తెలంగాణాలో పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు జత కడితే.. కొత్త చర్చ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయం సాధించి, అధికార పీఠాన్ని దక్కించుకున్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేనల కూటమి ప్రస్థానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో తిరుగులేని జోడీగా నిలిచిన ఈ ఇద్దరు నేతలు, ఒకవేళ తెలంగాణ రాజకీయాల్లోనూ కలిసి అడుగులు వేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
తెలంగాణా పాలిటిక్స్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోడీ
ముఖ్యంగా హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహణకు ఎదురైన అడ్డంకులు, దానిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ "ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు.. ప్రాంతీయ విద్వేషాలు వద్దు" అని తెలంగాణ నేతలకు కౌంటర్ ఇవ్వడంతో ఈ చర్చ మరింత ముదిరింది. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఈ ఇద్దరు జతకట్టడం ప్రభావాన్ని చూపనుంది.

గ్రేటర్ హైదరాబాద్ లో 20-25సీట్లలో గెలుపోటములను శాసించే అవకాశం
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు ఖమ్మం, నిజామాబాద్ వంటి సరిహద్దు జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన సెటిలర్స్ ఓటర్లు భారీసంఖ్యలో ఉన్నారు. గతంలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్‌కు యువత, కాపు సామాజికవర్గంలో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ జతకడితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 20-25సీట్లలో గెలుపోటములను శాసించే శక్తిగా మారే అవకాశం ఉంది.
అప్పుడే రెడీ అవుతున్న ప్రత్యర్థి పార్టీలు
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చు. బాబు-పవన్ జోడీ తెలంగాణలో యాక్టివ్ అయితే, అది స్థానిక పార్టీలకు పెద్ద ఆయుధంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్, మరియు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు "తెలంగాణ గడ్డపై ఏపీ నేతల పెత్తనం ఏంటి?" అనే పాత నినాదాన్ని మళ్లీ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.
మళ్ళీ తెర మీదకు తెలంగాణా ఆత్మగౌరవ సెంటిమెంట్
పవన్ కళ్యాణ్, చంద్రబాబులను టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ సెంటిమెంట్‌ను మళ్లీ లేపి, రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. ఒకవేళ బాబు-పవన్ కూటమి తెలంగాణలో బలోపేతం కావాలని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఇరకాటంలో పడుతుంది. ఏపీ నేతలకు రేవంత్ రెడ్డి లొంగిపోతున్నారనే ముద్ర వేసేందుకు విపక్షాలు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే దూకుడు పెంచాయి.
చంద్రబాబు చాణక్యం, పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడైతే తెలంగాణాలో ఎఫెక్ట్
దశాబ్దం క్రితం ఉన్నంత తీవ్రస్థాయిలో ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ పనిచేస్తుందా అనేది సందేహమే. నేటి యువత ఉద్యోగాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి కృత్రిమంగా సెంటిమెంట్‌ను రగిలిస్తే ప్రజలు ఆదరించకపోవచ్చు. చంద్రబాబు చాణక్యం, పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడైతే తెలంగాణలో కచ్చితంగా ఒక బలమైన ఓటు బ్యాంక్‌ను ప్రభావితం చేయవచ్చు.













Click it and Unblock the Notifications