వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vaikunta Ekadasi 2020:ఈ పండగ ప్రాధాన్యత ఏంటి..? బియ్యం పదార్థాలు ఎందుకు తినకూడదు..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం. విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.

పద్మ పురాణం ప్రకారం....

పద్మ పురాణం ప్రకారం....

పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు.

బియ్యం పదార్థాలు ఎందుకు తినకూడదు

బియ్యం పదార్థాలు ఎందుకు తినకూడదు

వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

పండగ ఆచరించు విధానం

పండగ ఆచరించు విధానం


ఈ రోజు పూర్తిగా ఉపవసించాలి, తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈ రోజు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం, దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

 వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల


తిరుమ‌ల కొండ‌ వైకుంఠ ఏకాద‌శికి ముస్తాబైంది. ఈ రోజు అర్ధ‌రాత్రి 12.05 గంట‌ల‌కు శ్రీవారి ఆల‌య వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. స్వామివారికి అభిషేక సేవ‌, నిత్య కైంకర్యాల అనంత‌రం 4.30 గంట‌ల‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ప్రారంభం కానున్నాయి. ఉద‌యం 8 గంట‌ల నుంచి స‌ర్వ ద‌ర్శ‌నం ప్రారంభం కాగా కోవ‌డ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌ది రోజుల వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాల‌కు ఏర్పాట్లు చేసారు.

ఏకాదశి వ్రతం నియమాలు
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.

English summary
There are 24 unicorns in a year. Vaikuntha Ekadashi or Mukkoti Ekadashi is the pure Ekadashi of Dhanurmasa which occurs before the sun changes to Uttarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X