PM SVANidhi: కొత్తవారికే ఛాన్స్, ఆరో వసంతంలోకి అడుగేసిన వేళ..
రోడ్డు పక్కన వీధి వ్యాపారం చేసుకునే చిన్న, చిరువ్యాపారులకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'పీఎం స్వనిధి' (ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి) విజయవంతంగా ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాటికి ఈ పథకం ప్రారంభమై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీధి వ్యాపారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న చిరువ్యాపారులను దేశ అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో పీఎం స్వనిధి సాధించిన విజయాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం కేవలం అప్పులిచ్చే పథకం మాత్రమే కాదని.. చిరువ్యాపారుల 'విశ్వాసం, గౌరవం, సాధికారత'కు నిదర్శనమని ప్రధాని అభివర్ణించారు.

జీవితాలను మార్చేసిన పూచీకత్తు లేని రుణాలు
ఆరో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "#6YearsofPMSVANidhi ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి గ్యారెంటీ (పూచీకత్తు) లేకుండా రుణాలు ఇవ్వడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, కొత్త ఆర్థిక అవకాశాలను కల్పించడం ద్వారా ఈ పథకం అసంఖ్యాక వీధి వ్యాపారుల జీవితాలను పూర్తిగా మార్చివేసింది" అని పేర్కొన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్న లబ్ధిదారుల దృఢ సంకల్పానికి, వారి వ్యాపార స్ఫూర్తికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని తన పోస్ట్‌లో రాశారు.
రూ.17,800 కోట్ల భారీ సాయం.. డిజిటల్ వైపు అడుగులు
కరోనా కాలంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులను ఆదుకోవడానికి 2020లో ప్రారంభమైన ఈ పథకం.. భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద రక్షణ కవచంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ పథకం కింద ఇప్పటివరకు 1.12 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయి. దేశవ్యాప్తంగా 75.5 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఏకంగా రూ.17,800 కోట్లకు పైగా రుణ సాయాన్ని అందుకుని తమ జీవనోపాధిని మెరుగుపరుచుకున్నారు. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా, చిన్న వ్యాపారులను డిజిటల్ టెక్నాలజీ వైపు నడిపించడంలో కూడా ఈ పథకం సఫలమైంది. సుమారు 55 లక్షల మంది వీధి వ్యాపారులు ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్‌పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు జరుపుతూ తమ వ్యాపారాలను స్థిరపరుచుకున్నారు.
మహిళలు, అట్టడుగు వర్గాలకే పెద్దపీట
పీఎం స్వనిధి పథకం సాధించిన మరో గొప్ప విజయం ఏంటంటే.. దీని ద్వారా రుణం పొందిన వారిలో 95 శాతం మంది జీవితంలో మొదటిసారిగా ఒక అధికారిక బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి లోన్ తీసుకున్నవారే కావడం విశేషం. వడ్డీ వ్యాపారుల భారీ బారిన పడకుండా ఈ పథకం చిరువ్యాపారులను కాపాడింది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషించింది.
మొత్తం లబ్ధిదారులలో 46 శాతం మంది మహిళలు ఉండటం లింగ సమానత్వానికి, మహిళా సాధికారతకు అద్దం పడుతోంది. అలాగే లబ్ధిదారులలో 70 శాతం మంది అట్టడుగు వర్గాల వారే ఉన్నారని అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. గతంలో బ్యాంకుల మెట్లు ఎక్కే అవకాశం కూడా లేని లక్షలాది మందికి పీఎం స్వనిధి నూతన ద్వారాలను తెరిచింది. చిన్న వ్యాపారులను కేవలం రోడ్డు పక్కన వ్యాపారులుగా కాకుండా, భారతదేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వాములుగా గుర్తించాలనే సరికొత్త దృక్పథానికి ఈ పథకం విజయమే నిదర్శనం.














Click it and Unblock the Notifications