మే 31 నిర్జల ఏకాదశి.. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం; దరిద్రం పరార్!!
మే 31వ తేదీన నిర్జల ఏకాదశి. ఈరోజుకు అక్షయ తృతీయ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు ఎవరైతే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తారో వారికి సకల సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఈరోజు భూ, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనూ కలిసివస్తుందని, కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని చెబుతారు.
జేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశిగా చెబుతారు. ఈ సంవత్సరం మే 31వ తేదీన బుధవారం నాడు నిర్జల ఏకాదశి వస్తుంది. నిర్జల ఏకాదశి తిథి మే 30 వ తేదీన మధ్యాహ్నం 1:32 నిమిషాలకు ప్రారంభమై, మే 31వ తేదీ మధ్యాహ్నం 01:36 నిమిషాలకు ముగిస్తుంది. అయితే ఏదైనా ఉదయం వచ్చిన తిధిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మే 31వ తేదీని ఏకాదశి జరుపుకుంటారు.

ఏడాది పొడవునా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించలేకపోయిన వారు ఈ ఒక్కరోజు నిష్టతో లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరమంతా పూజ చేసిన ఫలితం వస్తుందని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజున నీరు, ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు.
నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణువుని పూజించాలి. విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా పెట్టాలి. విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది. విష్ణు భగవానుడుకి పసుపును సమర్పించాలి. ఉపవాసం పాటించి దానధర్మాలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.
అంతేకాదు ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు జల దానం చేసినా, అన్న దానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాదు కుండను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications