• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీనాక్షి అమ్మవారిపై ఆదిశంకరుల విజయం : పాచికలాటలో ఓడిన జగన్మోహిని

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

పంచ శక్తి పీఠములలో మధుర మీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాలనేత్రములతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలము కలగలిపిన మరకత మణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత.

మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్య రాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతున్నది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతములోని మూలల నుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించి వేసినది మీనాక్షి.

పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రి వేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా, అపాయం వచ్చినా వారికిక బయటకి వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతై పోవలసిందే!

Madhura Meenakshi Temple Pillar is one of the most prominent Pandha power pillars

క్షేత్ర పాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షీ భూతునిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించు కున్నాడా భోళా శంకరుడు.

తన శరీరంలోని అర్ధభాగము అయిన ఈశ్వరుని అవమానపరిస్తే , తనను తాను అవమానపరచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైనది. ఏ సమయములో, ఏ ప్రాణికి, ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు. ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచి అయినా, చెడు అయినా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.

ఆది శంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి పైవిధముగా ఉన్నది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతము పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు" నేను మధుర మీనాక్షి ఆలయం లో ఈ రాత్రికి ధ్యానము చేసుకుంటాను అని చెప్పాడు". ఆ మాటలను విన్న పాండ్య రాజు పాదాల కింద భూకంపము వచ్చినంతగా కంపించిపోయాడు."వద్దు స్వామి మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయములో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్ల బలితీసుకుంటున్నది.

అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగము రాని విధముగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయములోకి రాత్రి వేళ అడుగుపెట్టవద్దు. అసలు అంతః పురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. పొరపాటుగా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్య రాజు వేడుకున్నాడు. ఆది శంకరా చార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధాన పరచాడు. 'సన్యాసులకు గృహస్తుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కాని తర్వాత వారు గృహస్తుల గృహాలలో ఉండరాదు. మేము ఆలయములోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానము చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు' అన్నాడు. పాండ్యరాజు హతాశుడైనాడు.

దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువబ్రహ్మచారినిక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయము లోనికి తీసుకొనివెళ్లి తిరిగి అంత:పురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్ర లేదు. ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆ పాపము తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటు ఇటూ పచార్లు చేయసాగాడు.

రాత్రి అయినది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపములో పద్మాసనము వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానములో కూర్చుండి పోయాడు. మరకతశ్యామ అయిన ఆ తల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటి మధ్య నిలచి సహస్రారములో ఆశీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధా వర్షము కురిపిస్తున్నది.

ఆ సమయము లోనే ఆలయములోని గంటలన్నీ వాటంతట అవే మ్రోగనారంభించాయి. ఆలయములోని అన్నివైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చామూర్తిలో చైతన్యము వచ్చి అమ్మవారు మెల్లగా పీఠము నుండి లేచి నిల్చున్నది. పాద మంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది.

కర్ణతాటంకాలు ధగ, ధగ మెరుస్తుండగా, ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీరె, బంగారు జరీ అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెపుతున్నట్లుగా, కోటి వెన్నెలలు రాసిబోసినట్లున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారము వద్దకు వచ్చి లిప్తకాలము ఆగినది.

ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలో ఉన్న యువకయోగి ఆమె విశాల నయన దృష్టి పథం లోకి వచ్చాడు."ఎవరీతడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాలశివుని"లా ఉన్న ఆయోగి ని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి? అని ఆశ్చర్యము కలిగినది.

క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారు మబ్బు వర్ణంలోనికి మారి భయంకర దంష్ట్రా కరాళ వదనంతో, దిక్కులను సైతం మ్రింగివేసే భయంకరమయిన చూపులతో అడుగు ముందుకు వేస్తుంది. మహాకాళీ స్వరూపంలా.

ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారా చూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞ రూపంగానే కన్పిస్తుంది. కన్నతల్లి అందమైనదా ? కాదా ? అనుకోరు కదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !

అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న ఆ తామస మూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. దంష్ట్రా కరాళ వదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తి పారవశ్యానికి అచ్చెరు వొందింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికీ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్లిపోవలిసిన వాడు. మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి?

అర్ధ నిమీళితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చుని స్తోత్రం చేశాడా యువక యోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువక యోగి లోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలి వస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్త్విక తేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.

ఆహా! తన శక్తి పీఠస్థానము ఎంత అద్భుతముగా చెప్పాడీ యువకుడు? అవును తాను త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ. సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తి రూపిణిగా, పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకములో ఎంత చక్కగా వర్ణించి గుర్తుచేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు.

ఆదిశంకరుల ముఖకమలము నుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలు తరంగాలుగా ఆమె కర్ణతాటంకాలను దాటి, కర్ణపుటాలను దాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా! ఏమి పద లాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరము! ఏమి భక్తితత్పరత! ఏమి వర్ణన? శ్రీచక్ర రాజములోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువక యోగికి కరతలామలకము!

"ఎవరు నాయనా నీవు ? నాదారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయములో సంహారకార్యక్రమము చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలము ఆగానంతే. నీవు తొలగు. నిజానికి నీవీపాటికి నాకు ఆహారము కావలసిన వాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది. అన్నది జగజ్జనని వాత్సల్య పూరిత సుధా దృక్కులతో ఆదిశంకరాచార్యను చూస్తూ.

ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి......" గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తల పంకించింది. "నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లి విరిసి "శుద్ధ విద్యామ్ కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనము వలన ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీ దేవి వీణ అయిన "కచ్ఛపి" మధుర నాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది.

నీ స్తోత్రాలకు, నీ భక్తికి మెచ్చాను. నీవు, నీ కవిత్వము చిరస్తాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన అమ్మ వారి స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలము పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నా సంహారకార్యక్రమమును యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరముగా భావించు. అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామస భావ ప్రభావంతో ఉన్న అమ్మవారు.

ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. "బాల్యములో తెలిసీ తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లీ, శంకరుడు నా నామధేయము. దేశాటనముతోనూ, వేదాంతములకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరములు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది గూడా ఎంత కాలం తల్లీ!

కానీ నా హృదయములో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయినది. అది శల్యం లా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తూ ఉంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధమనోహరముగా నవ్వినది.

"ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని. నీ తల్లిని, జగజ్జననిని నేనుండగా నీకేమి కొరత నాయనా! అడుగు నీకోరిక తీర్చి నేను నాసంహార కార్యక్రమమునకు వెళ్లిపోతాను. ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం తరగలేదు. పసితనపు అమాయకత్వము వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వినది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నాదా నవ్వు. అమ్మా ! నాతో పాచికలాడతావా ? అని పసి పిల్లాడు అడిగినట్లుగా అడిగాడు బాల శంకరుడు.

"తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రముతో, నీ భక్తితో, నీ వినయముతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలి కదా! నీకు తెలుసో తెలియదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానము చెప్పాలి అని. ఆ ప్రశ్నలు లౌకికమైనవు కావు. ఎన్నో వేదాంత రహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావలెనన్న పరోపకార ధ్యేయంతోప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యము తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది.

ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసము? లోకకళ్యాణార్ధము. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగము నుండి ఒకానొక కాంతి కిరణము మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడము ఆ తల్లి గమనించలేదు. ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణ కాలము దివ్యానుభూతికి లోనైనది. "శివా, పరమశివా ! తల్లితో ఆడే ఆటలో పందెముగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వరా! అనుకున్నాడు లోలోపల. అది భావనా రూపముగా పరమ శివుని నుండి అందినది.

"పందేము ఏమిటి నాయనా?" అని మరల అన్నది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతడిని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరీశ్వరునికి కూడా తెలియచేయాలి అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది. "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణముగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లీ" అన్నాడు శంకరాచార్య. తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేయి అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితా శక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహాత్కీర్తి రావాలని కోర్కె కోరుతాడాని ఉహించినదా తల్లి.

తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడము నాకు బాధాకరముగా ఉన్నది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమము ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేను నీకు ఆహారము అవుతాను. అన్నాడు దృఢ చిత్తముతో ఆదిశంకరాచార్య.

జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారముగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాట ప్రకారము నేనీ సంహారకార్యక్రమము ను ఆపేస్తాను, సరేనా! అన్నది. ఆమెలో తాను ఎన్నడు ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగా ఉన్నది. పశుపతినే ఓడించే తనకు ఓటమిరాదు. రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుందనిపెంచేట్లుగా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి, తన సంహారకార్యక్రమమును కొనసాగించాలి అని ఆలోచించినది.

ఆదిశంకరాచార్య వినమ్రముగా మ్రొక్కాడు. తల్లీ దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెము నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యము నింపు. నేను ఆటలో అన్యాయము ఆడను, అనృతము పలుకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపములో కూర్చోనవసరము లేదు. నీ గర్భ గుడిలోని ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా! అన్నాడు.

"ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి. చిన్నవాడివి. నీవు మొదట ఆడడము న్యాయము అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయములో మాత్రము "సుందరేశ్వరా! నీ అర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడూ చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనముగా ఉంటుంది. మరి మీ ఇష్టము! అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు.

ఆదిశంకరులు " తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోనికి వచ్చినట్లే కదా! ఈ భావనే నన్ను పులకింపచేస్తోంది. అమ్మా జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మరల ఈ అవకాశము రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడి నైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలము చాలా విలువైనది. మహత్తరమైనది.

నీ లలితాసహస్రనామము లోని కొన్ని నామాలు, వాటి అర్ధాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అదుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. అన్నాడు భక్తితో. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింప చేసే అర్ధాలతో ఆ స్తోత్రము మరింత మహాత్వ పూర్ణమవుతుంది. అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.

సంఖ్యా శాస్త్ర ప్రకారము పావులు కదులుతున్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందమున్నది. అమ్మ వారికి ఆటలో ఆసక్తి హెచ్చినది. ఇరువురి పావులు న్యాయబద్ధముగా కదులుతున్నాయి. "తాటంకయుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తల పంకిస్తోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆది శంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయా విమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు.

తల్లి నవ్వింది. విజయము అంటే విజయము నాదే కదా నాయనా! అన్నది. ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వముతో ఉన్న ఆ తల్లి నయనాలలో, చూపులలో ఎరుపుదనము, అహం కనిపించాయి. "విజయము నాది అయినా, నీది అయినా రెండూ ఒకటే తల్లీ.! నీలో నుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒక నాణేనికి బొమ్మా బొరుసు లాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణములో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయ రహస్యము. అందుకే నీవు గుప్తయోగినివి. గుప్తతరయోగినివి.

ఆ గోప్యాన్ని తెలుసుకోగలగినవారికి విజయమైనా, పరాజయమైనా ఒకటే కదమ్మా! పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయము ఎంతటి నిరాశను ఇస్తుందో అంతటి పట్టుదలను ప్రసాదిస్తుంది. ఆ పరాజయము ద్వారా పొందిన అవమానము, దైన్యము, దైవము పాదాలను పట్టుకొనేలా చేస్తుంది. ఇది మాత్రము విజయము కాదా తల్లీ! అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవశ్యముతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. గెలుపు ఓటములు, ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణ జన్ముడు. సర్వము బోధించగల సమర్ధ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికి రాగా పైకి అనేసింది. నాయనా! నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రము ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై,

వేదవాణి అయి అలరారుగాక.

"నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధముగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం, మోసము చేయను. గెలుపు, ఓటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ! అని అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాలవద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రి లోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధము చేసాడు. జగన్మాత సంతోషించినది. దివ్యాపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యేంతవరకు నీ కోరిక మేరకు నేను నా స్థానములో కూర్చుంటాను, అంటూ గర్భగుడి లోనికి వెనక్కి నడిచింది. ఆ సమయములో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువకయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. ఎంత చిన్న కోరిక కోరాడీ డింభకుడు. ఓడించకూడదు అనే జాలి కూడా కలిగినది.

పీఠము మీద ఆసీనురాలైన మరుక్షణములో ఆమెలో ఇందాక ఉన్న తామస భావము మాయమై నిర్మలత్వము వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేటట్లు అనుగ్రహించు. గెలుపు, ఓటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామస శక్తి అన్నది ఆగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధము చేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్ధించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగినది.అది ఈశ్వర కటాక్షము అని అర్ధమయినది.

"ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీటజననీ! ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవిత నాలో శ్లోకరూపములో పెల్లుబికివస్తోంది. నీ ఆశీస్సులతో అది కవిత్వముగా నా హృదయములో రూపుదిద్దుకుంటున్నది. అంటూనే నిర్వాణ షట్కము లోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు.ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారు ఝాము ఆయినందుకు గుర్తుగా మేలుకొలుపు నగారా మ్రోగుతున్నది. అమ్మవారు తృళ్ళిపడినది. ఈ యువక యోగి మధురవాక్కులలో కాలము ఆగిపోయినది. కాలము వదిగిపోయినది.

తల్లీ! ఇంకా కొద్దిగా ఆట ఉన్నది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు.విశ్వానికి సాక్షిణి ని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా! అన్నది జగన్మాత అతని నోటివెంట ఆ నామాల అర్ధాలు వినాలనే కుతూహలంతో.

తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలే గదా అమ్మా! సర్వ విశ్వానికి సాక్షిణి వైన నీవు ప్రాణులకు కాలము తీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించిన సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ! అన్నాడు.

ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒకమాతృ మమత ఈ యువకుని చూచినప్పటినుంచి తనలో కలుగుతూనే ఉన్నది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలము వినోదమా! కాదు, కాదు. ఇంకేదో కారణము ఉన్నది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖుని లాగా ఏ జన్మలోనో తన బిడ్డా?

ఆట పూర్తి కాలేదు ఈ రోజు. సంహార కార్యక్రమము ఆగిపోయినది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మ ముహూర్త కాలము వస్తున్నది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరికాసేపటిలో కాలాన్ని ఖచ్చితముగా అమలుపరిచే సూర్యభగవాను డొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానము. ఎంత మార్పు ఒక్క రాత్రిలో. ఈ యువకుడు ఏ మంత్రము వేశాడో! అమాయకత్వముతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేసాడా! తీరా తను ఆట ఒడిపోదుకదా! పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపెయ్యాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించినది. క్షణకాలం భయవిహ్వలతతో చలించిన ఆమె విశాలనయనాలు చూస్తూ ఆది శంకరులు భక్తిపూర్వకముగా నమస్కరించాడు.

అమ్మవారి కుండలినీ యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రము లోనివి( "పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానము చేస్తూ పావులు చక చకా కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరత్వరగా పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికలను వేస్తున్నది.

దూరముగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభము అయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయము, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పధానికి మొదటి మెట్టు. "నాయనా! చివరి పందెము నాది. నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. " అవును తల్లీ, భూపురత్రయము, నాలుగు ద్వారాలలోకి వచ్చేశాను నేను కూడా. తొమ్మిదవ ఆవరణ చేరాము తల్లీ, నీవు బిందువులో యధాస్థానములో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యము ఏమున్నదమ్మా! అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లీ, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది? అన్నాడు.

నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహారకార్యక్రమమును నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోర్కె తీర్చుకొని, పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా! అంది అమ్మవారు.

అవును తల్లీ! ఆట పరముగా విజయము నీది. కానీ తల్లీ, ఆట వైపు ఒక్క సారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరముగా, అక్షరసంఖ్యా శాస్త్ర పరముగా, మంత్ర శాస్త్రపరముగా గెలుపునాది అన్నాడు శంకరాచార్య దృఢస్వరముతో. అమ్మవారు ఏమిటి? సంఖ్యాశాస్త్రపరముగానా! అన్నది. ఏదీ స్ఫురించని అయోమయస్థితిలో.

"నవావరణములతో కూడిన శ్రీచక్రరూపము. శ్రీచక్రములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీ చక్రము నీదేహమైతే, సహస్రనామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీ చక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీ ఉనికిని, నీవే అర్ధరహితమని నిరూపిస్తావా! అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వము లోకి, తమస్సు లోకి జారిపోదా! అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపము లోనికి దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణరూపిణిగా కొలువై ఉన్నది. అద్భుతముగా తనని శ్రీచక్రములో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు.గెలుపు తనదా! కాదు కాదు ఆ యువక యోగిదే.

ఆదిశంకరుడు అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహము వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీ భూతుడు సుందరేశ్వరుడున్నాడు. ఆ పరమశివుని గూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆ స్వామి చేస్తాడు. అప్పుడు చూచినది అమ్మవారు సుందరేశ్వరునివైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది.

ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపములో చిత్రించిన ఈ ఆట చిత్రము వరకు నీ విశాలనయనాల చల్లని దృష్టి సారించు తల్లీ! తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ! నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటి కూడా తప్పు పోకుండా ఏకరువు పెడతాను తల్లీ, ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లు పోదు. తప్పు, తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరిఅయిన బీజాక్షరాలను చూడు తల్లీ!

నలబై నాలుగు కోణాలు, తొమ్మిది ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆట చిత్రములో చూడు అమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్విక బీజాక్షరాలను సంఖ్యా శాస్త్రపరముగా మలచి, ఏ పొరబాటు రానివ్వకుండా న్యాయబద్ధముగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయము వరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. "అకారాది క్షకారాంత" దేవతా శక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగినీ దేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యా పరముగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్క సారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చన గదా తల్లీ!

నీ శక్తి పీఠాలలో ప్రతిష్ఠితమైన యంత్రాలలోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్రప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమములో భాగముగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరముగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రము చేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణ ప్రతిష్ట చేసాను. అదే నీ ముందున్న. "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:

"ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్త వైపు కించిత్ లజ్జ, కించిత్ వేదన తో బేలగా చూచినది మధుర మీనాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్రయంత్రాన్ని సర్వ మానవాళికి శ్రేయోదాయకముగా ప్రసాదించాడు. "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీ ఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయములో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరుని రూపము తండ్రిగానూ, తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ "శివ అపరాధ క్షమాపణ స్తోత్రము" గంగా ఝురిలా ఉరకలు వేసిందా క్షణములో.

అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అపుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహము తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వ దేవీ, దేవ గణాలు ఆ స్వామి తీర్పు కోసము ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేసాడు. మధురాపట్టణమంతా మారు మ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్క సారి కైలాసమే కదిలి వచ్చినది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగాయి. భక్త్యావేశముతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రముతో ఆది శంకరులు స్తోత్రము చేయసాగాడు. ఆయన నోటివెంట సురగంగ మహోధృత జలపాతములా స్తోత్రములు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపములో సాక్షాత్కరించాడు.

"దేవీ!" అన్నాడు పరమశివుడు.మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చుని చేతులు జోడించినది. ఇప్పుడామె "మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా". తామసము మచ్చుకైనా లేని మమతా పూర్ణ. భర్త ఆజ్ఞ, తీర్పు శిరోధార్యముగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమ శివుడు ఇలా అన్నాడు. దేవీ! నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈ ప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నము చేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతులుగ ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని, మంత్ర పూతముగా సిద్ధము చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి, ఏ మలినము అంటని బాల్యములో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారం పొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమ తోనే జయించగల్గాలి.

అందుకే ఆ సమయము కోసము వేచి ఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వ శాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితా శక్తి, అతడిని ఆసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసినది. అతి నిరాడంబముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి, పరమశివుడనైన నాకు మాత్రమే తెలుసు.

కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధ పూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపము సంతరించుకొనేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయములోనే కావడముతో నీలో రాత్రిపూట తా

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Madhura Meenakshi Temple Pillar is one of the most prominent Pandha power pillars. The statue of Amman is inscribed with a single stainless stone with fine panoramic eyes. The mother is special to the turquoise turmeric turmeric body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more