశమున కలిగిన జడమైన కట్టుగా తనకంటె భిన్నముగా దర్శిస్తూ ఉంటాడు.
జీవ బ్రహ్మైక్యము జరిగినందువలన కోట్ల కొలది కల్పముల నుండి వెంటాడుచున్న సంచిత కర్మఫలములు నిశ్శేషముగ దగ్ధమగును.
అగామి కర్మఫలములు అంటకుండును.
శరీరము ప్రారబ్ధమును అనుభవించుచుండగా తాను సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు.
మూడు విధములైన కర్మలు నశించుటచే కర్మరాహిత్యము దానివలన జన్మరాహిత్యము సంభవించును.
దేహవాసనతో సహా సమస్త వాసనలు నశించును.
ఇంద్రియ నిగ్రహము, అరిషడ్వర్గ నాసనము, శబ్దాది విషయ త్యాగము కలుగును.
బంధకారకమగు మనస్సు మోక్ష కారకముగా పరిణమించును.
సాక్షి స్థితి సంభవించును. బంధ కారక సత్త నశించి అమనస్క స్థితి సంభవించును.
ద్వైతము పూర్తిగా నశించును. అధ్వైత స్థితిలో
చివరిగా అంతఃకరణ బ్రహ్మములో లయమొందును.
అవిద్యా రూప కారణ శరీరము నశించును.
జీవుడు తన ఉనికిని కోల్పోయి బ్రహ్మము నందైక్యమగును.
ఆత్మ జ్ఞానము వలననే జీవుడు జీవన్ముక్తిని పొందును.
ప్రారబ్ధానంతరము విదేహ ముక్తిని పొందును.
జీవుని అజ్ఞాన మానవుని స్థితి నుండి జీవన్ముక్తి వరకు నడిపించు దివ్యశక్తి ఆత్మ జ్ఞానమే.
ఆత్మ జ్ఞానమును శరణు పొందుము. తరించుము.అధ్వైతానుభూతితో చరించుము.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!