నేడు మోహినీ ఏకాదశి.. అష్టైశ్వర్యాలతో లక్ష్మీ కటాక్షం కోసం ఇలా చెయ్యండి!!
హిందూ ధర్మ శాస్త్రంలో ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక నేడు వైశాఖమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథిలో మోహినీ ఏకాదశి వస్తుంది. మోహినీ ఏకాదశి మే 18న ఉదయం 11.24 నిమిషాలకు ప్రారంభమై, మే 19వ తేదీ ఉదయం 1. 52 నిమిషాలకు ముగుస్తుంది. మోహినీ ఏకాదశి కి సంబంధించి పరణ సమయం మే 20వ తేదీ ఉదయం 5.27 నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటలకు ముగిస్తుంది.
మోహినీ ఏకాదశి శుభదినం
హిందూమతంలో మోహినీ ఏకాదశి చాలా పవిత్రమైంది. ఫలవంతమైంది. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణువును అత్యంత బాధ్యతతో పూజిస్తారో వారికి జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈరోజు విష్ణువుని నిష్ఠతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధించడంతోపాటు, ముక్తికి మార్గం సుగమమవుతుంది. ఇక ఈ సంవత్సరం మోహిని ఏకాదశి చాలా శుభకరమైన దినంగా చెప్పవచ్చు.

మోహినీ ఏకాదశినాడు శుభయోగం
మోహిని ఏకాదశి రోజు ఒక శుభయోగం ఆవిర్భవిస్తుంది. ఈరోజు ఉదయం 11: 23 నిమిషాలకు సిద్ధి యోగం ప్రారంభమై మే 20వ తేదీన మధ్యాహ్నం 12.9 నిమిషాల వరకు పొడిగించబడుతుంది. క్షీరసాగరాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని పంచుకోవడానికి దేవతలు, రాక్షసుల మధ్య గొడవ జరిగినప్పుడు ఆ గొడవ పరిష్కరించడానికి విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి అక్కడ తన వశీకరణతో వారిని వలలో వేసుకుని దేవతలకు అమృతాన్ని పంచినరోజు మోహిని ఏకాదశిగా చెబుతారు.
మోహినీ ఏకాదశి నాడు ఇవి దానం చెయ్యండి
ఎవరైతే మోహినీ ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణ భక్తితో, విశ్వాసంతో ఆచరిస్తారో వారికి చాలా పుణ్యం లభిస్తుంది. మోహిని ఏకాదశి రోజు పసుపు రంగు దుస్తులు, పండ్లు, ధాన్యాలు మొదలైనవి దానం చేయాలి. మోహిని ఏకాదశి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్షను ఆచరిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి విష్ణు సాయుజ్యం లభిస్తుంది.
మోహినీ ఏకాదశి నాడు ఇలా చెయ్యండి
మోహిని ఏకాదశి నాడు విష్ణువును పూజించేవారు సూర్యోదయానికి ముందే భోజనం చేయాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి.ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. విష్ణు సహస్రనామం పాటించడం మంచిది. ఏకాదశి తిధి ముగిసే వరకు ఉపవాసాన్ని పాటిస్తూ విష్ణుమూర్తిని ధ్యానం చేయాలి. రాత్రంతా జాగరణ చేయాలి. బ్రాహ్మణులకు, పేదలకు వస్త్రాలు, ఆహారం దానం చేయాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటించి నిష్టతో విష్ణు పూజలు చేయాలి.
లక్ష్మీ కటాక్షం కోసం ఇలా చెయ్యండి
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మోహిని ఏకాదశి నాడు విష్ణువుకి ఆవుపాలతో చేసిన పాయసాన్ని సమర్పించి, లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అంతేకాదు నేడు ప్రయాణికులకు నీటిని అందించి, జంతువులకు మరియు పక్షులకు నీటిని అందుబాటులో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications