vastu tips: ఇంట్లో అనవసరపు చిరాకులు కలుగుతున్నాయా? అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టు, చాలామంది మంచి అందమైన ఇల్లు, కూర్చుని తిన్న తరగని సంపద ఉన్నా ఇంట్లో ఉంటే ప్రశాంతత లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. ఇంటికి వెళ్లాలంటే చిరాకు పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించుకుని, వాస్తు నిపుణుల సూచనల మేరకు వాస్తు చిట్కాలను పాటిస్తే ప్రశాంత జీవితాన్ని సాగించడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఇక వాస్తు శాస్త్ర నిపుణులు ముఖ్యంగా సూచిస్తున్న వివిధ వాస్తు చిట్కాల వివరాల్లోకి వెళితే

వాస్తు నియమాలను పాటిస్తూ గృహ నిర్మాణం చెయ్యాలి
ఇంట్లో పాజిటివిటీని, శక్తిని పెంపొందించి ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఇంటి వాస్తును తప్పనిసరిగా పాటించవలసినదే. వాస్తు శాస్త్రంలో సూచించిన విధంగా ఇంటి నిర్మాణంలో సమగ్రత ఉండాలి. దిశలకు అనుగుణంగా వాస్తు నియమాల ప్రకారం ఇంటి నిర్మాణం జరగాలి. ఏమాత్రం ఇంటి నిర్మాణంలో వాస్తు దోషాలు ఉన్నా ఆ ప్రభావం ఆ కుటుంబంపై తప్పనిసరిగా ఉంటుంది. కనుక ఏ దిశలో ఏ గది ఉండాలి, ఏ గది కొలతలు ఏ విధంగా ఉండాలి? తదితర అన్ని సమగ్ర వివరాలతో వాస్తు నియమాలను పాటిస్తూ గృహ నిర్మాణం చేయాలి.

ఇంటికి అనేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఉండరాదు
వాస్తు శాస్త్రం మానవ శరీరంలోని నోటితో ఇంటి ప్రధాన ద్వారాన్ని పోల్చింది. ఇక ఇంటి ప్రధాన ద్వారం విషయానికి వస్తే ఇంటి శక్తికి ఇది మూలంగా భావిస్తారు. ఇంటికి చాలా ప్రవేశాలు, చాలా నిష్క్రమణలు ఉంటే ఇంట్లోని శక్తి బలహీనమవుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కనుక ఇంటిని నిర్మించే సమయంలో ఎక్కువ ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు లేకుండా చూసుకోవాలని సూచించబడింది.

కిటికీలు పెద్దగా ఉండాలి, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడాలి
ఇక ఇంటి నిర్మాణంలో కిటికీలు పెద్దగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలో నుండి గాలి, వెలుతురు ధారాళంగా వస్తే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లోకి సూర్యకాంతి పడడం భౌతిక జీవితానికి శక్తినిచ్చే వనరు మాత్రమే కాకుండా, ఇది ఇంట్లోని వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. గాలి, వెలుతురు బాగా వచ్చే ఇంట్లో ఉండే వ్యక్తులు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని శాస్త్రీయంగా నిరూపించబడింది. అందుకే కిటికీలు పెద్దగా ఉంటే ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చి ఆ ఇంట్లో ఉన్న వారికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా గొప్పగా ఉంటుందని వాస్తు శాస్త్రం తెలిపింది.

బెడ్ రూమ్ లో ఇలా ఉంటే చిరాకులే ... బెడ్ రూమ్ ఇలా ఉండకూడదు
మంచి నిద్ర కోసం, బెడ్‌రూమ్ చుట్టూ మరియు పైన ఉన్న నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మంచం నేరుగా మెట్ల క్రింద, బీమ్ లేదా వాష్‌రూమ్ కింద ఉండకూడదు" అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పడక గది విషయంలో, నిద్ర విధానాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మానసిక చిరాకుల నుండి బయటపడతామని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా వాస్తు దోషాలు ఉంటే నిద్రా భంగం కలుగుతుంది. అంతేకాక దాని ప్రభావం మానసిక స్థితిపై పడుతుంది.

ఇంట్లో అద్దాలను ఎక్కువగా పెట్టినా ప్రతికూల ఫలితాలు
ఇక ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా ఇంటి నిండా ఎక్కడపడితే అక్కడ అద్దాలను పెట్టినా అవి ఇంట్లో వ్యక్తులకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో అద్దాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అద్దాలు నెగటివ్ ఎనర్జీకి కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రదేశాలలో అద్దాలను ఉంచకపోతే అవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి అని చెప్పడంలో సందేహం లేదని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే, మానసిక చిరాకుల నుండి బయట పడాలంటే ఆఫీస్ వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్న చిన్నచిన్న వాస్తు చిట్కాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications