Maha shivratri 2023: మహాశివరాత్రి నాడు ఇవి తింటే మహాపాపం; ఏం తినొచ్చంటే!!
శివరాత్రి పర్వదినాన ఎటువంటి ఆహారం తినాలి ఏం చేయాలి అన్న దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే శివుడి పూజల ఫలితం వస్తుంది.
మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. బోళా శంకరుడు అయిన పరమశివుడు తన కృప కటాక్ష వీక్షణాలను భక్తుల పైన ప్రసరించే రోజు. ఎంతో విశిష్టమైన రోజు కావటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివరాత్రి పర్వదినాన భక్తజనంతో కిటకిటలాడుతాయి.

శివరాత్రి ఆహార నియమాలు పాటించటం అవసరం
భక్తులంతా ఉదయాన్నే లేచి, అభ్యంగనమాచరించి శివాలయాలకు వెళ్లి స్వామిని అభిషేకించుకుని, రోజంతా ఉపవాస దీక్షతో, రాత్రి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించి మనసును శివుడు పైనే లగ్నం చేసి ఆయన ఆశీస్సులను పొందడానికి ప్రయత్నిస్తారు. అటువంటి శివరాత్రి పర్వదినాన ఆహార నియమాలను పాటించడం ఎంతో అవసరమని పండితులు చెబుతున్నారు.

ఉపవాస దీక్షలో ఏం చెయ్యాలి .. ఏం తినాలి?
చాలామంది ఉపవాసం చేయాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది అనారోగ్య కారణాలతో, వృద్ధాప్యం వల్ల, లేదా చిన్నపిల్లలుగా ఉన్నవారు ఉపవాసం చెయ్యలేరు. అటువంటి వారికి శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్ష నుంచి మినహాయింపు ఉంది. అలాంటివారు ఉపవాసం చేయకున్నా మనసును శివుడు పైన లగ్నం చేస్తే సరిపోతుంది. అయితే కొంతమంది ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం చేసినప్పటికీ, ఉపవాసం పేరుతో తినకూడని పదార్థాలను తింటూ ఉంటారు. అయితే శివరాత్రి పర్వదినాన ఎటువంటి ఆహారం తినాలి ఏం చేయాలి అన్న దానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

పొరబాటున కూడా వీటిని తినకూడదు..
శివరాత్రి పర్వదినాన పొరపాటున కూడా ఎవరు మాంసాన్ని తినకూడదు. మద్యాన్ని సేవించకూడదు. కాఫీలు, టీలు త్రాగకూడదు. శివుడికి నివేదించిన నైవేద్యాన్ని కూడా ప్రసాదంగా తినకూడదు. శివరాత్రి పర్వదినాన పప్పులు, బియ్యం లేదా గోధుమలతో చేసినటువంటి ఆహారాన్ని పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎవరైనా వీటిని తింటే శివుడి కటాక్షం దొరకదు. అది మహా పాపంగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఫలాహారం మాత్రమే తీసుకోవాలి. ఏవైనా పండ్లను అది కూడా మితంగా తినవచ్చు. మనకు ఈ సీజన్ లో దొరికే ఏ పండ్లను అయినా మితంగా తీసుకోవాలి. అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు. చిలకడ దుంపలు కొద్దిగా పాలు ఆహారంగా తీసుకోవచ్చు.

ఉపవాసం చెయ్యాలన్న దాని వెనుక మర్మం ఇదే
అసలు శివరాత్రి పర్వదినం నాడు ఉపవాస దీక్షను ఆచరించటం వెనుక ఒక ముఖ్యమైన విశేషం ఉంది. ఎవరైతే శివరాత్రి నాడు ఉపవాస దీక్షతో జాగరణ ఉంటారో వారి మనసు శివుడి పైనే లగ్నం అవుతుంది. కడుపునిండా భోజనం చేస్తే శివుడి పైన ధ్యాసను లగ్నం చేయలేరన్న ఉద్దేశంతో ఉపవాస దీక్షను విధిగా చేర్చారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రం దీని నుండి మినహాయింపు ఉంటుందని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications