ఆత్మవిశ్వాసాన్ని నిద్ర లేపే అద్భుత మంత్రం ఈ గీతా శ్లోకం.. !!
ఆధునిక కాలంలో ఒత్తిడి, కుంగుబాటు, మానసిక అలసట వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు వెరసి, ఎప్పుడో ఒకప్పుడు చేతులు ఎత్తేయాలనే నిరాశ కలగడం సహజం. వేల సంవత్సరాల క్రితమే మహాభారత యుద్ధ రంగంలో అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి మానసిక వేదననే అనుభవించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అందించిన గీతోపదేశం ఒక్క గాండీవధారికి మాత్రమే పరిమితం కాదు, నేటి తరం ఎదుర్కొనే మానసిక సవాళ్లకు కూడా అద్భుతమైన దివ్యౌషధంగా పనిచేస్తుంది.
భగవద్గీతలోని రెండవ అధ్యాయం, మూడవ శ్లోకం మానసిక బలహీనతలను జయించి, బాధ్యతలను స్వీకరించడానికి అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. అర్జునుడు తీవ్రమైన ఆందోళనతో అస్త్రశస్త్రాలను వదిలేసి రథంపై కూలబడినప్పుడు, కృష్ణుడు అతనికి ఎలాంటి తప్పుడు ఓదార్పు ఇవ్వలేదు. బదులుగా, అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపేలా సూటిగా హితబోధ చేశాడు. నిరాశలో కూరుకుపోయిన ఏ వ్యక్తికైనా తక్షణ శక్తిని ఇచ్చే శ్లోకం ఇది.

ఆ బలహీనతను వదిలేయ్..
"క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే..
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప.."
అనే శ్లోకం ద్వారా కృష్ణుడు అర్జునుడికి మనోస్థైర్యాన్ని కల్పించాడు. దీని అర్థం.. "పార్థా, పిరికితనానికి లోనుకాకు. ఇది నీకు తగదు. నీ హృదయంలోని ఈ తుచ్ఛమైన బలహీనతను వీడి, యుద్ధానికి సిద్ధం అవ్వు.." అని ప్రబోధించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఓ అద్భుతమైన మానసికతత్వవేత్తగా వ్యవహరించాడు. అర్జునుడిలో పేరుకుపోయిన ఆ అసహాయత దయ, కరుణ వల్ల వచ్చింది కాదని, అది మనస్సు సృష్టించిన భ్రమ, బలహీనత మాత్రమేనని గుర్తించాడు.
శ్రీకృష్ణుడు అర్జునుడిని 'పార్థ', 'పరంతప' అనే పేర్లతో పిలిచాడు. పార్థ అంటే ఇంద్రుడి అంశతో జన్మించిన గొప్ప వీరుడు, కుంతీపుత్రుడని అర్థం. అలాగే పరంతప అంటే శత్రు సంహారకుడని అర్థం. ఇలాంటి అద్భుతమైన శక్తులు ఉన్న వీరుడు లోపలి శత్రువులైన భయం, మోహం, బద్ధకానికి మోకరిల్లడం తగదని కృష్ణుడు గుర్తుచేశాడు. శత్రువులతో పోరాడే ముందు, మన అంతరంగంలోని బలహీనతలతో యుద్ధం చేసి గెలవాలని శ్రీకృష్ణుడి ముఖ్య ఉద్దేశం.
నేటి ఆధునిక జీవితానికి గీతా సందేశం
నేటి కార్పొరేట్ ప్రపంచంలో లేదా వ్యక్తిగత జీవితంలో చిన్న సమస్య రాగానే తట్టుకోలేక చాలామంది కుప్పకూలిపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బంధాలలో ఏర్పడే ఘర్షణల వల్ల వెనకడుగు వేయాలని చూస్తారు. కృష్ణుడు చెప్పిన స్వయం నియంత్రణ, నిష్కామ కర్మ సిద్ధాంతాలు నేటికి కూడా సరిగ్గా వర్తిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో బిజినెస్ లీడర్లు, మోటివేషనల్ స్పీకర్లు అంగీకరిస్తున్నారు. ఈ శ్లోకం మన ఆలోచనా సరళిని సానుకూల ధోరణిలోకి మారుస్తుంది.
కష్టాల నుంచి పారిపోవడం మన సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం కాదని గీత స్పష్టం చేస్తోంది. ఒకవేళ అర్జునుడి నిర్ణయం నిజమైన జ్ఞానం లేదా దయతో కూడుకున్నదైతే, అతని మనస్సు ప్రశాంతంగా ఉండేది. దీనికి భిన్నంగా వణికిపోయాడు. కన్నీరు కార్చాడు. అంటే అతను కేవలం బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూశాడు. మనస్సు బలహీనపడిన ప్రతిసారీ "త్యక్త్వోత్తిష్ఠ" అంటే.. లే, నిలబడు, నీ కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వర్తించు అని మనకు మనమే చెప్పుకోవాలి.
జీవితంలోని ఒడిదొడుకుల మధ్య మనశ్శాంతిని కోల్పోకుండా ఉండడమే నిజమైన గెలుపు. మన ప్రాచీన గీతోపదేశం కేవలం మతపరమైన గ్రంథం కాదు, అది మానవ మనుగడకు దిశానిర్దేశం చేసే అద్భుతమైన జీవన శాస్త్రం. రోజువారీ జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా మనల్ని మానసికంగా సంసిద్ధం చేసే శక్తి ఈ ఒక్క శ్లోకంలో దాగి ఉంది. బలహీనత శారీరకమైనది కాదు, అది మనస్సులోనే ఉంటుందని గ్రహిస్తే ఎలాంటి కష్టాన్నైనా దాటవచ్చు.












Click it and Unblock the Notifications