వైకుంఠ ఏకాదశి: ఆలయాల్లో ఉత్తర ద్వారదర్శనం చేసుకున్న మంత్రులు, ప్రముఖులు!!
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాల్లో, తెల్లవారు జాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో మంత్రులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. యాదగిరిగుట్టలో ఉదయం 6 గంటల 48 నిమిషాలకు ప్రధానాలయంలో నరసింహస్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు.
రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు శాసనసభ్యులు, నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ శాసనసభ్యులు, న్యాయమూర్తులు,స్థానికులు,భక్తులు మరియు ఆలయ అధికారులు ఉత్సాతర ద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ బట్టల బజార్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రి కొండా సురేఖ వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎండోమెంట్ పరిధిలో రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు కొరకు ప్రభుత్వ పాలన కొనసాగించడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాల పునర్నిర్మాణ పనులను కొనసాగిస్తామన్నారు.
ఇదిలా ఉంటే దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి క్షేత్రంలో స్వామివారు తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. సుమారు లక్ష మంది భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుక కన్నులపండుగగా జరిగింది.
వరంగల్ బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి కొండా సురేఖ పూజలు#KondaSurekha #LordVenkateswara #Warangal #VaikuntaEkadasi #Oneindiatelugu pic.twitter.com/bJ1oY5tZEC
— oneindiatelugu (@oneindiatelugu) December 23, 2023
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూర్ ఎమ్మెల్యే జి. వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్మపురిలో వైకుంఠ ద్వారం దర్శించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరిలో, చిన్న ముల్కనూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డిలోని వైకుంఠపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పారుపల్లి వీధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఎమ్మెల్యే హరీష్ రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.మరోవైపు తిరుమల తిరుపతిలో తెల్లవారు జామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ రోజు నుంచి పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. తిరుమలలో అన్ని కంపార్టుమెంట్లు నిండి తిరువాడ భక్తులతో కిటకిటలాడుతోంది.












Click it and Unblock the Notifications