• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఋషి పంచమి - వ్రతం పూజావిధానం: దీపారాధనకు కావాల్సిన వస్తువులు ఏవి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

తేది 11 సెప్టెంబర్ 2021 శనివారం రోజు ఋషి పంచమి. ఈ రోజు ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధ చేసి.. అలికి.. బియ్యపు పిండితో గాని రంగుల చూర్ణ ములతో గాని ముగ్గులు పెట్టి దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని మరీ పల్లముగా గానీ ఉండ కూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వరి పిండి (బియ్యపు పిండి) తో ముగ్గులు వేయాలి.

సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి ( పసుపును సుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి) దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో గాని క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దాని పై ఒక తమలపాకు నుంచి అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి. ఇపుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైఋతి దిశలో చేయవలెను.

దీపారాధనకు కావలసిన వస్తువులు :- దీపారాధన విధానము: దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిది గాని, మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో ( కర్పూర హారతికి వాడే వస్తువు) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి వెలిగించిన వత్తితో కుందిలోన1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించవలెను. తర్వాత చేయు కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వులనూనెగాని, కొబ్బరి నూనెగాని, ఆవు నెయ్యిగాని వాడ వచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

Rushi Panchami 2021:Know the significance, history and date of this vratham

ఘంటానాదము:- శ్లో. ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్ కుర్యాద్ఘంటార వంతత్ర దేవతాహ్వాహన లాంఛ నమ్

మనము ఆచ మనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని, చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆనీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను.

పూజకు కావలసిన వస్తువులు :- ఏ వ్రతమును (పూజకు) ఆచరించుచున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను, వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకోనవలెను), లేదా చిత్ర పటము, మండపమునకు మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరి కాయలు, పళ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గి పెట్టె, అగరవత్తులు, వస్త్ర, యజ్ఞో పవీతములు, తోరములు ( తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను దేవునికి పూజ చేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు.) ప్రత్యేక నివేదన ( పిండి వంటలు) పిమ్మట యజమానులు (పూజ చేసే వారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి.

ఈ నామములు మొత్తం 24 ఉన్నాయి.
1. " ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
2. " ఓం నారాయణాయ స్వాహా " అనుకుని ఒక సారి
3. " ఓం మాధ వాయ స్వాహా " అనుకుని ఒక సారి జలమును పుచ్చు కోవలెను. తరువాత
4. " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగుకోవాలి.
5. " ఓం విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు, బొటన వ్రేళ్లతో కళ్లు తుడుచుకోవాలి.
6. " ఓం మధు సూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురు కోవాలి.
7. " ఓం త్రివిక్ర మాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.
8. " ఓం వామనాయ నమః"
9. " ఓం శ్రీధ రాయ నమః" ఈ రెండు నామాలు స్మరిస్తూ తల పై కొంచెం నీళ్లు చల్లుకోవాలి.
10. " ఓం హృషీకేశాయ నమః" ఎడమ చేతితో నీళ్లు చల్లాలి.
11. " ఓం పద్మనాభాయ నమః" పాదాల పై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
12. " ఓం దామోద రాయ నమః" శిరస్సు పై జలమును ప్రోక్షించుకోవలెను.
13. " ఓం సంకర్షణాయ నమః" చేతి వ్రేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
14. " ఓం వాసుదేవాయ నమః" వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15. " ఓం ప్రద్యుమ్నాయ నమః"
16. ″ ఓం అనిరుద్దాయ నమః" నేత్రాలు తాకవలెను.
17. ″ ఓం పురుషోత్తమాయ నమః"
18. "ఓం అధోక్షజాయ నమః" రెండు చెవులూ తాకవలెను. 19. " ఓం నారసింహాయ నమ:
20. " ఓం అచ్యుతాయ నమః" బొడ్డును స్పృశించవలెను. 21. " ఓం జనార్ద నాయ నమః" చేతివ్రేళ్లతో వక్ష స్థలం, హృదయం తాకవలెను.
22. " ఓం ఉపేంద్రాయ నమః" చేతి కొనతో శిరస్సు తాక వలెను.
23. " ఓం హరయే నమః
24. " ఓం కృష్ణాయ నమః" కుడి మూపురమును ఎడమ చేతితోను, ఎడమ మూపుర మును కుడి చెతితోను తాకవలెను.

ఆచమనము వెంటనే సంకల్పము చెప్పుకోవలెను. ఆచమనము అయిన తరువాత కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను.

శ్లో. ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః యేతే షామవిరో ధేన బ్రహ్మకర్మ సమారభే.

ప్రాణాయామమ్య:- ఓం భూ: - ఓం భువః ఓం సువః - ఓం మహః - ఓం జనః ఓం తపః - ఓగ్o సత్యం - ఓం తత్ సవితుర్వ రేణ్యం భర్గో దెవస్య ధీమ హీధ యోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరోం అని సంకల్పము చెప్పుకొనవలెను.

సంకల్పము:- మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపేభరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీ శైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీ శైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను), కృష్ణా గోదార్యో: మధ్య ప్రదేశే (మనం ఏఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొన వలెను), శోభన గృహే ( అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ ఆస్మిన్ వర్త మానే వ్యావ హారిక చాంద్ర మానేన..............నామ సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలెను), అయనే, ( సంవత్సరమునకు రెండు అయనములు - ఉత్త రాయణము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం. పూజచేయునపుడు ఏ అయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను) ఋతు:, ( వసంత, గ్రీష్మ, వర్ష మొ. ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు) పక్షే, (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము, అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు) తిధౌ, ( ఆరోజు తిథి) వాసరే (ఆరోజు ఏ వార మనదీ చెప్పుకొని) శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే ఏవం గుణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీరామా ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్.... గోత్రస్య..... నామధేయః, శ్రీ మత్యః, గోత్రస్య, నామధేయస్య అనియు, స్త్రీ లైనచో శ్రీమతి, గోత్రవతి, నామధేయవతి, శ్రీ మత్యాః, గోత్ర వత్యాః, నామధేయవత్యాః అనియు ( పూజ చేయువారి గోత్రము, నామము చెప్పి) నామధేయస్యః దర్మ పత్నీ సమేతస్య ( పురుషులైనచో) మమ సహ కుటుంబస్య, క్షేమ స్థ్యైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్ధం సకలవిధ మనోవాంఛాఫల సిద్ద్యర్ధం, శ్రీరామ ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం ( ఏ దేవుని పూజించుచున్నాయో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని) సంభవద్భి రుపచారై: సంభవతానియమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి ( నాకు తోచిన రీతిలో, నాకు తోచిన విధముగా, భక్తి శ్రద్ధలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

తధంగ కలశ పూజాం కరిష్యే. పిదప కలశారాధనను చేయవలెను.

కలశ పూజను గూర్చిన వివరణ:- వెండి, రాగి, లేక కంచు గ్లా సులు ( లేదా పంచ పాత్రలు) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షింతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండువ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమ అద్దవలెను. ఇలా చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమునుగాని, కుంకుమనుగాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను. కుంకుమ అక్షతలువ గైరాబొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానులు ( ఒక్కరైతే ఒకరు, దంపతులు లైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడి చేతితో మూసివుంచి, ఇలా అనుకోవాలి. ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదవవలెను.

మంత్రం. కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాస్శ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మామధ్యే మాతృ గణాస్మృతాః, ఋగ్వేదో ధయజుర్వేద స్సామావేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

శ్లో. గంగైచ యమునే చైవ కృష్ణే, గోదావరి, సరస్వతీ, నర్మదా సింధు కావేరౌయో జలే స్మిన్ సన్నిధంకురు.

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీరామ. ( ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను) పూజార్ధం మమ దురితక్షయకార కాః కలశో దకేన ఓం దేవం సం ప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ఆకుతో గానీ చల్లాలి.

మార్జనము:- ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావ స్థాంగతో పివా యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతర శ్ముచి:
అని పిదపకాసిని అక్షతలు, పసుపు, గణపతి పై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్ఠాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ఠ అనగా
శ్రీ మహా గణాధి పతయేనమః ప్రాణ ప్రతిష్ఠా పన ముహూర్తస్సు ముహూర్తోస్తు తధాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో. శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నో పశాంతయే, సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే.

పిదప షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచార ములనగా ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి. పిదప షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచారములనగా ధ్యాన, ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి.

షోడశో పచార పూజాప్రారంభ:-

ధ్యానం: - శ్లో. ఓం శ్రీ రామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి అని శ్రీ రాముని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.

ఆవాహనం:- శ్లో. ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి. ఆవా హనార్ధం అక్షతాం సమర్పయామి. అనగా మనస్ఫూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సున అక్షతలు దేవుని పై వేయవలెను.

ఆసనం:- శ్లో. ఓం శ్రీ రామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చుండుట కై మంచి బంగరుపీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం:- శ్లో. ఓం శ్రీ రామ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకొనుట కై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ, ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

పాద్యం :- శ్లో. ఓం శ్రీరామ నమః పాదౌ:పాద్యం సమర్పయామి. దేవుడు కాళ్లు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనీయం:- శ్లో. ఓం శ్రీరామ నమః ఆచమనీయం సమర్పయామి. అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతొ ఒక మారు నీరు వదలవలెను.

* సూచన:- అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పల్లెము) లో వదలరాదు.

మధుపర్కం :- ఓం శ్రీ రామ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ... ఈ మధుపర్కాన్ని ఆయన ప్రతిమకు అద్దవలెను (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు

పంచామృత స్నానం :- ఓం శ్రీ రామ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.

శుద్ధోదక స్నానం :- ఓం శ్రీ రామనమః శుద్ధోదక స్నానం సమర్పయామి . పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .

వస్త్ర యుగ్మం :- ఓం శ్రీ రామనమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం :- ఓం శ్రీరామనమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను ఇదియును ప్రత్తితో చేయవచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి, కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.

గంధం :- ఓం శ్రీనమః గంధాన్ సమర్పయామి ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను. ఆభరణం :

శ్లో. స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే, భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత, ఓం శ్రీ రామనమః ఆభరణాన్ సమర్పయామి

అని స్వామికి మనము చేయించిన ఆభరణములను అలంకరించవలెను లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను.

ఆధాంగ పూజ:- నామాలను చదువుచు పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను. తరువాత శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ. దీనియందు 108 మంత్రములుండును. ఈ మంత్రములను చదువును పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను. పిదప అగరువత్తిని వెలిగించాలి.

ధూపం :- శ్లో. ఓం శ్రీ రామ నమః ధూప మాఘ్రాపయామి. ధూపం సమర్పయామి.
అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.

దీపం :- శ్లో. ఓం శ్రీరామ నమః సాక్షాత్ దీపం దర్శయామి... అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపు వత్తులతో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదవవలెను.

నైవేద్యం :- శ్లో. ఓం శ్రీరామ నైవేద్యం సమర్పయామి
అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరి కాయ మొదలగునవి ఒక పల్లెములోనికి తీసుకొని స్వామివద్ద నుంచి దాని పై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంటవాయిస్తూ
' ఓం భూర్భువస్సువః ఓం తత్ స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీయో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరి షించామి, ( ఋతంత్వా సత్యేత పరి షించామి అని రాత్రి చెప్పవలెను) అమృత మస్తు అమృతో పస్త రణమసి, ఓం ప్రాణాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో) స్వామికి నివేదనం చుపించాలి.

తదుపరి ఓం శ్రీరామ నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళ యామి' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర ) లో వదలాలి. తరువాత ' పాదౌప్రక్షాళ యామి' అని మరో సారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. పునః శుద్ధాచ మనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం

తాంబూలం:- శ్లో. ఓం శ్రీరామ నమః తాంబూలం సమర్పయామి... అని చెబుతూ తాంబూలమును ( మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ' తాంబూల చరవణానంతరం
శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం :- శ్లో. ఓం శ్రీరామ నమః కర్పూర నీరాజనం సమర్పయామి... అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, చిన్నగా ఘంట వాయించవలెను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్ధాచ మనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,

మంత్ర పుష్పం :- శ్లో. ఓం శ్రీరామ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణం:- శ్లో. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ, నమస్తే విఘ్న రాజాయ నమేస్తే విఘ్న నాశన, శ్లో. ప్రమధ గణ దేవేశ ప్రసిద్దే గణనాయక, ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే. శ్లో. యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే.| ఓం శ్రీరామ నమః ఆత్మ ప్రదక్షిణ చేసి ( అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి ( మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్లపై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి ) తరువాత స్వామి పై చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసినులై నమస్కరించుచూ

పునః పూజ :- ఓం రామ నమః పునః పుజాంచ కరిష్యే అని చెప్పుకొని, పంచపాత్ర లోని నీటిని చేతితో తాకి, అక్షతలు స్వామి పై చల్లుతూ ఈక్రింది మంత్రములు చదువుకొనవలెను. విశేషో పచారములు: ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని, నమస్కరిస్తూ ఈక్రింది శ్లోకమును చదువుకొనవలెను.

పూజాఫల సమర్పణమ్:- శ్లో. యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్ మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం శ్రీరామర్పణమస్తు.... అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీరామ ప్రసాదం శిరసాగృహ్నామి' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

ఓం శ్రీ రామ నమః యధాస్థానం ప్రవేశయామి. శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు. పూజా విధానం సంపూర్ణం.

తీర్ధ ప్రాశనమ్ :- శ్లో. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్, సమస్త పాపక్ష యకరం శ్రీరామ పాదో దకం పావనం శుభమ్.... అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను.

English summary
11th September marks the Rishi Panchami.One should do pooja in a particular manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X