vastu tips: వాస్తు ప్రకారం పూజ గదిలో ‘కలకత్తా మార్కెట్’ పెట్టొద్దు!
ఇల్లు ఎంత అందంగా, విలాసవంతంగా ఉన్నా పూజా గదిలో అడుగుపెట్టగానే వచ్చే ఆ ప్రశాంతతే వేరు. హిందూ సంప్రదాయంలో పూజా మందిరం అనేది కేవలం దేవుడిని కొలిచే స్థలం మాత్రమే కాదు, అది ఇల్లంతటికీ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ఒక పవిత్ర కేంద్రం. అయితే, చాలామంది పూజా గదిని ఏర్పాటు చేసుకునేటప్పుడు, విగ్రహాలను అమర్చేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాస్తు శాస్త్రం, ఆధ్యాత్మిక నిపుణుల ప్రకారం ఇంటి గుడిని ఎలా సర్దుకోవాలి, విగ్రహాలను ఏ క్రమంలో ఉంచాలి అనే విషయాలపై కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.
ఈశాన్య మూల అత్యంత ప్రీతికరం
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఈశాన్య మూల దేవతలకు అత్యంత ప్రీతికరమైన స్థానం. కాబట్టి పూజా మందిరాన్ని ఎల్లప్పుడూ ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవడం అత్యంత శుభప్రదం. ఒకవేళ అక్కడ కుదరని పక్షంలో తూర్పు లేదా ఉత్తర దిశలను ఎంచుకోవచ్చు. అలాగే మనం పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవడం మంచిది. అయితే, మెట్ల కింద, స్టోర్ రూమ్‌లలో లేదా బాత్రూమ్‌లకు ఆనుకుని పూజా స్థలాన్ని అస్సలు ఏర్పాటు చేయకూడదు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొదటగా విఘ్నేశ్వరుడు
ఏ శుభకార్యమైనా, పూజ అయినా మనం మొదట ప్రార్థించేది విఘ్ననాయకుడినే కాబట్టి పూజా మందిరంలో కూడా గణపతికే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇందుకోసం పూజా పీఠంపై వినాయకుడిని మధ్యలో లేదా కేంద్ర స్థానంలో ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత గణేషుడికి ఒకవైపు లక్ష్మీదేవి, దుర్గాదేవి లేదా సరస్వతీ దేవి వంటి అమ్మవారి చిత్రపటాలను, మరోవైపు శివుడు, మహావిష్ణువు, శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడి లాంటి పురుష దేవతల విగ్రహాలను అమర్చాలి. మీ కుటుంబానికి కులదైవం లేదా ఇలవేల్పు ఉంటే, వారికి పూజా పీఠంపై ప్రత్యేకమైన, ప్రముఖమైన స్థానాన్ని కల్పించడం సంప్రదాయం.
అమరిక విషయంలో పద్దతి
దేవుడి విగ్రహాలను సర్దేటప్పుడు వాటి ఎత్తు, అమరిక విషయంలో కూడా ఒక పద్ధతిని పాటించాలి. విగ్రహాలను లేదా ఫోటోలను ఎప్పుడూ నేరుగా నేలపై పెట్టకుండా, ఒక చిన్న చెక్క పీట లేదా వేదికపైనే ఉంచాలి. పెద్ద సైజు విగ్రహాలను వెనుక భాగంలో, చిన్నవాటిని ముందు భాగంలో అమర్చాలి. ఒక దేవుడి ఫోటో ముందు మరో ఫోటో అడ్డుగా ఉండి, ముఖం కనిపించకుండా పోకూడదు. ప్రతి విగ్రహం స్పష్టంగా దర్శనమిచ్చేలా సమతుల్యంగా సర్దాలి.
అవసరానికి మించి వద్దు
చాలామంది ఎక్కడికి వెళ్లినా దేవుడి ఫోటోలు కొనేసి పూజా గది నింపేస్తుంటారు. కానీ అవసరానికి మించి విగ్రహాలను పోగు చేయకూడదు. మనం రోజూ నిష్ఠగా పూజించగలిగే కొన్ని ముఖ్యమైన విగ్రహాలు ఉంటేనే మంచిది. దీనివల్ల గది పరిశుభ్రంగా ఉండటమే కాకుండా, పూజలో ఏకాగ్రత కుదురుతుంది. ఒకవేళ ఇంట్లో విరిగిన లేదా పాడైన విగ్రహాలు ఉంటే, వాటిని ఇంట్లో ఉంచకుండా గౌరవప్రదంగా పారే నీటిలో నిమజ్జనం చేయడం లేదా గుడికి అప్పగించడం చేయాలి. పూజకు ఎల్లప్పుడూ రాగి, ఇత్తడి లేదా వెండి పాత్రలను ఉపయోగించడం శుభప్రదం.
పూజా గదిలో నిత్య శుభ్రత ఎంతో ముఖ్యం. నిన్నటి పూల మాలలు, వాడిపోయిన పువ్వులు, పాత నైవేద్యాలను ఉదయాన్నే తీసేయాలి. దేవుడి గిన్నెలోని నీటిని ప్రతిరోజూ మార్చాలి. ప్రతిరోజూ దీపం, అగరబత్తి వెలిగించి నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. వాస్తు నియమాలు, దిశలు, పాత్రలు ఇవన్నీ బాహ్య శుద్ధి కోసమే అయినా, అన్నింటికంటే గొప్పది నిష్కల్మషమైన భక్తి. మనసులో ప్రశాంతతతో, భగవంతునిపై పూర్తి విశ్వాసంతో, ప్రేమతో చేసే చిన్న నమస్కారమైనా ఆ పరమాత్ముడికి ప్రీతికరమే అవుతుంది.














Click it and Unblock the Notifications