రెండు దశల్లో జమిలికి ఫిక్స్ - ఏపీ, తెలంగాణలో ఎన్నికలు అప్పుడే...!?
జమిలి ఎన్నికల పై కేంద్రం తుది కసరత్తు చేస్తోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు ఆమోదానికి మంత్రాంగం మొదలు పెట్టింది. చాలా కాలంగా జమిలి ఎన్నికల పైన బీజేపీ నాయకత్వం ఫోకస్ చేసింది. న్యాయపరమైన సమస్యలు ఎదురు కాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. కసరత్తు తుది దశకు చేర్చింది. రెండు దశల్లో జమిలి అమలు కు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పైనా స్పష్టత వస్తోంది.
ఒకే దేశం.. ఒకే ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికల నిర్వహణ పైన తుది ప్రక్రియకు రంగం సిద్దం అవుతోంది. ఈ మేరకు రోడ్ మ్యాప్ దాదాపు ఖరారైంది. రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా, తరచూ ఎన్నికలు జరుగకుండా నిరోధించేందుకు వీలుగా రెండు దశల నమూనాపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) కీలక సిఫారసులు చేయనున్నట్లు తెలుస్తోంది. దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎన్నికల చక్రం పరిధిలోకి తీసుకురావడానికి బదులుగా, 2029, 2034లో రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ప్రతిపాదన ప్రకారం, మొదటి దశలో దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్‌సభ ఎన్నికలతో అనుసంధానించే అవకాశం కనిపిస్తోంది. మిగిలిని రాష్ట్రాలను 2034 దశలోకి తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్..!
జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2026 వానకాల సమావేశాల చివరి వారంలోని మొదటి రోజున తన సిఫార్సులను సమర్పించాల్సి ఉన్నది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, నియంత్రణ సంస్థలు, పరిపాలన అధికారులతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించనున్నారు. కాగా, 2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదు. అయితే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీల గడువు ముగుస్తున్నది. ఆయా అసెంబ్లీల కాలాన్ని 5 నెలల నుంచి ఏడాది వరకు పొడిగించాల్సి ఉంటుంది. ఇక బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువు 2030-31లో ముగియనున్నది. వాటి గడువును ఒకటి నుంచి రెండేండ్లు తగ్గించాల్సి వస్తుంది. అయితే, ఇంతటి భారీ సంస్కరణకు పార్లమెంట్ శాసనపరమైన మార్పులు చేయడంతోపాటు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమవుతుంది. దీంతో.. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదించి నా.. ప్రత్యేక సమావేశాల్లో చర్చించి ఆమోదం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.













Click it and Unblock the Notifications