వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Phalguna Masam:ఫాల్గుణ మాసంలో ఏ దేవున్ని ఎలా పూజించాలి, కలిగే లాభాలు ఏంటి..?

|
Google Oneindia TeluguNews

ఫాల్గుణమాసం విశిష్టత

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్లోకం:- నరాడోలా గతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం
ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్

శ్రీమహా విష్ణువుకు ఇష్టమైన మాసాలలో ఫాల్గుణమాసం ఒకటి. పూర్ణిమ తిధిలో చంద్రుడు పూర్వఫల్గుణి లేదా ఉత్తరఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గుణమాసంగా పరిగణిస్తారు. ఈ మాసం విష్ణు దేవునికి ఇష్టమైన మాసం అంటుంది భాగవతం. ఈ మాసంలో విష్ణువుని పూజించి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టసిద్ది కలుగుతుందని భాగవతం ద్వార తెలుస్తుంది.

* ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు 'పయోవ్రతం' ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. ఫాల్గుణ మాసం అంటే చివరి నెల. 12 నెలల్లో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం, సంతోషానికి మార్గంగా భావిస్తారు. ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివర్లో వచ్చి.. వేసవి కాలానికి స్వాగతం పలుకుతుంది. అయితే ఫాల్గుణ మాసం అంటే మాత్రం త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.

Phalguna Masam 2023: Which God needs to be worshipped in this season and why

* ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.

* వసంత పంచమి నుండి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.

* హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి 'ఫల్గుణ' అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

* ఈ మాసంలో సమీపంలోని నదుల్లో స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ, ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న, పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు.

* దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే 'అమలక ఏకాదశి' వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని 'అమృత ఏకాదశి' గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హోలికా పూర్ణిమ, కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి- కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు.

ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఏమి ఉంది:- చవితినాడు 'సంకట గణేశ' వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి, అన్నదానం చేస్తారు.

దేవునికి ప్రత్యేక పూజలు:- ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఇబ్బందులు పడుతుంటారో వారు ఫాల్గుణమాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి. అదే విధంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీదేవిని భక్తి శద్ర్ధలతో ఆరాధిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

విష్ణువు ఆరాధన:- మీ శక్తి సామర్థ్యానికి తగ్గట్టు మీరు ఏదైనా విష్ణువు ఆలయానికి ఏదైనా గోమాతను దానమిస్తే మీకు విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పౌర్ణమి నాడు ఈశ్వరుడిని, శ్రీకృష్ణుడిని, లక్ష్మీదేవిని పూజించి 'లింగ పురాణా'న్ని దానంగా ఇవ్వాలి. ఫాల్గుణ మాసంలో వచ్చే అమల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణును ఆరాధిస్తే కచ్చితంగా ఆయన అనుగ్రహం లభిస్తుందని అంటారు.

ఫాల్గుణపూర్ణిమ రోజు శ్రీ క్రిష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనినే డోలోత్సవం అంటారు. మరి కొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అంటారు. ఇలా ఉయాలలో ఊపితే భక్తులందరికీ వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

* ఫాల్గుణమాసంలో ఓ రోజున రంగునీళ్లను చల్లుకోవాలని శాస్త్రాలలో చెప్పబడింది. మామిడి పువ్వులను కచ్చితంగా ఆరగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే రంగు పొడులను కూడా చల్లుకుంటారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తర ఫాల్గుణి, కలిసి వస్తే ఆరోజున మహాలక్ష్మీని ఆరాధించి స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది.

* పురాణాల ప్రకారం మామిడి చెట్టు కింద పార్వతీ దేవి శివుడి యొక్క అనుగ్రహం పొందుతుందట. అప్పటి నుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఫాల్గుణ మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ అనంతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు అంటారు.

English summary
Phalguna masam is liked by lord Mahavishnu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X